తెల్ల రేషన్ కార్డు… పథకాలకు ఇదెలా ప్రామాణికమైంది కేసీయార్… మొత్తం కుటుంబాలకన్నా ఎక్కువ రేషన్ కార్డులున్నప్పుడు… అనర్హుల దగ్గర తెల్ల రేషన్ కార్డులున్నప్పుడు, తెల్ల రేషన్ కార్డుల ప్రాతిపదికన 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ అనేది ఎలా సమర్థనీయం..? (అర్హులకు మాత్రమే అంటే ఇదేకదా అర్థం..?) దీని బదులు తెలంగాణలో ప్రతి కుటుంబానికీ సిలిండర్ ధర 400 మాత్రమే అని ప్రకటించి ఉంటే ఏమయ్యేది..? అదీ ఓ నిత్యావసర సరుకే కాబట్టి పేద, ధనిక తేడా లేకుండా అందరికీ సబ్సిడీ అని సమర్థించుకునే వీలూ ఉండేది… (కాంగ్రెస్ హామీ బెటర్)…
మొదట్లో రైతుబంధు పేద, ధనిక తేడా లేకుండా భూస్వాములు, కోటీశ్వరులకు ఆర్థికలబ్ధి కలిగించారు… సాగు చేయనివాళ్లకు పెట్టుబడి సాయం ఇస్తూ, నిజంగా ప్రాణాల్ని పణంగా పెట్టి సాగుచేసుకునే కౌలు రైతులను గాలికి వదిలేశారు… ఇప్పుడు ఆ పెట్టుబడిసాయాన్ని మొదటి సంవత్సరం 10 వేల నుంచి 12 వేలకు పెంచి, మెల్లిగా 15 వేలకు పెంచుతారట… మళ్లీ కౌలు రైతుల గతి యథాతథం… ఆత్మహత్యలు అధికంగా జరిగేది కౌలు రైతు కుటుంబాల్లోనే… ఐనా కేవలం భూమి ఎవరి పేరు మీద ఉంటే వారికి సాగుతో నిమిత్తం లేకుండా డబ్బులు ఇవ్వడం ఏమిటి..? దీని బదులు పంటల కొనుగోలు ధరలు పెంచితే, ఎరువుల ధరలపై, విత్తనాల ధరలపై సబ్సిడీ ఇస్తే నిజంగా వ్యవసాయం చేసేవాడికి ఉపయోగం…
అర్హులైన పేద మహిళలకు నెలకు 3 వేలు ఇస్తాం, ఆసరా పెన్షన్లను 2 వేల నుంచి 3 వేలకు పెంచుతాం, అయిదేళ్లలో దాన్ని 5 వేలకు తీసుకుపోతం… (దివ్యాంగులకు 6 వేలు)… పక్కా రాజకీయ నిర్ణయం… ఈ దెబ్బకు ఇక పేద ప్రజల వోట్లను గంపగుత్తాగా పొందవచ్చుననే ఆలోచన… ఉచిత వరాలను అన్ని పార్టీలూ అత్యంత ఉదారంగా ప్రకటించేస్తున్నాయి కదా… ఈ పంచుడు పథకాల్లో జగన్ దిట్ట కదా… కేసీయార్ కూడా అదే బాట… కాంగ్రెస్ బాటలో తను, జగన్ బాటలో తను…
Ads
తొమ్మిదేళ్లు ఇలా జనరంజకంగా పాలించాను, నన్ను చూసి, నా పాలన చూసి వోట్లేయండి అనలేక… సర్వేల్లో కాంగ్రెస్ ఎడ్జ్ చూసి, కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీలు జనంలోకి వెళ్తున్న తీరు చూసి తనూ తప్పనిసరై ఇక కొన్ని ఉచితాలను ప్రకటించి, వోట్ల పబ్బం గడుపుకునే ప్రయత్నం… పోనీ, అదైనా కాంగ్రెస్‌కు దీటుగా హామీలు ఇవ్వగలిగాడా..? అదీ లేదు… బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 250 యూనిట్ల లోపు కరెంటు ఫ్రీ అనేవి జనంలోకి బాగా వెళ్తున్నాయి… (అఫ్‌కోర్స్, అవీ వోట్ల పబ్బం గడుపుకునే రాజకీయ పథకాలే…)
ఆరోగ్యశ్రీ పరిమితిని 15 లక్షలకు పెంచడాన్ని స్వాగతించవచ్చు… నిజంగా ఈరోజుల్లో పేదలకు కావల్సింది ఇలాంటివే… కాకపోతే ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో చాలా హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కేసుల్ని పట్టించుకోవడం లేదనేది ఫీల్డ్ రియాలిటీ… అగ్రవర్ణ పేదలకు రెసిడెన్షియల్ స్కూళ్లు అనేదీ బాగానే ఉంది… కులం ప్రాతిపదికన గాకుండా పేదరికం కోణంలో ఏ కులం వారికైనా ప్రభుత్వ పథకాలు బెటర్, పైగా ఉన్నత ప్రమాణాల నాణ్యమైన విద్య అందరికీ, అంటే పేదలందరికీ అందడం సకారాత్మకం…
పేదలకు ఇళ్ల స్థలాలిస్తం, ఇప్పుడున్న హౌజింగ్ స్కీమే అమలు చేస్తం… అంటే డబుల్ బెడ్రూం పూర్తిగా అటకెక్కినట్టే… 3 లక్షలకు ఓ ఇల్లు ఆత్మాభిమానం ఇనుమడించేలా కట్టుకొండి అని చెబుతున్నట్టు..! రైతు బీమాలాగే పేదలందరికీ బీమా సౌకర్యం అనేదీ బాగానే ఉంది… కానీ దానికీ తెల్ల రేషన్ కార్డులకూ లింక్ దేనికి..? అసలు తెల్ల రేషన్ కార్డు పేదరికానికి సరైన ప్రమాణం ఏమీ కాదు మన రాష్ట్రంలో… దీనిబదులు తెలంగాణలో నివసించే ప్రతి వ్యక్తికీ ఈ బీమా వర్తింపజేస్తాం అంటే, చెప్పుకోవడానికైనా సూపర్ ఉండేది…
సీపీఎస్ బదులు పాత పెన్షన్ విధానం అని ప్రకటించలేక ఓ కమిటీ వేస్తామని ప్రకటన… జరగబోయేది ఏమిటో అందరికీ తెలుసు… అక్రిడేటెడ్ జర్నలిస్టులకు కూడా గ్యాస్ సబ్సిడీ, 15 లక్షల వరకూ ‘కేసీయార్ ఆరోగ్య రక్ష’ కింద వైద్యసాయం అన్నారు, తీరా మేనిఫెస్టోలో అవేమీ లేవు… 15 ఏళ్ల క్రితం జర్నలిస్టులు కొనుక్కుని, సుప్రీంలోనూ కేసు గెలిచిన ఆ పాత ఇళ్లస్థలాలు ఇవ్వడానికే మొండిచేయి చూపిస్తున్న కేసీయార్ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంకేం ఇస్తుంది..?
కాంగ్రెస్ మహాలక్ష్మి పథకం కింద 2500 అన్నది కదా, కేసీయార్ 3 వేలు అంటున్నాడు… వాళ్లు 500 రూపాయలకే సిలిండర్ అన్నారు కదా, ఈయన 400 మాత్రమే అంటున్నాడు… రైతుసాయం వాళ్లు 15 వేలు చెబితే, నేనూ అంతే ఇస్తా అంటున్నాడు… కానీ వాళ్లు కూలీలకు కూడా 12 వేలు ఇస్తామన్నారు, కేసీయార్ కూలీలకు ఇవ్వడు, కౌలు రైతులకూ ఇవ్వడు… పంటల బీమా ఊసే లేదు… ఇక 250 యూనిట్ల కరెంటు, బస్సుల్లో ఫ్రీ ప్రయాణం మాటే ఎత్తలేదు… ధాన్యానికి 500 బోనస్ ధర అన్నారు కాంగ్రెసోళ్లు, కేసీయార్ దానిపై కిమ్మనలేదు… వాళ్లు ఆరోగ్య సాయం 10 లక్షలు అంటే, కేసీయార్ 15 లక్షలు అంటున్నాడు… సో, పోటీపడి వాగ్దానాలు చేసే పొలిటికల్ పోటీలో, పోలింగ్ ఆటలో కేసీయార్ ఆకట్టుకోలేకపోయాడు… (ఉచిత పథకాలపై ఎంత ఆందోళన వ్యక్తమవుతున్నా సరే…)
Share this Article