Nancharaiah Merugumala……. బిషన్ సింగ్ బేడీ పేరులో విష్ణువు ఉన్నాడనీ, వేదీ అనే మాటకు ‘బేదీ’ పంజాబీ రూపమని ఆలస్యంగా తెలిసింది! బేదీ ఆస్ట్రేలియా భార్య సంగతి ఒక్క సాక్షే ప్రస్తావించింది!
……………………………………….
మేం ఆరో తరగతి చదువుతుండగా (1967–68) ఆంధ్రప్రభ నుంచి క్రికెట్ వార్తలు మా నాన్న నాతో చదివించుకుని వినే రోజుల్లో మొదటిసారి కనిపించిన పేరు బిషన్ సింగ్ బేడీ. అప్పటికి పంజాబీల (సిక్కులూ, హిందువులూ) పేర్లు ఎలా ఉంటాయో కొద్దిగా సోయి ఉన్న మాకు ఈ బిషన్, బేడీ అనే మాటలకు అర్ధాలు తెలియక ఇబ్బంది పడేవాళ్లం. బిషన్ అనేది బిషణ్ అనీ, విష్ణు అనే మాటను పంజాబీలో అలాగే పలుకుతారని, సింగ్ తర్వాత ఉన్న ఇంటిపేరు బేడీని పంజాబీలో బేదీ అని ఉచ్చరిస్తారని, హిందీలోనూ అట్లా రాస్తారని, మనం కూడా అలాగే రాయాలనే విషయం ఆ తర్వాత పదేళ్లకు గాని నాకు తెలియలేదు.
Ads
ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్ లో ఎంఏ చదివే రోజుల్లో అక్కడ స్థిరపడిన నా పంజాబీ స్నేహితులు చెబితే ఈ విషయం అర్ధమైంది. సనాతన హిందూ ధర్మానికి ఒకప్పుడు కేంద్రస్థానమైన పంజాబ్ ప్రాంతంలో పన్నెండొందల ఏళ్ల క్రితమే వేదాలు చదువుకున్న ఖత్రీ (క్షత్రియ) కుటుంబాల సభ్యులను బేదీలు (బెంగాలీలో మాదిరిగానే పంజాబీలో కూడా కొన్ని పదాల్లో వ అనే శబ్దం బ అవుతుంది) అని పిలిచేవారట. సిక్కు మతానికి ఆద్యుడుగా పరిగణించే గురు నానక్ దేవ్ (1469–1539) అసలు ఇంటి పేరు కూడా బేదీయే. అంటే ఆయన పూర్వీకులు కూడా వేదాలు చదువుకున్న హిందూ ఖత్రీలే. అందుకే గురు నానక్ బేదీ ఖత్రీ కుటుంబంలో పుట్టారని చెబుతారు. భారత క్రికెట్ జట్టుకు తొలి సిక్కు కెప్టెన్ కాప్టిన్ అయిన బిషణ్ సింగ్ కూడా గురు నానక్ మాదిరి బేదీ ఖత్రీ కావడం విశేషం.
సిక్కులకు ఎక్కువగా హిందువుల పేర్లే పెట్టేవారు
………………………………………………………
సిక్కులు ప్రత్యేక మతమైనాగాని ఈ ధర్మాన్ని అనుసరించేవారు హిందూ దేవతల పేర్లు పెట్టుకోవడం ఇప్పటికీ కొనసాగుతోంది. మన ప్రముఖ పంజాబీ సిక్కు నాయకుల్లో ఒకరైన మార్క్సిస్టు హర్ కిషన్ సింగ్ సుర్జీత్ పేరు చూస్తే ఈ విషయం అర్ధమౌతుంది. హరికృష్ణను అలా పలుకుతారు పంజాబీలు. బిషన్ అంటే విష్ణు అని, భీషమ్ సాహ్నీలోని భీషమ్ అంటే భీష్మ అని చాలా ఏళ్లకు గాని అవగాహన కలగలేదు.
