ఓ ప్రవళ్లిక.. ఓ శ్రీకాంతా చారి.. అప్పటి లక్ష్యం భౌగోళిక తెలంగాణ.. ఆ లక్ష్యానికి చేరువలోకి వెళ్లకుండా అవాంతరాలు సృష్టిస్తారేమో అనే ఆందోళనతో శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతయ్యాడు.. ఆయన మరణం యువతలో ఆగ్రహ జ్వాలలు రేపి ఉద్యమ ఉధృతికి దోహదపడింది. పదులు వందలు, చివరికి పదిహేను వందలకు పైగా యువత తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షతో అసువులొడ్డారు. అది పదేళ్లనాటి మాట.
ఇప్పుడు భౌగోళిక తెలంగాణ లో పక్కా రాజకీయ పార్టీల కార్యాచరణ అమలులో ఉన్నది. నీళ్ళు, నిధులు, నియామకాల్లో యువతకు ఉపయోగకారిగా నిలిచే నియామకాల ప్రక్రియ ముందుకు పోకపోవడం ప్రవళ్లికలను సృష్టిస్తున్నది. యువతలో ఆందోళన తారాస్థాయికి చేరుకుంటున్నది. వాళ్లలో నెలకొన్న ఫ్రస్ట్రేషన్ ఆందోళనకర స్థాయికి చేరుతున్నది.
నిజంగా తెలంగాణ సాధన నాడు శ్రీకాంతాచారులు రాష్ట్ర ఏర్పాటుకు ప్రేరణగా నిలిచే ఉద్యమ నిర్మాణానికి ఉపయోగపడ్డారనే వాస్తవం ఇప్పుడున్న ప్రభుత్వాలకు తెలియకనా? అంటే అదేమీ కాకపోవచ్చు. వాళ్లయినా వీళ్లయినా తాయిలాలతో ఉట్టికెగరగలమనుకుంటున్నారు.
Ads
సంక్షేమం ఊసుతో ఏదయినా సాధ్యం అనుకుంటున్నారు. నంబర్ గేమ్ తో సంక్షేమం, పంపిణీలు, పింఛన్లు, బంధు లు ఇచ్చి ప్రజలను అక్కడికే సంతృప్తి పరుస్తున్నామని భ్రమ పడుతున్నారు.
ప్రవళ్లికల కుటుంబాలు గతం లో శ్రీకాంతాచారి కుటుంబం కలలు గన్న తరహాలోనే ఉద్యోగపు కలలు తమకు శాశ్వత ప్రయోజన కారులుగా నిలుస్తాయని ఆశపడుతున్నాయి. తమ కుటుంబాలకొచ్చే తాత్కాలిక ప్రయోజనాలకన్నా శాశ్వత, దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం పరితపిస్తున్నాయి.
శ్రీకాంతాచారి త్యాగం రోజు ఆ కుటుంబపు, అలాంటి కుటుంబాల తక్షణ లక్ష్యం భౌగోళిక తెలంగాణ.. దానికోసం ఉద్యమించేందుకు జనం ఏకమయింది. సబ్బండ వర్ణాలు సమైక్య సంఘటిత పోరుకు ఉపక్రమించి కలలను వాస్తవం చేసాయి.
మరి ప్రవళ్లిక ల కోసం భరోసా ఇచ్చే రీతిలో సంఘటిత పోరాట పటిమ ను ప్రోధి చేసుకోవాలిగా? అందుకు దిశా నిర్దేశం చెయ్యగలిగే బుద్ధిజీవులు ఇప్పుడేమయ్యారు? బుద్ధి జీవులను కూడా భౌగోళిక తెలంగాణా సాధనానంతర రాజకీయ పార్టీలు తమ ముగ్గులో చుక్కలుగా వాడుకున్నాయి గదా?
ఈ బుద్ధి జీవులు ప్రవళ్లికల లాంటి వాళ్ల కలలకు వాస్తవరూపం కల్పించగలిగే నమ్మకం కలిగిస్తాయా? లేక వీళ్ళు ఒకటిస్తే వాళ్లు రెండు తాయిలాలు ఇచ్చి గెలువాలనే దరిద్రపు సలహాలతో యువతను అగమ్యగోచర స్థితికి నెట్టాలని చూస్తారా? ఇప్పుడు కావలిసిందేంటి?…. P V Kondal Rao
Share this Article