‘రసపట్టులో తర్కం కూడదు’ అన్నారు పింగళి మాయాబజార్‌లో. ఈ డైలాగ్‌ని ఒకసారి వింటే ‘ఏదోలే’ అనిపిస్తుంది. రెండోసారి వింటే ‘ఇందులో ఏదో ఉందే!’ అనిపిస్తుంది. మూడోసారి వింటే ‘కొత్తదనం’ గురించి ఆలోచింపచేస్తుంది. ఒక ఈ డైలాగ్ కంఠోపాఠం అయ్యాక, అందులోని రసాన్ని తనివితీరా ఆస్వాదిస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ డైలాగ్‌ని తలుచుకున్న కొద్దీ హాస్యం ఊటలా ఊరుతూనే ఉంటుంది. అదీ హాస్యం అంటే.
కంఠాభరణం నాటకంలో పానుగంటివారి హాస్యమూ అంతే… ఆ నాటకం వింటున్నకొద్దీ ఆ హాస్యం మన గుండెలను గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. భారతీయుల గుండెల్లో హాస్యానికి ప్రత్యేకస్థానం ఉంది. అందునా దసరా పండుగ పేరు చెప్పగానే కొత్త అల్లుళ్లు, మరదళ్ల అల్లరిచేష్టలు, బావమరదుల సరదాలు… ఒకటేమిటి… అడుగడుగునా వెటకారంతో కూడిన సరదాలు మన జీవితంలో భాగంగా మారిపోయాయి.
ఓ అల్లుడు అత్తారింటికి వచ్చాడు.
ఆయన కాస్తంత మితభాషి.
ఆ రోజు ఎందుకోగానీ కొద్దిగా నోరు విప్పాడు.
అంతే..
పక్కనే ఉన్న బావమరిది, ‘ఈ రోజు వానపాము కూడా పడగ విప్పిందే’ అని బావగారిని ఆట పట్టించాడు.
ఆ బావ కడుపునిండుగా నవ్వుకుంటూ, ‘మరే, మీ అక్క దగ్గర ఉంటే వానపాము కూడా పడగ విప్పాల్సిందే! తప్పదు’ అన్నాడు.
అందరూ హాయిగా నవ్వుకున్నారు.
ఇదీ హాస్యం అంటే…
Ads
దసరా సందర్భంగా ప్రముఖ ఈటీవీ చానెల్లో వచ్చిన ప్రత్యేక కార్యక్రమం అసభ్యానికే అసభ్యం వేసేలా ఉంది. ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి నోటి నుండి కూడా అసభ్య పదజాలం నేరుగానే వచ్చేశాయి. అసలు అనిల్ రావిపూడి తీసేదే నేలబారు, చవకబారు హాస్యం. పింగళి, ముళ్లపూడి, జంధ్యాల, కోన వెంకట్ (కొంతవరకు), త్రివిక్రమ్… వరుసగా హాస్యాన్ని ఒక స్థాయిలో పండించారు. కానీ ఈ కార్యక్రమం మాత్రం ఇంటిల్లిపాదీ తలదించుకునేలా చేసింది. ఈటీవీదే జబర్దస్త్ వంటి బ్యాడ్ టేస్ట్, దానికి అనిల్ రావిపూడి తోడయ్యాడు… ఆ సినిమాలో కేసీపీడీ బాపతు వెగటు తెలుసు కదా…
సిల్క్ స్మితలా ఉండే ఒక క్యారెక్టర్‌ని ఎందుకు తీసుకువచ్చారో తెలీదు. అబ్బాయిలంటే ఆడపిల్లల వెంట పడతారన్నట్లుగా, ఆది, రామ్‌ప్రసాద్… వరుసగా అందరూ ఆ అమ్మాయి వెంట పడుతున్నట్లు చూపించి, ప్రేక్షకులకు ఏం సందేశం ఇస్తున్నారో అర్థం కాలేదు. ఎదుటివారిని కాలితో తన్నడమే హాస్యం కింద చాలాకాలం క్రితమే సినిమా ప్రపంచం అలవాటు చేసేసింది. ఇంత నేలబారు హాస్యం ఏమిటో! పోనీలే అని అవన్నీ భరించినా పరవాలేదేమో కానీ, మరీ డబుల్ మీనింగ్ డైలాగులు (అసభ్యం అని తెలిసిపోయేలా) మాట్లాడి ఏం సందేశం ఇస్తున్నారు. మరీ ఇంత చవకబారు హాస్యం ఏమిటి?
ఇటువంటి కార్యక్రమాలకు సెన్సార్ లేకపోవడం దురదృష్టం. ఎంతో క్రెడిబిలిటీ ఉన్నట్టు చెప్పబడే ఈ చానల్‌లో ఇటువంటి కార్యక్రమాలు ప్రసారం కావడం ప్రేక్షకుల దురదృష్టం. పండుగనాడు సరదాగా హాయిగా నవ్వుకుందాంలే అని టీవీ పెట్టుకున్న ప్రేక్షకులకు ఈ కార్యక్రమం అసహ్యాన్ని మిగిల్చింది. ఉత్తమ హాస్యం రాయగలిగిన యువత అవకాశం కోసం ఎదురుచూస్తోంది. అటువంటివారికి అవకాశం ఇచ్చి, ఇటువంటి పచ్చి అసభ్య కార్యక్రమాలకు స్వస్తి పలికితే మంచిదేమో.
హైపర్ ఆది నోటి నుంచి వచ్చే ప్రతిమాటలోనూ డబుల్ మీనింగే ఉంటోంది. అటువంటి వారిని అదుపులో ఉంచటం అవసరం. మంచి హాస్యాన్ని పంచుతున్న రాకెట్ రాఘవ లాంటి వారిని ప్రోత్సహించమని మనవి… ఇదుగో ఇలాంటి ప్రోగ్రామ్స్, అదుపు తప్పిన మాటలు, చేష్టల వల్లే ఈటీవీ రియాలిటీ షోలను జనం తిరస్కరిస్తున్నారు… అందుకే అది తెలుగు వినోద చానెళ్ల పోటీలో దిగజారిపోయి మరీ మూడో ప్లేసులో స్థిరపడింది… ఈటీవీ యాజమాన్యానికి ఏమైనా అర్థం అవుతోందా..? … ఇట్లు, ఓ సగటు టీవీ ప్రేక్షకురాలు…
Share this Article