Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి… ప్రతి లేని గోపుర ప్రభలు గంటి…

October 21, 2023 by M S R

History of Hills: కొండ అన్న మాటంటే అన్నమయ్యకు పరవశం. ఎన్ని వేల చోట్ల కొండను వర్ణించినా తనివి తీరినట్లు లేదు. పల్లవి ఎత్తుగడలో కొండతో ప్రాంభించినవి, చరణాల్లో కొండను బంధిచినవి కోకొల్లలు. కట్టెదుర వైకుంఠము కాణాచయిన కీర్తన బాగా ప్రచారంలో ఉన్నది. కళ్ల ముందు కనిపించే వైకుంఠమిది. మహిమలు తెట్టెలుగా పైకి తేలుతున్న కొండ ఇది అని మొదలుపెట్టాడు.

పల్లవి:-
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమలకొండ



చరణం-1
వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాదిలోకముల కొనల కొండ
శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ

Ads

చరణం-2
సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ

వుర్విదపసులే తరువులై నిలచిన కొండ
పూర్వటంజనాద్రి యీ పొడవాటి కొండ

చరణం-3
వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీవేంకటపు గొండ

వేదాలు శిలలుగా వెలిసిన కొండ. ఎటు చూసినా పుణ్యతీర్థాలు ఏరులుగా ప్రవహించే కొండ. బ్రహ్మాది లోకాలకు అంచున ఉన్న కొండ. శ్రీదేవుడుండే శేషాద్రి కొండ.

దేవతలు జంతువులుగా పుట్టి తిరిగే కొండ. సప్త సముద్రాలు ప్రవాహాలుగా మారి జలజలా పారే కొండ. తపస్సంపన్నులు వృక్షాలుగా మారిన కొండ. హనుమను కన్న తల్లి అంజనాద్రికి చోటయిన పెద్ద కొండ.

కోరిన వరాలిచ్చే కొండ. లక్ష్మీనాథుడి అందాల కొండ. సంపదలు వర్షించి గుహల్లో నింపుకున్న కొండ. గొప్పగా వెలిగే వెంకన్న కొండ.

వెంకన్నను ఆశ్రయించడం చాలా సులభం; ఆశ్రయిస్తే ఫలం అధికం అని చెబుతున్నాడు అన్నమయ్య. అందుకు సాక్ష్యం, రుజువులు, ఆధారాలు చూపితే తప్ప మనం వినమని అన్నమయ్యకు తెలుసు.

పల్లవి:-
అతి సులభం బిదె శ్రీపతి శరణము అందుకు నారదాదులు సాక్షి

ప్రతిలే దిదియే నిత్యానందము బహువేదంబులె యివే సాక్షి

చరణం-1
వేసరకుమీ జీవుడా వెదకివెదకి దైవమును
ఆసపాటుగా హరి యున్నా డిదె అందుకు ప్రహ్లాదుడు సాక్షి
మోసపోకుమీ జన్మమా ముంచిన యనుమానములను
సేసినభక్తికి జేటు లేదు యీనేత కెల్ల ధ్రువుడే సాక్షి

చరణం-2
తమకించకుమీ దేహమా తగుసుఖదు:ఖంబుల నలసి

అమితము నరహరికరుణ నమ్మితే నందుకు నర్జునుడే సాక్షి

భ్రమయకుమీ వివేకమా బహుకాలంబులు యీదీది
తమితో దాస్యము తను రక్షించును దానికి బలీంద్రుడే సాక్షి

చరణం-3
మరిగివుండుమీ వోజిహ్వా మరి శ్రీవేంకటపతిసుతులు
అరయగ నిదియే యీడేరించును అందుకు వ్యాసాదులె సాక్షి
తిరుగకుమీ విజ్ఞానమా ద్రిష్టపుమాయలకును లోగి
సరిలే దితనిపాదసేవకును సనకాదులబ్రదుకే సాక్షి

శ్రీనివాసుడిని శరణు అనడం చాలా సులభం- అందుకు నారదాదులు సాక్షి. శ్రీనివాసుడి శరణు నిత్యానందదాయకం- అందుకు వేదాలే సాక్షి.

ఓ జీవుడా! ఊరికే అక్కడా ఇక్కడా ఎందుకు తిరుగుతావు? అందుగలడిందు లేడని సందేహము వలదని హరిని అంతటా చూసిన ప్రహ్లాదుడే సాక్షి. మోసపోయి ఈ జన్మను ముంచేసుకోకు. చేసిన భక్తికి చేటులేదనడానికి ధ్రువుడే సాక్షి.

నోటికి నారాయణ నామస్మరణాన్ని అలవాటు చేయి. ఆ నామ స్మరణమే నిన్ను కాపాడుతుందనడానికి వ్యాసాదులే సాక్షి. నానా జ్ఞాన అహంకారంతో ఎక్కడెక్కడో చిక్కుకోకుండా…శ్రీనివాసుడి పాదాలను పట్టుకుంటే చాలు. నిత్య వైకుంఠ ప్రాప్తి దక్కుతుంది. అందుకు సనకాదులే సాక్షి…..  –పమిడికాల్వ మధుసూదన్         9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions