Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదె వేంకటాచల మఖిలోన్నతము, అదివో బ్రహ్మాదులకపురూపము…

October 23, 2023 by M S R

Torchbearers : సంగీత, సాహిత్యాల్లో సమానమైన విద్వత్తు కలిగిన అతికొద్దిమందిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ (1893- 1979) ముందు వరుసలో ఉంటారు. తెలుగు, సంస్కృతం, కన్నడ, ప్రాకృత భాషల్లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో సంగీతంలోకూడా అంతే ప్రావీణ్యం ఉంది. అన్నమయ్య కీర్తనలను రాగిరేకులనుండి ఎత్తి రాసి…తప్పొప్పులను పరిష్కరించి లోకానికి అందించిన నలుగురు మహా పండితుల్లో ఆయన ఒకరు. సాహితీ విమర్శకు, తెలుగు వ్యాసరచనకు ఆయన దారిదీపం.

“అన్నమాచార్యుని కవిత” అన్న శీర్షికతో ఆయన 1955లో రాసిన వ్యాసం ఎమెస్కో సంస్థ 2017 లో ప్రచురించిన “రాళ్లపల్లి సాహిత్య, సంగీత వ్యాసాలు” పుస్తకంలో ఉంది. అందులో కొంత భాగమిది.

తెలుగు వాఙ్మయ చరిత్రలో పదిహేనో శతాబ్దం ఒక ప్రధానమైన ఘట్టం. కవితాకన్య అసందిగ్ధమైన కౌమార వయో మాధుర్యాన్ని దాటి…తొలిప్రాయపు తళుకులు, అందరినీ ఆకర్షించే బెళుకులు నేర్చుకున్న కాలమది. కవులకు లోకకల్యాణం కన్నా…ఆత్మకల్యాణంమీదే దృష్టి ఎక్కువగా ఉండేది. పాల్కురికి సోముడు, నాచన సోముడు మొదలైనవారు ఆరాధించిన ఈ కవితామార్గం బమ్మెర పోతన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మొదలైన మహానుభావుల రచనలలో మరింతగా పండింది. ఈవరుసలో తాళ్లపాక అన్నమాచార్యులు ముందుంటాడు.

Ads

తెలుగులో పదకవిత్వం రాసినవారు ఇతనికంటే ప్రాచీనులు మనకు కనిపించరు. గేయకవిత మనిషికి సహజమైన పరమ ప్రాచీనమైన రచన. ఇతర భాషల్లోలా తెలుగులో కూడా అనాదిగా పాటలు రాసి…పాడినవారు ఎందరో ఉండి ఉంటారు. కానీ మనకు దొరకలేదు. కృష్ణమాచార్యుడి సింహగిరి వచనాల్లాంటివి కొన్ని అన్నమయ్యకు ముందు పుట్టినా…ఆనోట ఈనోట పడి మనదాకా వచ్చేసరికి అది ఎన్నెన్ని మార్పులకు లోనయ్యిందో తెలియదు.

పదిహేనో శతాబ్దానికి ముందే కన్నడ భాషలో పదకవిత దాస సాహిత్యరూపంలో ఒక స్పష్టమయిన రూపం సంతరించుకుంది. పదానికి రెండే అంగాలు. 1 . పల్లవి. 2 . చరణం. కేంద్రభూతమయిన అర్థం పల్లవిలో ఉంటుంది. దాని విస్తరణ చరణాల్లో ఉంటుంది.
“ఎండగాని నీడగాని ఏమయినగాని
కొండలరాయుడే మా కులదైవము” అన్నది పల్లవి.

“తేలుగాని పాముగాని దేవపట్టయినగాని
గాలిగాని ధూళిగాని…కాని ఏమయినా…” అన్నది చరణం.

సంగీత దృష్టితో చూస్తే తాళలయాలు రెండూ ఆద్యంతం ఒకే రీతిగా గోచరిస్తుంది. ఎన్ని చరణాలు ఉన్నా…వాటి రాగస్వర సంచారం ఒకే రీతిగా ఉంటుంది. తెలుగులో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టినవాడు అన్నమయ్యే. అందుకే అతడు పదకవితా పితామహుడు అయ్యాడు.

పద్య రచనకు, పద రచనకు చాలా తేడా ఉంది. పద్యంలో అక్షర సంఖ్య, మాత్రాగణ సంఖ్య కచ్చితంగా ఉంటే చాలు. లయతో సంబంధం లేదు. పదాలలో తాళం చూసుకోవాలి. స్వరానికి శ్రుతి ఎంత ముఖ్యమో, తాళానికి లయ అంతే ముఖ్యం. తాళం తప్పకుండా పద సాహిత్యంలో నడక సాగాలి. యతిప్రాసలు పద్యంలో, పద కవిత రెండిట్లో ఉన్నా సంగీతంలో లీనమయ్యే యతిప్రాసలు పదకవితకు తప్పనిసరి.

అన్నమయ్య పదకవితను ఒక రచనగా కాకుండా ఒక తపస్సుగా స్వీకరించాడు. అన్నమయ్య పదకవితలో కనిపించే భావబలం, భాష తీరు, అనుభవాల లోతు, వైవిధ్యం ఇంకే పదకవి రచనలో కనిపించదు. శృంగారాన్ని కూడా ఆధ్యాత్మికతకు మళ్లించిన మహాపురుషుడు ఆయన. తరువాతి శృంగార కవులెవరూ అన్నమయ్య ఎత్తుకు చేరలేకపోయారు.

వేంకటేశ్వరుడి డోలావిహారం, గుర్రపుస్వారి, గరుడయాత్ర మొదలైన ఆటలన్నిటినీ వట్టి వినోదాలుగా కాక విశ్వలీలావిహారాలుగా కలిపి చిత్రించి అనుభవించినవాడు అన్నమయ్య. మనం కూడా అలా అనుభవిస్తే ధన్యులమవుతాము. పాడుకోగలిగితే సరే. పాడలేనివారు పద్యాలుగా చదువుకుని ఆనందించినా…చాలు…. (ఎమెస్కో సౌజన్యంతో… పమిడికాల్వ మధుసూదన్…)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions