ఆంధ్రజ్యోతి వాడు మాస్ట్ హెడ్ పక్కనే ఓ ఇండికేటర్ వార్త పెట్టాడు… అనగా లోపల పేజీల్లో ఉన్న ఓ వార్తకు ఇండికేటర్ అన్నమాట… ఐనా ఇప్పుడు ప్రతి పేపరూ అంతే కదా… ఫస్ట్ పేజీలో 16, 17 వార్తల పట్టిక పెడుతున్నారు కదా… సో, ఇదీ ఆ బాపతే… శీర్షిక పేరు ‘తెలంగాణకు వైఎస్ విజయలక్ష్మి’… ఓ ఆశ్చర్యార్థకం ప్లస్ ఓ ప్రశ్నార్థకం కూడా పెట్టాడు… అంటే నిజమో కాదో తెలియదు అని చెప్పడం, పైగా నిజమేనా అని ఆశ్చర్యపోవడం…
సారాంశం ఏమిటయ్యా అంటే…వైఎస్ విజయలక్ష్మి తెలంగాణలో ఓ సీటు నుంచి శాసనసభకు పోటీచేయబోతోంది అని… సరే, ఆ వార్తను బట్టి షర్మిల మిర్యాలగూడలో పోటీ చేస్తుందనీ, ఫస్ట్ విడతలో 15 మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయనీ, మిగతా నియోజకవర్గాల్లో వాళ్లకు ఎవరూ దొరకడం లేదు కాబట్టి దరఖాస్తుల్ని ఆహ్వానించబోతున్నారనీ అర్థం చేసుకోవచ్చు… జగన్‌కు వ్యతిరేకంగా వెళ్తుందనే భ్రమలో షర్మిలకు ఔట్ రైట్ మద్దతుగా ఉన్న ఆంధ్రజ్యోతి సైతం ఆమె పాదయాత్ర పెద్దగా పాపులర్ కాలేదనీ తీసిపడేసింది…
ఫాఫం, కాంగ్రెస్‌లో తన పార్టీని విలీనం చేయాలని విశ్వప్రయత్నం చేసింది ఆమె… విలీనం ఆమెకు ఇష్టం లేకపోయినా సరే, ఆమె భర్త అనిల్ కుమార్, ఆయన సన్నిహితుడు బాగా ఒత్తిడి తీసుకొచ్చారట కాంగ్రెస్‌లో కలిపేయాలని… కానీ రేవంత్‌రెడ్డి అడ్డంపడ్డాడు… కథ అక్కడితో ఆగిపోయింది అట…! ఇంతకీ విజయలక్ష్మి ఇప్పుడు వైసీపీయా..? వైఎస్ఆర్టీపీయా..?
Ads
బ్రదర్ అనిల్, తల్లి విజయమ్మ కూడా పోటీ చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారనీ, రాజన్నరాజ్యం తీసుకురావడం తథ్యమనీ, పాలేరు నుంచి తానే పోటీచేస్తున్నాననీ తాజాగా ప్రెస్‌మీట్‌లో చెప్పిందామె… సరే, ఆమె పార్టీ గురించి ఇంకా ఎక్కువ రాయడం ఎందుకులే గానీ… మనం కాస్త ఆఫ్ బీట్ వైపు వెళ్దాం…
ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ఆమె పేరు విజయలక్ష్మి అనే రాస్తుంది… అదేమంటే ఆమె పేరు అదే కదా అంటుంది… కానీ సాక్షి విజయమ్మ అని రాస్తుంది… (ఈనాడు ఏం రాస్తుందో పెద్దగా గమనించలేదు…) అవును, ఆమె పేరు రికార్డుల్లో ఉన్నట్టే రాయాలా..? గౌరవిస్తూ ‘అమ్మ’ అని యాడ్ చేయాలా..? ఈమధ్య ఆంధ్రజ్యోతే కావచ్చు, చంద్రబాబు భార్య పేరును భువనమ్మ అని రాయడం స్టార్ట్ చేసింది… అకస్మాత్తుగా భువనేశ్వరి భువనమ్మ ఎందుకైంది..?
ఇలా అమ్మ అని యాడ్ చేయాలంటే ఏ అర్హతలుండాలో…! నో, నో, పురంధమ్మ, కవితమ్మ అని రాయరు… పురంధేశ్వరి మాత్రమే… బయట ఎలా పిలిచినా సరే పత్రికల్లో కవిత కవిత మాత్రమే… కవితక్క కాదు… ఆమధ్య కొన్ని సోషల్ పోస్టుల్లో ఆంధ్రజ్యోతిని తిడుతూ విజయమ్మ అని రాయకుండా విజయలక్ష్మి అని రాయడం మీద ఆగ్రహం కనిపించింది… నిజానికి విజయలక్ష్మి అని రాస్తే అగౌరవం ఏముంది..? ఆమె పేరు అదే కదా… సాక్షిలాగే విజయమ్మ అని పెద్దరికం, అమ్మతనం ఆపాదించడం దేనికి..? జగన్మోహన్‌రెడ్డిని జగనన్న అని రాయడం లేదు కదా…
కేటీయార్‌ను రామన్న అనీ రాయడం లేదు కదా… సరే, వీటినీ కాసేపు పక్కన పెడితే… ఇంటి పేర్లు మరో తమాషా… కల్వకుంట్ల కవిత, నందమూరి సుహాసిని, వైఎస్ షర్మిల ఎట్సెట్రా… వాళ్ల అత్తింటి పేర్లు రావాలి కదా… రావు, ఎవరూ రాయరు… ఎందుకంటే ఈమెకు కల్వకుంట్ల అనే ఇంటిపేరుతోనే గుర్తింపు… ఆమెకు నందమూరి అనే ఇంటిపేరు విశిష్టతే కావాలి… షర్మిల అత్తింటి పేరు ఎవరికీ తెలియదు… ఇందులోనూ మళ్లీ తేడాలున్నయ్… నారా, నందమూరి సేమ్ పాపులర్ కదా… నారా బ్రాహ్మణి అయిపోయింది తప్ప నందమూరి బ్రాహ్మణిలా ఉండిపోలేదు…
అలాగే దగ్గుబాటి పురంధేశ్వరి అయ్యింది తప్ప నందమూరి పురంధేశ్వరిలా మిగిలిపోలేదు… అఫ్‌కోర్స్, రేణుకా చౌదరి వంటి నేతలకు ఇంటి పేరుతో పనిలేదు… చౌదరి మాత్రం ఉండాలి… అబ్బే, మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలోనూ అంతే… ప్రియాంక గాంధీ కరెక్టు కాదు కదా… ప్రియాంక వాద్రా కరెక్టు… కానీ గాంధీ అని చలామణీలో ఉంటే ఆ ఫాయిదా వేరు… అంతటా నేములోనేముంది అనుకోవచ్చుగాక… కానీ పాలిటిక్సులో అలా కాదు… నేములోనూ ఉంది…!!
Share this Article