వరుసగా అన్నీ నష్టదాయక నిర్ణయాలే… బండి సంజయ్ తొలగింపు దగ్గర నుంచి నిన్న పవన్ కల్యాణ్ ఎదుట సాగిలబడటం దాకా తెలంగాణ బీజేపీ చేజేతులా నష్టాన్ని కలిగించుకుంటోంది… ఒక దశలో బీఆర్ఎస్‌కు మంచి పోటీ అవుతుందనీ, రాష్ట్రంలో త్రిముఖ పోటీ అవుతుందనీ అనుకునే దశ నుంచి ప్రస్తుతం బీజేపీ అసలు పోటీలో ఉందా అనే దశకు పడిపోయింది… బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ముఖాముఖి పోటీ అన్నట్టుగా తయారైంది…
ఎప్పుడైతే కాంగ్రెస్ సిక్స్ గ్యారంటీల పేరిట జనంలోకి వెళ్లిందో దానికి ఎన్నికల్లో బలంగా పోటీగల ఊపు వచ్చేసింది… సరే, అంతిమంగా గెలుపూఓటములకు చాలా కారణాలు ఉండవచ్చుగాక, కానీ మంచి ఫైట్ ఇచ్చే సిట్యుయేషన్ కనిపిస్తోంది… మరి బీజేపీ..? నిన్న కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ వెళ్లి పవన్ కల్యాణ్‌కు ఓ పెద్ద బొకే ఇచ్చి, బాబ్బాబు, నువ్వు పోటీలో ఉండకు అని కోరారట… ఆయనేమో నాకు జనసేన కేడర్ నుంచి ఒత్తిడి ఉంది, రెండు రోజులాగి చెబుతానులే అన్నాడట…
ఒక జాతీయ పార్టీ ఓ ఉప ప్రాంతీయ పార్టీ (?) అధినేత దగ్గరికి వెళ్లి బతిమిలాడటం ఏమిటసలు..? అన్నింటికీ మించి తెలంగాణలో జనసేన బలమెంత..? సో వాట్, ఉంటే ఉండనివ్వండి పోటీలో… ప్రవీణ్ లేడా..? షర్మిల లేదా..? కేఏపాల్ లేడా..? ఫార్వర్డ్ బ్లాక్ లేదా..? టీడీపీ లేదా..? ముందుగానే జనసేన నుంచి 32 సీట్లకు పోటీచేస్తాం అంటూ ఓ జాబితా ప్రకటించేయడం బీజేపీని లొంగదీసుకోవడం కోసమేనా..?
Ads
అసలు పవన్ కల్యాణ్ రణక్షేత్రమే ఆంధ్రప్రదేశ్… తన స్థానికతా అదే… తన మూలాలూ అవే… ఆయనేమో బీజేపీ కూటమి ఎన్డీఏలో ఉన్నానంటాడు… మోడీకి, అమిత్ షాకు ఏమీ గిట్టని చంద్రబాబు కోసం పనిచేస్తుంటాడు… ఏపీలోనే ఓ విచిత్ర స్నేహాలు… పైగా జనసేనకు ఏపీలోనే ఒక్క శాసనసభ్యత్వమూ లేదు… ఒకవేళ అక్కడ పవన్ కల్యాణ్ దోస్తీ కావాలనే యావ, రంది గనుక బీజేపీకి ఉన్నట్టయితే, అది తెలంగాణలోనూ ఖచ్చితంగా ఉండి ఉండాలా..?
