Nancharaiah Merugumala…….. ‘ఒంటి కన్ను జాక్’ (హమాస్ నేత) దెయిఫ్ మొన్న 1200 ఇజ్రాయెలీల ప్రాణాలు తీసే ప్లాన్ వేస్తే… మరో ‘ఒన్ అయిడ్ జాక్’ శివరాసన్ 32 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీని దగ్గరుండి మరీ చంపించిన టైగర్ల వ్యూహకర్త! ఉగ్రవాద సంస్థల ‘మాస్టర్ మైండ్ల’కు ఒక కన్ను పోయినా మెదడు బాగానే పనిచేస్తుందట!
……………………….
వారం రోజుల యూదుల మ్యూజిక్ ఫెస్టివల్ సుక్కోత్ ముగింపు దశకు చేరిన శనివారం ఇజ్రాయెల్ లోకి వేలాది రాకెట్లు దూసుకొచ్చాయి. 1200 మందికి పైగా ఇజ్రాయెలీలు పాలస్తీనా విమోచన తీవ్రవాద సంస్థ హమాస్ జరిపిన ఈ మెరుపు దాడుల్లో మరణించారు. గాజా పట్టీ ప్రాంతంలో పాలస్తీనా అరబ్బులను ఓపెనెయిర్ జైల్లో బంధించిన నేరానికి ప్రతీకారంగా–హమస్ చేసిన దిగ్భ్రాంతికర దాడికి పథకం రూపొందించింది మొహమ్మద్ దెయిఫ్ (58).
Ads
హమాస్ అనుబంధ సంస్థ ఇజ్జెదీన్ అల్ ఖాసమ్ బ్రిగేడ్స్ నేత దెయిఫ్. గాజా హమాస్ నేత యాహ్యా సిన్వార్ తో కలిసి ‘తూఫాన్ అల్–అక్సా’ పేరుతో రాకెట్ల వర్షం యూదు రాజ్య భూభాగాలపై కురిపించాలని నిర్ణయించాడు దెయిఫ్. ఈ ఇద్దరు పాలస్తీనియన్లు ఈ ‘తూఫాన్’ను ఇజ్రాయెల్ లో మారణకాండకు దారితీసేలా చేయగలిగారు. అయితే, ఈ దాడి వెనుక రెండు మెదళ్లు ఉన్నా, ఒకే ఒక సూత్రధారి పథకం రూపొందించాడు. అతడే ‘ఒంటి కన్ను రాక్షసుడు (ఒన్ ఐయిడ్ జాక్ అనే ఆంగ్ల పదాలకు వదులు అనువాదం) దెయిఫ్ అని పాశ్చాత్య మీడియా వెల్లడించింది.
పదే పదే ఒన్ అయిడ్ జాక్ అనే మాటను మొహమ్మద్ దియాబ్ ఇబ్రాహీం అల్– మస్రీ అనే పేరుతో పుట్టిన దెయిఫ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీడియా మిత్రులు వాడేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఇజ్రాయెల్ రక్షణ బలగాలు (ఐడీఎఫ్) జరిపిన పైశాచిక దాడుల్లో దెయిఫ్ ఒక కన్ను, కొన్ని శరీర భాగాలు కోల్పోయాడు. ఇక మళ్లీ పోరాటానికి దిగే రీతిలో దెయిఫ్ కోలుకోడనీ, ఒంటి కన్నుతో అతనిది గుడ్డి బతుకేనని యూదు దురహంకారులు ఆశించారు.
ఇప్పటి వరకూ ఇజ్రాయెలీ దాడుల నుంచి ఏడుసార్లు తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన దెయిఫ్ కన్ను ఒకటి పోయిందే కాని బుర్ర పనిచేయడం ఆగలేదు. అందుకే ‘దెయిఫ్ ఒక కన్ను పోగొట్టుకున్నాక సైనిక వ్యూహాలు ఇక అతని వల్ల కాదనుకున్నాం. కాని అతను చాలా వరకు కోలుకున్నాడు. ఒక కన్ను పోవడం అంటే ఓ కన్ను కోల్పోవడమే కదా,’ అని ఒక ఇజ్రాయెలీ రిటైర్డ్ సైనికాధికారి వ్యాఖ్యానించారు.
