సర్లెండి.., రోడ్డు అన్నాక కోసుకుపోదా, బరాజ్ అన్నాక కుంగిపోదా, పంపు హౌజ్ అన్నాక మునిగిపోదా, మోటారు అన్నాక కాలిపోదా…. కాలేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజ్ కుంగిపోయిందనే సోషల్ మీడియా వార్తలకు ఓ నెటిజన్ వ్యంగ్య స్పందన ఇది… అసలే ప్రజల్లో వ్యతిరేకత, పెరిగిన కాంగ్రెస్ జోష్… ఈ స్థితిలో కేసీయార్‌కు ఇప్పుడు మేడిగడ్డ ఓ పెద్ద తలనొప్పి…
మొదటి నుంచీ ఈ ప్రాజెక్టుపై బోలెడు విమర్శలు, సందేహాలు, ఆరోపణలు… అసలు ఇంజినీర్లను పక్కకు తోసేసి, తనే ఓ అభినవ విశ్వేశ్వరయ్యలాగా కేసీయార్ ప్రాజెక్టు రీడిజైన్ చేస్తే తెలంగాణ సమాజం మౌనంగా ఉండిపోయింది… ఆత్మల్ని సారు పాదాల మీద పరిచిన తెలంగాణ మేధోసమాజం వెన్నెముకల్ని కోల్డ్ స్టోరేజీలో దాచుకున్నయ్… మొత్తం ప్రాజెక్టు స్వరూపం మీదే విమర్శలు వచ్చినా ఎవరికీ పట్టలేదు… పైగా మరో అర టీఎంసీయో, ఒక టీఎంసీయో సాకుగా చూపించి, మరిన్ని అప్పులు తెచ్చి, మరింత ఖర్చు పెట్టాలనుకున్నారు… లక్ష కోట్ల ప్రాజెక్టు లాభదాయకత, నాణ్యత మీద ఏ నిఘా లేదు, రాష్ట్రం నుంచి కేంద్రం దాకా ఎవరికీ పట్టలేదు…
అన్నింటికీ మించి ఈ ప్రాజెక్టు కేసీయార్‌కు ఏటీఎంలా మారిందని మొదట్లో ఆరోపించాయి విపక్షాలు, కేసీయార్ జైలుకు వెళ్లకతప్పదని బీజేపీ ముఖ్యనేతలు గుర్రుమన్నారు… కానీ బీజేపీ కేసీయార్ దోస్తులే కదా, కాలేశ్వరం మీద ఈగవాలలేదు మళ్లీ… ‘‘సరే, ఈరోజుల్లో తిననివాళ్లు ఎవరున్నారు… కనీసం ఓ పెద్ద ప్రాజెక్టు పూర్తిచేశాడు కదా కేసీయార్, మిగతా పార్టీలకు అదీ చేతకాదు కదా’’ అనుకున్నారు తటస్థులు… కానీ ఈ ప్రాజెక్టు నాణ్యత ఏమిటి, భవిష్యత్తు ఏమిటి అనే పెద్ద ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని కమ్మేస్తున్నయ్…
Ads
ప్రపంచంలోకెల్లా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని చెప్పుకుంటూ, ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులను తీసుకొచ్చి చెప్పిస్తూ, మీడియాలో ఆకాశమంత ఘనతగా రాయిస్తూ, చూపిస్తూ… దీన్ని కేసీయార్ మార్క్ అభివృద్ధికి ఐకాన్‌లా చూపించారు కదా… మరి ఇప్పుడు..? ఒక బరాజ్ కుంగిపోవడం అంటే…?!! నిజానికి అక్కడ ఏం జరిగిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు… ప్రస్తుతానికి రాకపోకలు ఆపేశారు… కుంగిన మాట వాస్తవమని ప్రాజెక్టు బాధ్యులైన ఇంజినీర్లూ చెబుతున్నారు… మెల్లిగా దీన్ని కుట్ర కోణంవైపు తీసుకుపోతున్నారు…
నిజంగా కుట్ర ఉందా..? ఇన్నేళ్లుగా ఏ ప్రాజెక్టుకూ తలెత్తని కుట్ర ముప్పు కాలేశ్వరానికి ఎందుకు..? ప్రాజెక్టు డిజైన్ లోపాలు, నాణ్యత లోపాల గురించి చెప్పాలంటే గతంలో ఒక పంపు హౌజ్ మొత్తం మునిగిపోయింది… 17 బాహుబలి మోటార్లకు గాను 12 మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నాయి… ఇప్పుడు ఆ మోటార్ల పరిస్థితి ఏమిటో ఎవరూ మాట్లాడరు, మిగిలిన మోటార్లలోనూ ఎన్ని పనిచేస్తున్నాయి..?
మరి మేడిగడ్డ బరాజ్ ప్రమాదం తీవ్రత ఎంత..? ఇప్పుడు ఇదీ కలవరం కలిగిస్తున్న ప్రశ్న… ఈ సాంకేతిక వైఫల్యాలకు కారకుడు ఎవరు..? రాను రాను ఈ ప్రాజెక్టు భవితవ్యం ఏమిటి..? ఈ బరాజ్ కట్టింది ఎల్ అండ్ టీ అట, అయిదేళ్లపాటు ఏం జరిగినా ఆ సంస్థే భరించాలట… సో, రాష్ట్ర ఖజానాకు వచ్చిన నష్టం ఏమీ లేదని ఎవరో ఇంజినీర్ చెప్పాడట… ఎవరిది ఖర్చు భారం అనేది ప్రశ్న కాదయ్యా మహానుభావా..? ఆ తరువాత బరాజ్ పరిస్థితి ఏమిటి..?
Share this Article