== మహాలయ అమావాస్య == పెత్రమాస అనీ అంటుంటాం… అనగా పితృదేవతల స్మరణ… పొద్దున్నే గుడిలో ఓ పంతులు ముందు దాదాపు ఓ లైన్ ఉంది… తమ పితృదేవతలను స్మరిస్తూ, మహాలయ అమావాస్య సందర్భంగా ఆ పంతులుకు ఇవ్వడానికి సాయిత్యం పట్టుకొచ్చారు వాళ్లందరూ… అందరితోనూ సంకల్పాది సంక్షిప్త, నిర్దిష్ట తంతు ఏదో చేయిస్తున్నాడు… సాయిత్యం అంటే ఓ బ్రాహ్మణ కుటుంబానికి ఓ పూటకు సరిపడే బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయ, చల్ల, చమురు, పెరుగు, కాస్త నగదు ఎట్సెట్రా…
ప్రతీ మానవుడు దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం అనే మూడు రకాలైన ఋణాలతో పుడతాడని, ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
యజ్ఞేన దేవేభ్యః
Ads
బ్రహ్మచర్యేణ ఋషిభ్యః
ప్రజయా పితృభ్యః అని శాస్త్ర వచనం.
యజ్ఞయాగాదులు వంటి క్రతువులు చేయడం, చేయించడం ద్వారా దేవతల ఋణం, బ్రహ్మచర్యం పాటించడం ద్వారా ఋషి ఋణం, సంతానంతో పితృ ఋణం తీరుతుంది అని అర్థం.
ధర్మబద్ధమైన జీవనం అంటే మనిషి పుట్టినది మొదలు గతించే వరకు వయసును బట్టి జీవించాల్సిన విధానాన్ని సనాతన ధర్మంలో నాలుగు వర్ణ ధర్మాశ్రమాలుగా విభజించడం జరిగింది. అవి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసాశ్రమం. వీటి గురించి వివరంగా చర్చించడం లేదు కానీ విద్యార్థి దశలో బ్రహ్మచర్యం పాటించి విద్యనభ్యసించాలి. వివాహం చేసుకునే వయసులో వివాహం చేసుకుని గృహస్థుడు అయి సంతానం పొందాలి. తద్వారా క్రతువులు నిర్వహించడానికి, పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాదులు నిర్వహించడానికి తగిన అర్హతలు వస్తాయి. (వివాహం అయినా కాకపోయినా, సంతానమున్నా లేకపోయినా పిండప్రదానాదులు, తర్పణాదులు….. అంటే పితృకార్యాలు చేయవలసినదే!)
మనం ఎలాంటి పితృకార్యం నిర్వహిస్తున్నా ఐదుగురు పితృ దేవతలు మన వాకిటి ముందు వాయురూపంలో నిరీక్షిస్తారు. వారు తండ్రి, తాత, ముత్తాత, తల్లి తండ్రి, తల్లి తాత. వీరికి తర్పణాదులు, పిండ ప్రదానాలు తప్పక చేయాలనీ, అప్పుడే పితృ ఋణం తీరుతుందనీ పెద్దలు చెబుతారు.
గరుడ పురాణం “అమావాస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్” అని చెబుతుంది. అంటే అమావాస్య రోజున పితృదేవతలు వాయురూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి, సూర్యాస్తమయం వరకు ఉండి, తమవారు నిర్వహించే శ్రాద్ధకర్మలు, అన్నదానాలతో సంతృప్తి పొంది ఆశీర్వదించి వెళ్తారు. శ్రాద్ధ కర్మలు నిర్వహించకపోతే పితృదేవతలు అసంతృప్తి చెంది, శాపనార్ధాలతో నిందించి, తిరుగుముఖం పడతారని గరుడ పురాణం చెబుతుంది.
పితృ ఋణాన్ని తీర్చేందుకు, శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు సంవత్సరంలో అత్యంత అనువైన పదిహేను రోజులనే పితృపక్షాలు అంటారు. పితృపక్షం చివరిరోజైన అమావాస్యను మహాలయ అమావాస్య అని అంటారు. తెలంగాణలో పెద్దరమాస, పెత్రమాస అని వ్యవహరిస్తారు. పితృపక్షంలో పితరులు గతించిన తిథి నాడు గానీ లేదా తిథి తెలియని వారు మహాలయ అమావాస్య రోజున పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించాలని చెబుతారు.
ఈరోజున మనకున్న ఈ భౌతిక శరీరం మన పితరుల వలనే మనకు లభించింది. మన పూర్వీకులు, తాత ముత్తాతల పట్ల గౌరవం, పూజ్యభావం కలిగి ఉండటం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం మన బాధ్యత. మనల్ని చూసే మన సంతానం నేర్చుకునే సాంప్రదాయం ఇది. – నాగరాజు మున్నూరు…. Ps: నాస్తికులు, ఇలాంటి విషయాల పట్ల నమ్మకం లేనివారు ఈ పోస్టుకు దూరంగా ఉండాలని మనవి.
Share this Article