2014లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో గాజాలోనే దెయిఫ్ భార్య, ఏడు నెలల కొడుకు, మూడు ఏళ్ల కూతురు మరణించారు. 1965లో ఈజిప్ట్ ఆక్రమణలో ఉన్న గాజా స్ట్రిప్ లోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో దెయిఫ్ పుట్టాడు. మస్రీ నుంచి దెయిఫ్ అని పేరు మార్చుకున్నాడు. అరబ్బీలో దెయిఫ్ అంటే అతిథి అని అర్ధం. గాజా ఇస్లామిక్ యూనివర్సిటీలో బీఎస్సీ (సీబీజెడ్–కోస్తాంధ్ర పద్ధతిలో చెప్పాలంటే) చదివిన దెయిఫ్ ను 1987లో ఇజ్రాయెలీ దళాలు అరెస్టుచేసి, 16 నెలలు నిర్బంధించాయి.
మొత్తానికి ఒంటి కన్ను వీరుడే ఇజ్రాయెల్ తన 75 ఏళ్ల చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా దెబ్బదీయడం పెద్ద వింత అయింది. ఇజ్రాయెల్ పాత జెరుసలేం నగరంలో ముస్లింలకు అత్యంత పవిత్రమైన రమదాన్ మాసంలో అంతే పవిత్రమైన అల్–అక్సా మసీదుపై ఇజ్రాయెల్ సైనికులు దాడిచేసి ఎంతో మందిని కాల్చిచంపారు. అప్పటి నుంచీ ప్రతీకారానికి ఎదురుచూస్తున్న దెయిఫ్–తూఫాన్ అల్–అక్సా పేరుతో మెరుపుదాడికి డిజైన్ చేశాడు.
వరాసన్ ను ఒన్ అయిడ్ జాక్ అనే అన్నారు
……………………………
దెయిఫ్ గురించి ఇంగ్లిష్ మీడియాలో ప్రస్తావించినప్పుడల్లా అతన్ని–ఒన్ అయిడ్ జాక్–అని వర్ణించడంతో భారత ప్రజలు ఎన్నటికీ మరిచిపోని మరో ‘ఒంటి కన్ను రాక్షసుడు’ నాకు గుర్తుకొచ్చాడు. అతనే శ్రీలంక తమిళ ఈలం విడుదలై పుళి (ఎల్టీటీఈ) వ్యూహకర్త తిరు శివరాసన్. భారత మాజీ ప్రధాని రాజీవ్ రత్న గాంధీని 1991 మండు వేసవి మే 21న శ్రీవైష్ణవులకు పరమ పవిత్రమైన శ్రీపెరంబుదూరు కాంగ్రెస్ ఎన్నికల ప్రచారసభలో బెల్ట్ బాంబుతో హత్య చేసిన తర్వాత దొరికిన పోటోల్లో ఈ శివరాసన్ కళ్లజోడు, తెల్ల పైజామా, కుర్తా ధరించి కనిపించాడు.
పచ్చి అమాయకుడిలా, నెమ్మదస్తుడైన ఆలోచనాపరుడిగా ఈ ఫోటోల్లో దర్శనమిచ్చిన శివరాసన్ బాంబు పేలుడు స్థలానికి దగ్గరలో నిలబడి తమిళ టైగర్ల పరమ లక్ష్యాన్ని నెరవేర్చాడు. టార్గెట్ ను మిస్ కాకుండా కొట్టడంలో ఎల్టీటీఈ బృందాన్ని పకడ్బందీగా నడిపించాడు ఈ ఒంటి కన్ను పోరాట పులి. శివరాసన్ అంతకు ముందు ఒక కన్ను కోల్పోవడంతో తోటి టైగర్లు అతన్ని ‘ఒట్రయి కన్నన్’ (ఒంటి కన్ను మనిషి) అని శ్రీలంకలో పిలిచేవారు.
