ఈ కథనానికి వాడిన ఫోటో గుర్తుందా..? రేణుదేశాయ్ పవన్ కల్యాణ్ నుంచి విడిపోయాక తెలుగు రాష్ట్రాలను, హైదరాబాద్‌ను వదిలేసి వెళ్లిపోయింది… కొన్నాళ్లకు ఒకాయనతో ఎంగేజ్‌మెంట్ జరిగింది… ఆ వ్యక్తి ఫోటో కనిపించకుండా కొన్ని ఫోటోలను షేర్ చేసింది… ఎందుకలా అంటే..? పవన్ ఫ్యాన్స్ నుంచి ప్రమాదాన్ని ఊహిస్తున్నానని ఏదో చెప్పినట్టు గుర్తు…
తరువాత ఏం జరిగిందో ఎవరికీ తెలియదు… కానీ ఇప్పుడు ఆమే బయటపెట్టింది… ఆ ఎంగేజ్‌మెంట్, ఆ పెళ్లి ప్రతిపాదన రద్దయిపోయినట్టు…! ఎందుకమ్మా అనడగండి… ఏవేవో కారణాల్ని చెప్పుకుంటూ వచ్చింది… అందులో ముఖ్యమైనవి… నా బిడ్డ ఆద్య చిన్నది, తన వయస్సు ప్రస్తుతం 13 ఏళ్లే… ఇప్పుడు తనకు నా అవసరం ఉంది, పెళ్లి చేసుకుని నేను వెళ్లిపోతే, భర్తకే ఎక్కువ సమయం ఇవ్వాల్సి ఉంటుంది, అందుకని ఆ ఎంగేజ్‌మెంట్ రద్దు చేసుకున్నాను… తనకు ఉన్నది నేనొక్కదాన్నే, తండ్రి కూడా లేడు… తను కాలేజీకి వెళ్లే వయస్సొచ్చాక రెండో పెళ్లి చేసుకుంటా… నాకు పెళ్లి మీద బాగా నమ్మకం… వివాహ బంధం చాలా బలమైంది…’’
గుడ్… ఓ తల్లిగా రేణుదేశాయ్ ఆవేదన, ఆందోళన అర్థం చేసుకుందాం… కాబోయే భర్తకు ఎవరైనా హాని తలపెడతారేమో అనే భయాన్ని కూడా అర్థం చేసుకుందాం, అందుకే తన ఫోటోల్ని కూడా బయటపెట్టని తీరునూ అర్థం చేసుకుందాం… కానీ ఆ ఎంగేజ్‌మెంట్ కుదుర్చుకునే ముందు ఆ బిడ్డ గుర్తుకురాలేదా..? అయిదేళ్ల క్రితం ఆ బిడ్డ ఇంకా చిన్నది కదా… ఎక్కడ వదిలేసి వెళ్లాలనుకుని ఆ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు..?
Ads
పవన్ కల్యాణ్‌తో విడిపోయినప్పుడు ఇక ఈ పిల్లల పూర్తి భారం నాదే అని మనస్సు నిమ్మళం చేసుకున్నప్పుడు… అన్నీ తానై చూసుకుంటున్నప్పుడు మరి మళ్లీ పెళ్లికి ఎందుకు సిద్ధపడినట్టు..? ఆ వరుడు ఆ పిల్లల బాధ్యతల్ని తనూ పంచుకుంటానని మంచి మనస్సుతో ముందుకొచ్చాడా..? అలాగైతే మరి ఎంగేజ్‌మెంట్, పెళ్లి ఎందుకు రద్దయినట్టు..? ఐనా తను బిడ్డల్ని వదిలేసి వెళ్లిపోవడం ఏమిటి..? వాళ్లతోపాటు తను, దానికి సిద్ధపడేవాడు దొరికితేనే ‘తదుపరి వైవాహిక జీవితం..’ తల్లి పాత్రను ఇంకెవరూ తీసుకోలేరు, న్యాయం చేయలేరు… తల్లి తల్లే…
ఇప్పుడదైనా బిడ్డ కాలేజీకి వెళ్లే వయస్సుకు వచ్చాక, పెళ్లి చేసుకుంటానని అంటోంది… అప్పుడు బిడ్డను ఎక్కడ వదిలేసి వెళ్తుంది మరి..? రెండో పెళ్లికి మహిళలకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే… వాళ్లంతట వాళ్లు బతికే వయస్సొస్తే అది వేరే సంగతి… చివరగా… పెళ్లి అనే బంధం బలమైంది అనే మాట… అంత బలమైందే అయితే పవన్ కల్యాణ్‌తో ఆ బలమైన పెళ్లి బలహీనమైపోయి, పెటాకులు అయిపోయింది కదా… పరిచయమే లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బతకడం, బతుకును పంచుకోవడం బలమైన బంధం అనేది ఓ జనరల్ బ్లాంకెట్ ఒపీనియన్… అదే బాగుంటే, అదే బలంగా ఉండి ఉంటే ఈ మీమాంసలు, ఈ సందేహాలు, ఈ జాప్యాలు, ఈ భయాలు, ఈ వెనుకంజలు ఎందుకమ్మా..,.!!
Share this Article