అన్నా… దయన్నా… గివేం మాటలే… గిట్ల మాట్లాడితే ఎట్లా..? గింత ఘనం సీనియారిటీ ఒచ్చినా ఇంకా గట్లనే ఏందేందో మాట్లాడతనే ఉంటవ్… గిప్పుడు మీ కార్యకర్తలకు కొత్త కొత్త పరీక్షలు పెడితే ఎట్లనే అన్నా..? మంత్రులు తప్పకుంట యాంటీ-బీజేపీ, నాన్-మోడీ, యాంటీ-అయోధ్య, ప్రొ-మజ్లిస్, వీరసెక్యులర్ ప్లస్ మైఫ్యామిలీ టచ్ ఉండేటట్టు మాత్రమే మాట్లాడాలె అని నీ చెవిలో చెప్పిండా కేసీయార్..? మరి గిట్లెందుకు..? జైభారత్- జైశ్రీరాం అని నినాదాలు చేస్తే నీకూ ఇష్టమే గనీ జై కేసీయార్ అని కూడా అనాలా..? మన సెక్యులర్ వ్రతానికి భంగం జరగకుంట జై అల్లా, జై ప్రభువా అని కూడా అనాలా..? మస్తు చెప్పినవ్ భయ్యా… కానీ గా పార్శీలు, గా సిక్కులు, గా జైనులు ఏం అన్యాయం చేసిండ్రు… వాళ్ల దేవుళ్లను తలుచుకోవద్దా మల్ల..? జై ఆల్ గాడ్స్ అనేస్తే సరిపోతదేమో… అవునూ, ఈ జైజైల కథెందుకు ఒచ్చింది ఇప్పుడు అర్జెంటుగ..?
బీజేపీ, అయోధ్య పేరిట బిచ్చం అనే టాపిక్ మీద అందరూ మాట్లాడుతున్నరు, నువ్వు గుడ్క మాట్లాడకపోతే మైనస్ మార్కులు పడతయ్, వచ్చే కేటీయార్ మంత్రివర్గంల చాన్స్ ఉండకపోవచ్చని ఎవరైనా చెప్పిండ్రా..? అవు గనీ దయన్నా… బీజేపీవోళ్లు జైతెలంగాణ అనరా..? గుజరాత్, ఉత్తరప్రదేశ్ అంటరా..? నీకు ఈ స్పీచ్ రాసిచ్చినోళ్లు ఎవరే అన్నా..? గా బీజేపీవోళ్లు వోట్లేయకుంట తెలంగాణ ఒచ్చిందా..? తెలంగాణ ఒచ్చినప్పుడు గా పార్లమెంటుల మీకున్నయ్ రెండు వోట్లు… యాదికుందా..? నువ్వు అప్పట్ల నీ ప్రజెంట్ దేవుడికి మస్తు ఖిలాఫ్ ఉంటివి… బీజేపీవోళ్లు జై గుజరాత్, జై ఉత్తరప్రదేశ్ అని ఎందుకంటరు..? ఆళ్లకేమైనా ఎర్రా, పిచ్చా..? వాళ్లకు సోయి లేదా ఏంది..?
Ads
ఏమాటకామాట… లేటుగా పార్టీలకు ఒచ్చినా సరే, కేసీయార్ భక్తిల మస్తు మార్కులు కొడుతున్నవ్పో… అవును గనీ, ఇప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలు సిరఫ్ జై కేసీయార్ అంటే సరిపోతదా..? రేప్పొద్దున కేటీయార్ సీఎం అయితండట… గిప్పటి నుంచే జై కేసీయార్, జై కేటీయార్ అనుడు వాజీబు కదా… వీలయితే జై కవిత, జై హరీష్, జై సంతోష్, జై హిమాంశ్ అని కూడా యాడ్ చేస్తే మంచిది గదా… జేజేలు కొట్టడానికి దరిద్రం దేనికి..? ఏమో, రేపు రేపు ఎవరు ఏమవుతరో మనకేం తెలుసు..? అందుకని మనకు దేవుండ్లు వాళ్లే కాబట్టి వాళ్లందరినీ తలుచుకుంటే సరిపాయె… అందుకని అందరికీ గిట్ల కొత్త స్లోగన్ మీద అందరికీ ట్రెయినింగు ఇయ్యాలె… ‘జై భారత్, జై తెలంగాణ, జై కేసీయార్, జై కేటీయార్, జై కవిత, జై హరీష్, జై సంతోష్, జై హిమాంశ్’… మీ నియోజకవర్గంలో కార్యకర్తలు చివరలో జై దయన్నా అని కలుపుకోవాలె… ఎక్కడోళ్లు అక్కడ తమ ఎమ్మెల్యేల పేర్లను కలుపుకుని జైజైలు కొట్టుడు ప్రాక్టీస్ చేయాలె… భక్తి,, పుణ్యం, ఫలం… ఏమంటవ్ భయ్యా..?!
Share this Article