ఆ అబ్బాయిని తన పేరెంట్స్ ప్రతి నెలా ఓ పల్లెటూరికి తీసుకెళ్తారు… అక్కడ ఆ పిల్లాడి బామ్మ ఉంటుంది… వెళ్లిన రోజంతా అక్కడే ఉండి, తెల్లవారి అదే ట్రెయిన్‌కు వాపస్ వచ్చేస్తుంటారు… ఓరోజు పిల్లాడు అడిగాడు పేరెంట్స్‌ను… ‘నేను పెరిగాను, అన్నీ అర్థం చేసుకుంటున్నాను, ఈసారి ఒంటరిగా బామ్మ దగ్గరకు వెళ్తా’…
కాసేపు ఇంట్లో డిస్కషన్… సరే, ఈసారి నువ్వొక్కడివే వెళ్లిరా అని పేరెంట్స్ ఆ అబ్బాయికి పర్మిషన్ ఇచ్చేశారు… రైల్వే స్టేషన్‌కు అబ్బాయితోపాటు వెళ్లారు… రైలులో అబ్బాయి కూర్చున్నాడు… వీళ్లు సెండాఫ్ ఇచ్చారు… రైలు కదిలేదాకా తల్లి ఏవేవో జాగ్రత్తలు చెబుతూనే ఉంది… సహజం కదా…
‘ఇక ఆపు అమ్మా, చెప్పినవే చెబుతావు, ఇప్పటికి వందసార్లు చెప్పి ఉంటావు’ అని విసుక్కున్నాడు, రైలు బయల్దేరుతున్నట్టుగా కూత వేసింది… అబ్బాయి తండ్రి రైలు కదిలేముందు అబ్బాయి చెవిలో ‘ఒరేయ్ నాన్నా… ఒంటరిగా వెళ్తున్నావ్, భయమేస్తే లేదా బాగాలేకపోతే ఇది చూడు’ అని జేబులో ఏదో పెట్టాడు… రైలు కదిలింది…
Ads
ఇప్పుడు ఆ అబ్బాయి ఒంటరి… స్వేచ్ఛ… ప్రతి అడుగుకూ అలా కాదు, ఇలా చేయి, జాగ్రత్తరోయ్ అని నిర్దేశించే తల్లిదండ్రులు తన వెంట లేరు… కిటికీ నుంచి బయటికి చూస్తున్నాడు… చెట్లు వేగంగా వెనక్కి పరుగెత్తుతున్నాయి… ఉల్లాసంగా ఉంది… ఉత్సాహంగా ఉంది… టీటీ వచ్చాడు… ఏం బాబూ, నువ్వొక్కడివేనా..? వెంట ఎవరూ రాలేదా లేక నీకు అసలు ఎవరూ లేరా అనడిగాడు…
పిల్లాడికి ఆ ప్రశ్న సరిగ్గా అర్థం కాలేదు… కానీ ఆ పక్క సీటాయన తనవైపు జాలిగా చూశాడు… ఇంకొకాయన చూపులు కూడా అలాగే ఉన్నాయి… వీళ్లు నా వంక అదోలా చూస్తున్నారెందుకు అనుకున్నాడు మనసులో… రైలులో బ్యాగులు ఎత్తుకుపోయే దొంగలుంటారు, జాగ్రత్త అని చెప్పాడు మరొకాయన… పిల్లల్నే ఎత్తుకుపోతున్నారట ఈమధ్య అంటూ మరో ప్రయాణికుడు అన్నాడు గట్టిగా… ఏం పర్లేదు, మా బామ్మ దగ్గరికి వెళ్తున్నాను, నేను ఒక్కడినే వెళ్లగలను అన్నాడు బాబు బింకంగా…
మరి స్టేషన్ నుంచి వాళ్ల ఇంటికి నిన్ను ఎవరు తీసుకెళ్తారు..?
మా తాతయ్య వస్తాడు స్టేషన్‌కు…
అప్పటివరకూ ఒక్కడివే ఎక్కడ వెయిట్ చేస్తావ్, అసలే అది చాలా చిన్న స్టేషన్, రైలు అక్కడికి చేరేసరికి సాయంత్రం అయిపోతుంది…
పర్లేదు, నేను వెయిట్ చేయగలను…
ఇలా కాసేపు సంభాషణ… కాసేపటికి ఆ అబ్బాయిని ఆ ఒంటరితనం బాధించడం స్టార్టయింది… ఏదో ఇబ్బందిగా ఉంది… కాసేపటికి మెల్లిగా భయం మొదలైంది… కిటికీలోకి చూడటం మానేశాడు… తల దించుకున్నాడు… కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్ ఎందుకో తెలియకుండానే… డాడీ తన జేబులో ఏదో పెట్టిన సంగతి గుర్తొచ్చింది… వెతికాడు… ఓ చిన్న కాగితం ముక్క అది… అందులో నాలుగే పదాలు… ‘నేను చివరి బోగీలోనే ఉన్నాను..’ పిల్లాడిలో ధైర్యం… తలెత్తుకుని చుట్టూ ఉన్నవాళ్లను చూశాడు… నవ్వాడు…
ఇదే జీవితం అంటే… రైలు ప్రయాణం వంటిదే… పిల్లల్ని వెళ్లనివ్వండి, ఎదగనివ్వండి… సవాళ్లను ఎదిరిస్తూ, అడ్డంకుల్ని తట్టుకుంటూ, తన సొంత బుర్రతో ఆలోచించుకుంటూ పెరగనివ్వండి… కొత్త విషయాలు నేర్చుకోనివ్వండి… కానీ మీరు ఆ చివరి బోగీలో అన్నీ అబ్జర్వ్ చేస్తూనే ఉండండి… ఒకవేళ పిల్లలకు తమ స్థాయిని మించిన కష్టమో, ఇబ్బందో, బాధో కలిగితే మీరు ప్రవేశించండి… ఇలాగే… ఇలాగే… బతికినంతకాలమూ భరోసాగా…!! (ఫేస్‌బుక్‌లో కనిపించిన ఓ ఇంగ్లిష్ పోస్టు లోకలైజేషన్, ట్రాన్స్‌లేషన్ ఇది…)
Share this Article