కేసీయార్ అచ్చమైన రాజకీయ వారసుడు… తనలాగే సబ్జెక్ట్ గ్రాస్పింగ్, మాట్లాడే కళ ఉన్నయ్… కానీ ఎందుకోగానీ ఈమధ్య మాట ఎటో ఎటో పోతోంది… (సేమ్, ఇదీ కేసీయార్ టైపే అంటారా..? నో కామెంట్…) నిన్న ఎక్కడో కేటీయార్ మాట్లాడిన తీరు ఆశ్చర్యమేసింది…
ఎన్నికల అవసరం కోసం ఏదో ఒకటి అనేస్తే సరి అనే ధోరణి కరెక్టు కాదు, ఇంకా తనకు చాలా పొలిటికల్ కెరీర్ ఉంది… భవిష్యత్తులో సీఎం కావల్సినవాడు… మాట మీద అదుపు, సంయమనం చాలా అవసరం… ఈ వార్త చూడండి… తెలంగాణ ఆత్మ గౌరవమా..? ఢిల్లీ అహంకారమా..? కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ జాతీయ పార్టీలు… అవి ఉప ప్రాంతీయ పార్టీలు కావు… ఎస్, వాటి హైకమాండ్స్ ఢిల్లీలోనే ఉంటయ్… ఐనంతమాత్రాన వాళ్లు పోటీచేస్తే, వోట్లడిగితే ఢిల్లీ అహంకారమా..?
ఇది తెలంగాణ అస్థిత్వం మీద దాడి ఎందుకవుతుంది..? ఆ పార్టీల తరఫున పోటీచేసేది తెలంగాణ వాళ్లే… రేప్పొద్దున అవి గెలిస్తే తెలంగాణ బిడ్డలే సీఎంలు అవుతారు… పైగా తెలంగాణలో వోట్లడిగితే, అధికార పార్టీని ఎండగడితే అది తెలంగాణ అస్థిత్వం మీద దాడి అవుతుందా..? మరి మీది కూడా జాతీయ పార్టీగా మారింది కదా… దేశ రాజకీయాల్లో ఫాయిదా కోసం, నిలబెట్టిన తెలంగాణ అస్థిత్వాన్ని వదులుకున్నది ఎవరు..?
Ads
పార్టీ పేరులో తెలంగాణను కత్తిరించుకున్నది ఎవరు..? ఇలా తెలంగాణతనాన్ని అవమానించింది ఎవరు..? రేప్పొద్దున ఏ మహారాష్ట్రలోనో ఏ ఠాక్రే వారసుడో ‘‘మరాఠీ అస్థిత్వం ముఖ్యమా..? హైదరాబాద్ అహంకారం ముఖ్యమా..?’’ అని ప్రశ్నిస్తే అది మీకు ఆమోదనీయమేనా..? (ఇంతకీ మన జాతీయ పార్టీ రాబోయే ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పోటీ చేస్తోందా సర్, తెలంగాణతనాన్ని వదిలేసుకున్నా , అంటే వ్రతం చెడ్డా ఫలం, ఫాయిదా దక్కుతుందా బీఆర్ఎస్ బాసూ..?)
ఎవరైనా పార్టీ పెట్టొచ్చు, ఎవరైనా పోటీపడొచ్చు… ఎవరు కావాలో ప్రజలు నిర్ణేతలు… అంతేతప్ప ఇందులో రాష్ట్రాన్ని ఆగం చేయాలనే కుట్ర ఏముంది..? మీకు వోట్లేస్తే తెలంగాణతనమా..? వాళ్లకు వేస్తే రాష్ట్రాన్ని ఆగం చేయడమా..? చివరకు రాహుల్ వ్యంగ్యాన్ని విసురుతూ మోడీని పార్లమెంటులో కౌగిలించుకుంటే అది దోస్తీలా కనిపించిందా ఇన్నేళ్లకు..? ఇవేం విమర్శలు..? ప్రజలు బీఆర్ఎస్, బీజేపీ రహస్య దోస్తులు అంటున్నారు తప్ప కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ ఏ కోణంలోనూ దోస్తులు కావు… మరి ఇవేం మాటలు..? ప్రజలు ఏమాత్రం ఆలోచించరు, మనం ఏదైనా చెప్పొచ్చు అనే ధోరణా..?
కేసీయార్ పాలనలో ఏం తక్కువైందో చెప్పాలి అనే ప్రశ్న వోకే… హైదరాబాద్ బాధిత జర్నలిస్టులు చెబుతారా..? కౌలు రైతులు చెబుతారా..? ముదిరాజులు చెబుతారా..? నిరుద్యోగులు చెబుతారా..? చాలా సెక్షన్లున్నయ్… సోనియా, రాహుల్‌ను రేవంత్‌రెడ్డి గతంలో తిట్టాడు సరే… ఏకంగా తెలంగాణ ఉద్యమకారుల్నే తరిమిన నేతల్ని మీరెందుకు కౌగిలించుకుని పెద్ద పెద్ద పదవులు కట్టబెట్టారు..? ఆ పార్టీకి అయిదారుగురు సీఎం అభ్యర్థులున్నారు గానీ వోటర్లు లేరా..? మరి వోటర్లు లేని ఆ పార్టీని చూసి ఈ మాట తూలడం దేనికి..? దేనికి సంకేతం..?
ప్రతి సందర్భాన్ని ఇలాగే చేస్తున్నారు… ఉదాహరణ తాజాగా ఏమిటంటే… జీవన్‌రెడ్డి ఏదో అన్నాడని మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో నిరసనలు, ధర్నాలు అట… జీవన్‌రెడ్డి బతుకమ్మను అవమానించలేదు… బీఆర్ఎస్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశాడు… దాన్ని బతుకమ్మకు ఆపాదించడం దేనికి..? రాజకీయ పోరాటాలు స్ట్రెయిట్‌గా, హుందాగా ఉండాలి… మరీ ఈ తప్పుదోవలు అవసరం లేదు…!! బీజేపీ, కాంగ్రెసోళ్లు ఏమైనా శుద్ధపూసలు అంటారా..? ఒకరిని చూసి మరొకరు… అందరూ అందరే… కీలకస్థానాల్లో ఉన్నవాళ్లే ఇలా మాట్లాడితే ఇక రేవంత్‌రెడ్డికీ మీకూ తేడా ఏమున్నట్టు…!!
Share this Article