ఆస్కార్ అనేది ఓ పెద్ద అద్భుతమేమీ కాదనీ.., డబ్బులు పడేసి, మంచి లాబీయింగు చాకచక్యంగా చేసుకుంటే చాలు, పరమ నాసిరకం నాటునాటు పాటకు కూడా ఆస్కార్ అవార్డు వస్తుందనీ మనకు తెలిసిపోయింది… ఆస్కార్ చుట్టూ ఉన్న దేవతా వస్త్రాలు కిందకు జారిపోయాయి… ఆస్కార్ విలువ హఠాత్తుగా కూలిపోయింది…
ఇప్పుడు మళ్లీ ఎందుకు అంటారా..? మన దేశం అధికారికంగా ఆస్కార్ ఎంట్రీల్ని పంపిస్తూ ఉంటుంది ప్రతి ఏటా… కానీ అదే పైరవీల దందా… జ్యూరీలో ఎవరెవరినో పెడతారు, ఒత్తిళ్లు, ప్రలోభాలు… ఏవో దిక్కుమాలిన సినిమాల్ని పంపిస్తుంటారు… అవి కాస్తా వేగంగా తిరుగు ఫ్లయిట్‌లో వచ్చి పడతాయ్…
కానీ ప్రైవేటు నామినేషన్ల ద్వారా పోటీపడవచ్చుననీ, అసలు కథంతా అక్కడ లాబీయింగుతోనే నడుస్తుందనీ మనకు ఆర్ఆర్ఆర్ సినిమాతో అర్థమైంది… మనకే కాదు, రాజమౌళి గొప్పతనం ఏమిటంటే… మన ఇండియన్ సినిమాకు వేల కోట్ల మార్కెట్ దేశవిదేశాల్లో ఎలా క్రియేట్ చేయాలో నేర్పించాడు, అలాగే ఆస్కార్‌ను ఎలా ఒడిసిపట్టాలో కూడా నేర్పాడు…
Ads
అఫ్‌కోర్స్, తన దత్తపుత్రుడు కార్తికేయ మేనేజ్‌మెంట్ నైపుణ్యంతో అనుకున్నట్టే ఆస్కార్ కొట్టేశారు… కాకపోతే ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ కొరియోగ్రాఫర్ ఎట్సెట్రా ఏమీ రాలేదు, ఏదో మ్యూజిక్ కంపోజింగ్‌కు దక్కింది… నిజంగా ఆ పాటకు ఆస్కార్ పొందాల్సింది (ఒకవేళ ఇవ్వాల్సి వస్తే…) గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ లేదంటే కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు దక్కాలి… కానీ బ్యాడ్ లక్…
ఇక ఇప్పుడు అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్ సినిమా విషయానికొద్దాం… ఈ చిత్రం మొదటి పేరు క్యాప్సూల్ గిల్… తరువాత ది గ్రేట్ ఇండియన్ రెస్క్యూ అని మార్చారు… మళ్లీ మనసు మారింది, ఇది బాగా లేదనుకుని మిషన్ రాణిగంజ్ అన్నారు… దీనికి ట్యాగ్ లైన్ ది గ్రేట్ భారత్ రెస్క్యూ… వాస్తవ సంఘటన ఆధారంగా నిర్మించిన చిత్రం… 1989లో వెస్ట్ బెంగాల్‌లో రాణిగంజ్ కోల్ ఫీల్డ్స్ ప్రమాదంలో 65 మంది గని కార్మికులు చిక్కుకుపోతే వాళ్లను రక్షించిన టీం లీడర్ జస్వంత్ సింగ్ గిల్… అదుగో ఆయన అనుభవాల ఆధారమే ఈ సినిమా కథ…
కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు కావచ్చుగాక… కానీ సినిమాలో ఆసక్తికరమైన ప్రజెంటేషన్ లేదు… సరే, అక్షయ్ కుమార్ ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉంటాడు, కొన్ని ఫట్, కొన్ని హిట్… ఇది ప్రేక్షకులకు నచ్చలేదు… తిప్పికొట్టారు… 55 కోట్లు పెట్టి సినిమా తీస్తే 20 కోట్ల వరకూ వాపస్ వచ్చాయి, అంతే… సూపర్ ఫ్లాప్… ఐతేనేం, ఆస్కార్‌కు ఈ లెక్కలు అవసరం లేదుగా…
పాపం, అఫిషియల్ ఎంట్రీ కోసం ప్రయత్నించారు గానీ, ఆ చాన్స్ మలయాళ చిత్రం 2018కి దక్కింది… అదీ అనూహ్యమే… ఐతే ఊరుకుంటామా ఏం అనుకున్న నిర్మాతలు ప్రైవేటు ఎంట్రీగా పంపిస్తున్నారు… నో ప్రాబ్లం బ్రదర్, సరైన లాబీయింగు, కాస్త చమురు వదిలితే ఆస్కార్ ఏమిటి, దాని తాత కూడా దిగివస్తుంది… ఆల్ ది బెస్ట్… RRR తరహాలోనే ఓ పది అవార్డులకు గురిపెట్టండి, ఒకటి రాలకపోదు…!!
Share this Article