ఫోటోలో ఒకరు షారూక్ ఖాన్… అందరికీ తెలిసిన మొహమే… కానీ ఫోటోలో తనకు పొరుగున ఉన్నది ఎవరు..? అవును, పొరుగింటాయనే… అచ్చంగా షారూక్ ఖాన్ పక్కిల్లే తనది… ముంబైలో మన్నత్‌గా పిలవబడే షారూక్ ఖాన్ నివాసం సీఫేస్ పక్కనే నివసించే ఈయన పేరు సుభాష్ రున్వల్… అంతటి షారూక్ ఇంటి పక్క ఇల్లు అంటే ఆ రేంజ్ ధనికుడే కదా అంటారా..? అవును, ప్రస్తుతం ఆయన ఆస్తి విలువ 11,500 కోట్లు…
అబ్బే, అలాంటోళ్లు మన ఆర్థిక రాజధాని ముంబైలో బోలెడు మంది ఉంటారు, అదే సీఫేస్‌లో అదే రేంజ్ ధనికులకు కూడా బోలెడు ఇళ్లున్నాయి… మరి ఈయన స్పెషాలిటీ ఏమిటట…? ఉంది… సదరు సుభాష్ రున్వల్ ముంబైకి 100 రూపాయలు జేబులో పెట్టుకుని వచ్చాడు… సేమ్ షారూక్ ఖాన్… అప్పట్లో షారూక్ కూడా నథింగ్ కదా… ఇప్పుడు ఎన్ని వేల కోట్లున్నాయో తనకే లెక్క తెలియదు… బాలీవుడ్ టాప్ స్టార్… నంబర్ వన్… మరి సుభాష్..? చెప్పుకుందాం…
ఇప్పుడు రున్వల్ వయస్సు 80 ఏళ్లు… మహారాష్ట్రలో ధులియా అనే చిన్న పట్టణానికి చెందినవాడు… చిన్నప్పటి నుంచీ తల్లిదండ్రులు అత్యవసరాలకు కూడా డబ్బులకు అవస్థలు పడ్డ రోజుల్ని చూశాడు… పూణెలో చదువుకున్నాడు… కామర్స్ డిగ్రీ అయిపోయింది… అప్పటికి 21 ఏళ్లు… కనీసం మంచి అకౌంటెంట్ జాబ్ దొరక్కపోదు అనుకుని, 1964లో కష్టమ్మీద 100 రూపాయలు జమచేసుకుని, వాటితో ముంబై బస్సెక్కాడు…
Ads
కాస్త కష్టపడ్డాడు… ఏవో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ సీఏ చదువుకున్నాడు… Ernst & Ernst లో 1967లో జాబ్ వచ్చింది… అది చాలు అనుకోలేదు… మంచి హైపేయింగ్ జాబ్ ఆఫర్ వస్తే అమెరికా వెళ్లాడు… అక్కడ జీవనశైలి నచ్చలేదు… తిరిగి వచ్చేశాడు… ఏదో కెమికల్ కంపెనీలో చేరాడు… ఐనా ఏదో అసంతృప్తి… ధైర్యం చేసి 1978లో తను సొంత వ్యాపారాలు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు… రియల్ ఎస్టేట్‌లో అడుగుపెట్టాడు…
చిన్నచిన్నగా చేస్తే లాభం లేదనుకున్నాడు… థానేలో 22 ఎకరాల ప్రాపర్టీతో మొదలుపెట్టాడు… పది వేల చదరపు అడుగుల హౌజింగ్ సొసైటీ ఒకటి కీర్తికార్ అపార్ట్‌మెంట్స్ పేరిట కట్టాడు… చాలా చౌకగా ఆఫర్ చేయబడిన అపార్ట్‌మెంట్స్… బాగా సక్సెసైంది,,, 1981లో 16 టవర్స్ రున్వల్ నగర్ పేరిట మరో ప్రాజెక్టు… అదీ క్లిక్కయింది… స్టీల్, ఫార్మా రంగాల్లో కూడా మళ్లాడు… అందులో ఫెయిల్యూర్… మళ్లీ రియల్ ఎస్టేట్ మీదే కాన్సంట్రేట్ చేశాడు…
పేద, మధ్యతరగతి వారికి సొంత ఇల్లు అనేది ఓ కల… పైగా ముంబై వంటి నగరంలో ఓ కొంప కలిగి ఉండటం అంటే తమాషా కాదు… అదుగో ఆ కలలపైనే తన వ్యాపారాన్ని నిర్మించుకున్నాడు… చీప్ అండ్ బెస్ట్… తన ప్రాజెక్టులన్నీ అవే… దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతకంతకూ పెరిగిపోయింది… ఇద్దరు కొడుకుల్ని ఎంబీఏ చదివించి, తన వ్యాపారంలోనే దింపాడు… ములుంద్‌లో ఆర్ మాల్ పేరిట 2002లో ఓ పెద్ద మాల్ కట్టాడు… అమితాబ్ బచ్చన్‌ను తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేయించాడు… సింగపూర్ ప్రభుత్వ కంపెనీ ఒకటి ముందుకొస్తే దాని సహకారంతో ఘట్కోపర్‌లో 12 లక్షల చదరపు అడుగుల మరో ఆర్ సిటీ మాల్ కట్టాడు…
తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు తను ‘వన్ రూం కిచెన్’ అపార్ట్‌మెంట్‌లో బతికేవాడు… ఒక గది, కిచెన్, బాత్రూం… అంతే… తరువాత మెల్లిగా కూడదీసుకుని టూబెడ్రూం ఫ్లాట్‌కు మారాడు… డియోనర్‌లో ఓ ఇండిపెండెంట్ ఇల్లు కొన్నాడు… ఇప్పుడు పూణెలో తనకు ఆరు ఎకరాల రున్వల్ ఎస్టేట్ ఉంది… తరువాత షారూక్ ఖాన్ ఇంటి పక్కనే ఇల్లు దొరికింది… కొనేశాడు… అత్యంత ఖరీదైన ఆ పరిసరాల్లో అందరూ ఈ రేంజే… కానీ వంద రూపాయలతో కెరీర్ స్టార్ట్ చేసి, షారూక్ ఖాన్ ‘పక్కింటాయన’గా ఎదిగిన ఓ సక్సెస్ స్టోరీ రున్వల్‌ది… అదీ విశేషం…
Share this Article