తెలంగాణ ప్రజల అభిప్రాయాలు కనుక్కుంటుంటే జనరల్‌గా వినిపించేది ఒకటుంది.,. ‘‘కేసీయార్ మళ్లీ ముఖ్యమంత్రి అయినా సరే, నష్టమేమీ లేదు, కానీ మా ఎమ్మెల్యే మాత్రం మళ్లీ గెలవొద్దు… పాత ఫాసిస్టు జమీందార్లు నయం… పోనీ, మా ఎమ్మెల్యే ఒక్కడు ఓడిపోతే పోయేదేముంది..?’’… ఈ అభిప్రాయం బలంగానే ఉంది…
ఎవరొచ్చినా సరే… మా ఎమ్మెల్యే మాత్రం మళ్లీ వద్దు బాబోయ్ అనే ప్రజావ్యతిరేకత అంతిమంగా కాంగ్రెస్‌కు బలంగా మారుతోంది… బీజేపీ ఊపు, దూకుడు ఎలా నేలకు దిగిపోయాయో, కారణాలేమిటో చెప్పుకుంటూనే ఉన్నాం కాబట్టి ఇక్కడ మళ్లీ అక్కర్లేదు… పోనీ, కాంగ్రెసోళ్లు ఏమైనా నీతిమంతులా..? ఈ ప్రశ్నకు మరో జవాబు… మరీ వీళ్లంత కాదులే బిడ్డా… ఇదీ జవాబు…
రోజుకో సర్వే చేయించుకునే కేసీయార్‌కు తెలియదా..? ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఈమాత్రం గమనించలేకపోయాడా..? అన్నీ తెలుసు… తన ఎమ్మెల్యేలను నయా జమీందార్లను చేసిందే తను… జనం మీద రుద్దిందే తను… నిజం చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఓ దిక్కుమాలిన నాయకత్వాన్ని తయారు చేశాడు… కానీ మళ్లీ సిట్టింగులనే జనం మీదకు వదులుతున్నాడు… ఇదెలా అర్థం చేసుకోవాలి…?
Ads
ఎహె, తెలంగాణ మొత్తమ్మీద అన్ని సీట్లలోనూ కేసీయారే నిలబడుతున్నట్టు లెక్క… ఆయన మొహం చూసే వోట్లేస్తారు జనం అని సమర్థించేవాళ్లు బోలెడు మంది… కానీ సిట్టింగుల మీద వ్యతిరేకత మాటేమిటి..? ఇంత వ్యతిరేకత ఉన్న సిట్టింగులకు మళ్లీ టికెట్లు ఎందుకిచ్చినట్టు..? మళ్లీ మళ్లీ మీరే జనం మీద పడండి అని చెబుతున్నట్టా..? సరే, తన రాజకీయ అనివార్యతలు, టికెట్లు ఇవ్వకపోతే వీళ్లే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోకి వెళ్లి, ఏకంగా బీఆర్ఎస్‌కే థ్రెట్స్ అవుతారనే భయమా..?
నిజానికి ఈ భయసందేహాలు కేసీయార్‌లో కూడా ఉన్నాయి… అందుకే ఓ కొత్త వాదనను జనంలోకి తీసుకొస్తున్నది కేసీయార్ క్యాంపు… ఈరోజు నమస్తే తెలంగాణలో ఓ ఎడిట్ ఫీచర్ అచ్చంగా అదే… ఒక్కసారి ఇది చదవండి…
బీజేపీయా, బీఆర్‌ఎస్సా అని కాదు, మనకు కిషన్‌రెడ్డి కావాలా, కేసీయార్ కావాలా ఆలోచించాలట… కాంగ్రెస్సా, బీఆర్ఎస్సా అని కాదట, రేవంతా, కేసీయారా అని పోల్చుకోవాలట… ఇక్కడ ప్రశ్న ఏమిటంటే..? బీజేపీ గనుక అధికారంలోకి వచ్చే పక్షంలో (ఉత్తుత్తినే డిబేట్ కోసం, అదేమీ సొంతంగా అధికారంలోకి వచ్చే సీన్ అస్సలు లేదు) కిషన్‌రెడ్డి సీఎం అవుతాడని ఎవరు తేల్చారు..? అసలు కిషన్‌రెడ్డితో కేసీయార్‌ను పోల్చడం ఏమిటి…? ఐనా తనకు ఏం తక్కువ..? తను కేంద్ర మంత్రి… తను కాదంటే బీజేపీలో ఇక ఎవరూ లేరా సీఎం పదవి తీసుకునేది..? తెలంగాణ రాకముందు కేసీయార్ స్థాయి ఏమిటి..? కాలం పదును పెడుతుంది, చెక్కుతుంది… అంతే తప్ప ఈ పోలికలు దేనికి..?
సేమ్, రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీ ఎక్కుతాడని ఎవరన్నారు..? పార్టీలో బోలెడు మంది ఉన్నారు… అవసరమైతే రెండేళ్లకు ఒకరు మారతారు..? కాదంటే కేసీయార్‌కే ఓ షిండే దొరుకుతాడు… అంతేతప్ప రేవంత్‌తో పోల్చుకుని, కేసీయార్‌కు వోటేయాలని అడగడం దేనికి..? ఐనా మళ్లీ సీఎం కేసీయార్ కావడం లేదు కదా… కేటీయార్ కదా కాబోయే సీఎం… మరి రేవంత్‌నూ కేటీయార్‌నూ, కిషన్‌రెడ్డిని కేటీయార్‌నూ పోల్చుకుంటే బెటర్ కదా…
‘‘నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరైనా కావచ్చు, కొందరు అందరికీ నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అట్లని ఎలుకలున్నాయని ఇల్లు కాలబెట్టుకుంటమా’’ అని నీతిబోధ చేస్తోంది నమస్తే… అది కేసీయార్ సొంత పత్రిక, అందులో ప్రతి అక్షరమూ కేసీయార్ ఆలోచనల సారమే… అందుకని అభ్యర్థులను కాదు, నన్ను చూసి వోట్లేయండి అంటున్నట్టా కేసీయార్..? అంటే ఇలాంటి సిట్టింగులున్న పార్టీ ఎలుకలున్న ఇల్లు వంటిదేనా..? కేసీయార్ అంగీకరిస్తున్నట్టు భావించాలా..?
మరి అలాంటోళ్లను జనం మీదకు ఎందుకు రుద్దుతున్నట్టు సార్..? ఎలుకలున్నయని ఇల్లు కాలబెట్టుకోం, నీ మొహం చూసే వోట్లేస్తాం… నీ మీద కోపం లేదు మాకు… కానీ గెలుపు తరువాత ఆ పాత మా నయా జమీందార్లే మా నెత్తిన స్వారీ చేస్తారు కదా… ఆ బాధ పోయేదెట్లా..? ఆ బాధ రాకుండా మేమేం చేయాలి..? ఎలుకల బాధ అని తమరే అంగీకరిస్తున్నారు కదా మాస్టారూ… ఎలుకల్ని ఏం చేయాలి..? కళ్లు మూసుకుని వోట్లేసి మా నెత్తి మీదకు ఎక్కించుకోవాలా..? మీ ఎడిట్ ఫీచర్‌ను బట్టి మాలో తలెత్తే భయసందేహాలే ఇవన్నీ మాస్టారూ…
Share this Article