టీవీ ఆన్‌చేసి చానల్స్ మారుస్తుంటే న్యూస్ దగ్గర ఆగాయి రిమోట్ పై వేళ్ళు… స్కూల్ లో అసలు ఆడామగా తేడా కూడా తెలుసుకునే వయసు లేని పసిదాన్ని కొంతకాలంగా అబ్యూస్ చేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్…
వార్త చూడగానే వెన్నులో ఒణుకు పుట్టింది… ఒకటా రెండా, రోజుకో వార్త… వావివరుస, వయసు అనేవి లేకుండా జరుగుతున్న జుగుప్సాకరమైన సంఘటనలు…. భగవంతుడా…. ఎందుకు స్వామీ ఇటువంటి మనుషులను పుట్టిస్తావు…?
ఆడపిల్ల తల్లులు తల్లడిల్లని రోజుండదు. కనుపాపలాగా కాపాడుకోవాల్సిన పరిస్థితి… తెలిసినవాడు, తెలియనివాడు, చుట్టాలు, రక్తసంబంధికులు…. చివరికి కన్నవాడు కూడా కన్నూమిన్నూ కానక పైశాచికత్వాన్ని బహిర్గతం చేసుకునే రోజులను చూస్తున్నాం… ఎవరో రాసినట్లు ‘తల్లి గర్భంలోనే నిర్భయంగా జీవించాం’ అని ఆడపిల్ల చెప్పుకొనే రోజులు.
Ads
ఊహ తెలిసాక అంటే మూన్నాలుగేళ్ళకే… గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మధ్య తేడా నేర్పాల్సిన అవసరం వచ్చింది… సరిగ్గా ఈ నేపథ్యాన్ని ఎంచుకుని ఎన్నో సినిమాలొచ్చాయి… ఆ మధ్య వచ్చిన ‘గార్గి’ పేగుమెలిపెట్టింది… ఇదిగో …మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ‘నేలకొండ భగవంత్ కేసరి’లో ఈ పాయింట్ టచ్ చేసారు.
కమర్షియల్ స్టార్స్ ఇటువంటి అంశాలను భుజానికెత్తుకున్నప్పుడు ఎక్కువమందికి త్వరగానే కాకుండా సూటిగా రీచ్ అవుతుంది. ఇలాంటి విభిన్న అంశాలు హిందీలో అక్షయ్ కుమార్ అమీర్ ఖాన్ లు చేస్తారు. తెలుగులో బాలకృష్ణ చెయ్యడం సాహసమే…! దర్శకుడు అనీల్ రావిపూడి ట్రాక్ రికార్డు తీసుకుంటే అన్నీ చీప్ కామెడీతో నింపిన సినిమాలే. మహేష్ బాబుతో తీసిన ‘సరిలేరు నీకెవ్వరు’ మాస్ మసాలా ఫార్ములా సినిమా…
బాలకృష్ణతో సినిమా అనగానే ఆ… ఇంకేముందిలే తొడగొట్టడం, కత్లులు నూరడం, రక్తాలు చిందించడం అనుకుంటాము. అనీల్ దర్శకత్వం కాబట్టి బాలయ్యతో కూడా కామెడీ పండించాడేమో అనుకుంటాము… అఫ్ కోర్స్, రక్తరచ్చ వుంది. హీరో ఎలివేషన్లు ఉన్నాయి. కానీ, ఆశ్చర్యకరంగా బాలయ్యకి డ్యూయెట్టు లేదు, కామెడీ కోసం సైడు కిక్కులు లేరు.
సినిమా పూర్తి నిడివి తన వయసుకు తగిన పాత్ర వేసాడు. డబులాక్షన్ అని రెండో పాత్రతో సాంగులు సింగించ లేదు. కమర్షియల్ సినిమా కాబట్టి ఫార్ములా చట్రంలో ఇరికినా, కథ మాత్రం కొంత మానవీయ కోణాన్ని తాకింది. అదే సేవింగ్ గ్రేస్…!
బాలయ్య చేత ముద్దులమామయ్య, బాలగోపాలుడు, అప్పటి పిల్లలపై వాత్సల్యం కురిపించే పాత్ర చేయించాడు దర్శకుడు. తాను కనని ఆడబిడ్డకు తానే తండ్రై తల్లై ఫ్రెండై ‘చిచ్చా’ అయి సాకడమే కాకుండా … బేలగా అబలగా తయారవకుండా ఒక ధీరగా తీర్చి దిద్దాలని రేయింబవళ్ళు అతను పడే తపనని రక్తి కట్టించారు, బాలయ్య మెప్పించాడు.
ఈ రోజుల్లో ఈడొచ్చిన ఆడపిల్లని ముళ్ళు తగలకుండా కాపాడుకోవడం ఎంత కష్టమైన పనో ప్రతి తల్లికి తెలుసు. ఆడపిల్ల తానొక సివంగి అని ఎవడినైనా ఎదుర్కోగల శరీరక మానసిక ధారుడ్యాన్ని తల్లితండ్రులే పెంపొందించాలని, మరీ ముఖ్యంగా ఆ పాత్ర తల్లిదే అని చూపించారు…
జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందు మనలోని పిరికితనాన్ని బేలతనాన్ని అధిగమించాలని రెండుమూడు సన్నివేశాల్లో సున్నితంగా చెప్పారు. అన్నిటికంటే నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అసలు ఎక్కడా ఉపన్యాసాలు ఇస్తున్నట్లు లేదు. మొత్తం ఐస్క్రీంలాగా చల్లగా హాయిగా జారిపోయేలాగా ఉంది. బాలకృష్ణ అనగానే ఫ్యాక్షన్ అని దూరం పెట్టే ఆడలేడీ ప్రేక్షకలోకం నిర్భీతిగా చూడవచ్చు. మరీ ముఖ్యంగా ఆడపిల్ల తల్లిగా, బాలయ్య ఫాన్‌గా ఐయాం ఖుష్….!…. Review By Priyadarshini Krishna
Share this Article