వ్యూహం ట్రెయిలర్ రిలీజ్ చేశాడు ఆర్జీవీ… అటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ పట్ల బద్ధ వ్యతిరేకి… ఇటు జగన్ పట్ల సానుకూలుడు… పైగా జగన్ బయోపిక్ తీసే చాన్స్ వచ్చింది… డబ్బులు కూడా సమకూరాయి… వైసీపీ వాళ్లు ఎలాగూ చూస్తారు… సో, వర్మ పంట పండింది అనుకున్నారు అందరూ… అదీ వ్యూహం పేరిట ఒకే పార్ట్ కాదు, మరో పార్ట్ కూడా ఉంటుందట… సరే, ఈ ట్రెయిలర్ విషయానికొద్దాం…
పెద్ద ఇంప్రెసివ్‌గా లేదు… ఇది నిజానికి బయోపిక్ ఏమీ కాదు, జగన్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేవరకు పరిణామాల క్రోడీకరణ అన్నారు మొదట్లో… అదీ జగన్ కోణంలో… కానీ ఇప్పుడు ఫస్ట్ పార్టులోనే స్కిల్ స్కాం ప్రస్తావన వచ్చింది… అంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిణామాలను కూడా తీసుకున్నారన్నమాట… మరి సెకండ్ పార్టులో ఏముంటుంది..? ఏదో ఒకటి చుట్టేస్తాడు, వర్మ కదా…
సహజంగానే జగన్‌ను హీరోగా, చంద్రబాబు- పవన్ కల్యాణ్‌లను విలన్లుగా చూపించే ప్రయత్నమే అధికంగా జరిగినట్టు కనిపిస్తూనే ఉంది… ప్లస్ సోనియాను కూడా..! ఇదంతా ఊహించిందే… ఐతే చంద్రబాబుకు పవన్ కల్యాణ్‌కు నడుమ పుల్లలు పెట్టే ప్రయత్నం కూడా ఆర్జీవీ చేశాడు… ఎలాగో మీరే ఈ ట్రెయిలర్‌లో చూడండి…
Ads
సరే, వర్మ ఏవో తిప్పలు పడ్డాడు గానీ, ఎవరు చూడాలి..? వర్మ మునుపటి వర్మ కాదు… భ్రష్టుపట్టిపోయిన సృజనాత్మకత… తనలో గతపు ఫైర్ లేదు, ఆ స్పార్క్ లేదు… కొండా మురళి తన బయోపిక్‌ను అప్పగించి తప్పుచేశాడు అని అందరూ అనుకున్నదే… అలాగే జరిగింది… తొలిరోజు మ్యాట్నీ, ఫస్ట్ షోలకే జనం లేరు… అదీ వర్మ రీసెంట్ ట్రాక్ రికార్డ్… మరి అలాంటి వర్మకు జగన్ బయోపిక్ అవకాశం ఎవరిచ్చారు..? తెర వెనుక ఎవరు..? తెరపై ఎవరు..?
అప్పట్లో ఎన్టీయార్ బయోపిక్ రెండు పార్టులుగా తీశాడు బాలయ్య… రెండూ అట్టర్ ఫ్లాప్… అప్పట్లోనే వర్మ కూడా లక్ష్మిపార్వతి కోణంలో ఎన్టీయార్ రెండు పార్టులుగా తీసినట్టు గుర్తు… రెండూ జనం దేకలేదు… నాయకుల రీసెంట్ చరిత్రల్ని అందరూ చూస్తున్నదే, చదువుతున్నదే… చరిత్రకు నానా కొత్త బాష్యాలు చెబుతూ భజన చేస్తే జనం పెద్దగా ఇష్టపడరు… పైగా వర్మలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా కథనాన్ని నడిపించగల ప్రతిభ ఏనాడో కరువైంది…
ఒక్కటిమాత్రం వాస్తవం… ఆయా పాత్రలకు పాత్రధారుల ఎంపిక బాగుంటుంది… సరిగ్గా నప్పేలా చూస్తాడు… ఇక్కడా అంతే… పవన్ కల్యాణ్ పాత్రధారి గానీ, భారతీరెడ్డి పాత్రకు నటి గానీ పెద్దగా నప్పలేదు… జగన్, చంద్రబాబు పాత్రలకు మాత్రం పర్‌ఫెక్ట్ ఎంపిక… ప్రత్యేకించి చంద్రబాబు పాత్రధారి అచ్చంగా చంద్రబాబును తలపించాడు… (గతంలోని ఆర్జీవి సినిమాలో చంద్రబాబు పాత్ర పోషించిన యాక్టరే కావచ్చు బహుశా…)
ఒక్కసారి యాత్ర అనే సినిమా గురించి చెప్పుకోవాలి… వైఎస్ పాత్రలో మమ్ముట్టి సటిల్డ్ నటన ఆ సినిమాకు ప్రాణం… పైగా దర్శకుడు యాత్రకే కథను పరిమితం చేశాడు… ఎక్కడా దారి మళ్లలేదు, ఎక్కడా పరిణామాల వక్ర బాష్యాలకు పూనుకోలేదు… ఇప్పుడు రెండో పార్ట్ వస్తున్నదట… అదుగో అలాంటి ప్రయత్నాల మీద జనానికి ఆసక్తి ఉంటుంది… ఏమో… వర్మ తీసే రెండు భాగాల ఈ సినిమా జగన్‌కు రాజకీయ లబ్ధిని కూడా ఏమీ తీసుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదు… అదనంగా నష్టం కలిగించకపోతే, ఉన్న ఇమేజీ పోగొట్టకపోతే అదే పదివేలు…
Share this Article