రాజీవ్ గాంధీ హత్యకు పథకాన్ని స్వయంగా రూపొందించి, దగ్గరుండి దాన్ని క్రమం తప్పకుండా విజయవంతంగా అమలు చేసిన శివరాసన్ కు రఘువరన్ సహా ఆరు మారుపేర్లు ఉన్నాయి. అతని అసలు పేరు చంద్రశేఖరం పిళ్లై పాక్య (భాగ్య) చంద్రన్. శ్రీలం తమిళ నగరం జాఫ్నాకు 32 కి.మీ దూరంలోని ఉడుపిడిలో అతను పుట్టాడు. 1958లో పుట్టిన శివరాసన్ అసలు పేరులోని భాగ్య అతని తల్లిది. చంద్రన్ అతని తండ్రి పేరులోని మాట.
ఇరవై ఏళ్లు కూడా నిండని శ్రీలం తమిళ యువతి కళైవతి (తెన్మోళి) రాజారత్నం ఉరఫ్ థాణును బెల్ట్ బాంబర్ గా ప్రయోగించి శివరాసన్ ప్లాన్ ను అమలు చేశారు. ఫలితంగా రాజీవ్, థాణుతోపాటు మరో 18 మంది మరణించారు. మూడు నెలల పాటు భారత పోలీసులు జరిపిన వేటలో వారికి ‘ఒంటి కన్ను ఉగ్రవాది’ ఆచూకీ తెలిసింది. బెంగళూరు శివార్లలో శివరాసన్ బృందాన్ని పోలీసులు ప్రాణాలతో పట్టుకోవాలన్న లేదా చంపాలనుకున్న ప్రయత్నం విఫలమైంది.
ఇండియా పోలీసులకు చిక్కడానికి ఇష్టపడని శివరాసన్ బృందం తమ దగ్గర ఎప్పుడూ ఉండే సైనేడ్ గుళికలతో ఆత్మహత్యకు పాల్పడింది. భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలనే తన జీవిత లక్ష్యం నెరవేరకుండానే తమిళ విమోచన పులుల చేతిలో కన్నుమూశారు 47 ఏళ్ల రాజీవ్. కాని, 33 ఏళ్లు నిండకుండానే ఒన్ ఐయిడ్ జాక్ శివరాసన్ మాత్రం– తన జాతికి కీడు చేసిన భారత నాయకుడి ప్రాణాలు తీయడానికి పన్నిన వ్యూహాన్ని కళ్ల ముందే విజయవంతంగా అమలు చేయగలిగాడు. ఒక కన్ను పోయిన హింసాత్మక పోరాటయోధుల మెదడు మరింత పదునుగా ఉంటుందని పై రెండు సందర్భాలు రుజువు చేస్తున్నాయి.
–ఒన్ అయిడ్ జాక్–అనే మాటలు పేకాట నుంచి వచ్చిన ప్రయోగం. పేక ఉక్కల్లో స్పేడ్స్, హార్ట్స్ జాక్ బొమ్మలో అతని ఒక కన్నే కనిపిస్తుంది. అందుకే ఒన్ అయిడ్ జాక్ ‘జాకీ’ అయ్యాడు. అదీగాక, 1961లో ప్రసిద్ధ హాలీవుడ్ నటుడు మార్లన్ బ్రాండో నటించిన ‘ఒన్ అయిడ్ జాక్స్’ అనే సినిమాతో కూడా ఈ ఒన్ అయిడ్ జాక్ అనే మాటలకు విశేష ప్రాచుర్యం లభించింది. గాడ్ ఫాదర్ సినిమాతో ప్రపంచ ప్రజలందరికీ తెలిసిన బ్రాండో దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ఒన్ అయిడ్ జాక్స్…. (అప్ డేట్… నిన్న ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో దెయిఫ్ మరణించినట్టు తాజా సమాచారం)
Share this Article