పైగా తెలంగాణ ఏర్పాటైనప్పుడు 11 రోజులు నిద్రాహారాలు లేవని పవన్ కల్యాణే స్వయంగా వెల్లడించాడు ఓసారి… తెలంగాణలో ఏ ప్రజాసమస్య మీద తను మాట్లాడిన సందర్భం లేదు, జనంలోకి వచ్చిన సందర్భం లేదు… పైగా తెలంగాణ వ్యతిరేకత… మరి అలాంటి నాయకుడితో కలిసి వెళ్లాలనే దుగ్ధ బీజేపీకి దేనికి..? బీజేపీ నేతలు స్వయంగా వెళ్లి బతిమిలాడాల్సినంత రేంజ్ ఉందా..? కిషన్ రెడ్డి, పవన్ కల్యాణ్ భేటీ ఫోటో, వార్త తరువాత తెలంగాణ బీజేపీ అభిమానులే పెదవి విరిచారు… అస్సలు పాజిటివ్ వైబ్స్ లేవు… పైగా నెగెటివిటీ కనిపిస్తోంది…
అసలే బీఆర్ఎస్, బీజేపీ రహస్య స్నేహం ప్రజల్లోకి బాగా వెళ్తోంది… ఆమధ్య బీజేపీ కేంద్ర పెద్దలను సైతం బజారుకు ఈడ్చడానికి రకరకాల స్కెచ్చులు వేసి… నువ్వు గోకకపోయినా సరే, నేను నిన్ను గోకుతూనే ఉంటానని పెద్దగా సవాళ్లు చేసిన కేసీయార్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బీజేపీ మీద ఒక్క మాట మాట్లాడటం లేదు… అబ్బే, మాకూ బీఆర్ఎస్‌కూ దోస్తీ లేదు అని జనం కళ్లకు గంతలు కట్టడానికి ఆమధ్య మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు… గతంలో కేసీయార్ మాతో పొత్తు కోసం వచ్చాడు, మేమే తిరస్కరించాం అన్నాడు… ఐనాసరే కేసీయార్ నుంచి స్పందన ఈరోజుకూ లేదు…
దిగువ స్థాయిలో కేటీఆర్, కవిత, హరీష్‌రావు, నమస్తే తెలంగాణ మాత్రమే మోడీ మీద, బీజేపీ మీద నెగెటివ్ ప్రచారం చేస్తుంటారు… కానీ కేసీయార్ సైలెంట్… కాంగ్రెస్‌లోకి వలసలు పెరిగాయి, బీజేపీ నుంచి కూడా నేతలు వెళ్లిపోతున్నారు, ఆ పార్టీ టికెట్ల మీద అసలు పోటీయే లేదు… ప్రతిచోటా అభ్యర్థులే లేని దురవస్థ… కొత్త నేతలు ఎవరూ దేకడం లేదు… ఈ స్థితిలో పవన్ కల్యాణ్‌తో పొత్తు వంటి నిర్ణయాలు ఏ ఫాయిదా కోసం..? తెలంగాణ బీజేపీ అభిమానులకూ నచ్చని నిర్ణయాలు ఎవరికోసం..?!
సంజయ్‌ను తరిమేశారు సరే.,.. ధర్మపురి అర్వింద్ కూడా కంఫర్ట్‌గా లేడు సరే… కాపుల్ని, అనగా తెలంగాణ మున్నూరు కాపుల ఆదరణ పొందడానికి పవన్ కల్యాణే కావల్సి వచ్చాడా..? తెలంగాణ కాపుల్లో ఒక్క నేతా దొరకలేదా..? అసలు ఇన్నాళ్లూ ఎస్సీ, బీసీల నాయకత్వం పెంచడానికి వీసమెత్తు ప్రయత్నమైనా చేసిందా పార్టీ…? ఈటల చేరిక మినహా…!! అదీ అనుకోకుండా కలిసి వచ్చిన పరిణామమే… ఆ సోయెం బాపూరావు కూడా అసౌకర్యంగా ఫీలవుతున్నాడట… మరి తెలంగాణ వచ్చిన ఈ తొమ్మిదిన్నరేళ్లలో బీజేపీ పార్టీపరంగా ఎదగడానికి చేసిందేముంది..? ఆ ఆత్మ మథనం కూడా లేదు…!!
Share this Article