పాకిస్తాన్ పంజాబ్, అవిభక్త పంజాబ్ కు సంబంధించిన ధార్మిక, సామాజిక, సాంస్కృతిక, చారిత్రక అంశాలపై పుస్తకాలతోపాటు వ్యాసాలు ఇంగ్లిష్ లో క్రమం తప్పకుండా రాసే ప్రసిద్ధ పాక్ (లాహోర్) రచయిత హారూన్ ఖాలిద్ వ్యాసాలు చదవడం వల్ల అనేక మంది భారతీయులకు గురు నానక్ పై ఆసక్తి పెరిగింది. పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో ఇప్పటికీ పూర్వపు హిందూ ధార్మిక, సాంస్కృతిక అవశేషాలు స్థానిక పంజాబీ ముస్లింల జీవితాలతో ముడిపడి ఎలా ఉనికిలో ఉన్నాయో తెలుపుతూ ఆయన రాసిన ‘ఇన్ సెర్చ్ ఆఫ్ శివా’ (2015), ‘వాకింగ్ విత్ నానక్’ అనే పుస్తకాల గురించి కూడా చదివాక ముస్లిం, సిక్కు, హిందూ పంజాబీలపై ఆసక్తి పెరిగింది.
ఇప్పుడు పాకిస్తాన్ లో అంతర్భాగమైన భూభాగంలో (నన్కానా సాహిబ్–అసలు పేరు రాయ్ భోయ్ తల్వండీ) పుట్టిన నానక్ తన జీవిత కాలంలో తిరిగిన ప్రదేశాలన్నింటికీ పోయి– రచయిత ఖాలిద్ ‘వాకింగ్ విత్ నానక్’ పుస్తకం రాశారు. 35 ఏళ్ల యువకుడైన ఖాలిద్ లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్‌లో, యూనివర్సిటీ ఆఫ్ టోరంటోలో ఆంత్రపాలజీ తదితర శాస్త్రాలు చదువుకుని తన సహచరి ఆనమ్ జకారియాతో కలిసి ఇప్పుడు కెనడాలోనే స్థిరపడ్డారు. పాకిస్తాన్ లో ఇస్లామిక్ ఛాందసవాదుల నుంచి ప్రమాదం పొంచి ఉండడంతో ఖాలిద్ గ్రంథాలను ఇండియాలోనే ప్రచురించారు. తన రచనల్లో మతాన్మోదం ఎంత ప్రమాదకరమో చక్కగా వివరించే ఖాలిద్ వాటిలో ఎక్కడా ఛాందసవాద ముస్లింలను రెచ్చగొట్టే విధంగా రాయకపోవడం ఆయన స్వభావానికి నిదర్శనం.
బేదీ ఆస్ట్రేలియా భార్య ప్రస్తావన ఈనాడులో లేకుండా సాక్షిలో రావడం ఆశ్చర్యకరం!
………………………………………………………………………………..
మళ్లీ బిషణ్ సింగ్ బేదీ విషయానికి వసే–్త గ్లోబలైజేషన్ అంతగా విస్తరించని 1960ల చివరిలోనే లేదా 1970ల మొదట్లోనో ఆయన ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన శ్వేతజాతి క్రైస్తవ యువతి గ్లెనిత్ మైల్స్‌ను పెళ్లాడగా, ఇద్దరు పిల్లలు పుట్టారు. అప్పట్లో తలకు పట్కా (జుట్టు కనపడకుండా బిగించే గుడ్డ) కట్టుకున్న బాగా తెల్ల రంగు కొడుకు గావసిందర్, కూతురు గిలిందర్, భార్య గ్లెనిత్ తో బీఎస్ బేదీ కలిసి ఉన్న ఫోటోలు ‘స్పోర్ట్స్ వీక్’ వంటి ఇంగ్లిష్ పత్రికల్లో చూసినట్టు గుర్తు. అలాగే మహారాష్ట్రకు చెందిన గౌడ సారస్వత బ్రాహ్మణ (జీఎస్బీ) కుటుంబంలో పుట్టిన సునీల్ గావస్కర్ కూడా బేదీ మాదిరిగా విదేశీ వనితను పెళ్లాడలేదు.
కానీ. పంజాబీ ఖత్రీ కుటుంబానికి చెందిన మార్షనీల్ (యూపీ కాన్పూర్ కు చెందిన ప్రముఖ లెదర్ వ్యాపారి బీఎల్ మెహరోత్రా) కూతురు) ను సహచరిగా చేసుకున్న విషయం అప్పట్లో మా తరానికి ఎంతో ఆసక్తిదాయకంగా ఉండేది. అలాగే మరో జీఎస్బీ బ్రామ్మణ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ కూడా బ్రిటిష్ తల్లి ఆనబెల్ కి, గుజరాతీ మెహతా తండ్రికి పుట్టిన అంజలీని వివాహమాడిన విషయం కూడా అప్పట్లో విశేషమే. అంజలీలో తల్లి బ్రిటిష్ ముఖకవళికలు కనిపిస్తాయి.
మిత్రుడు గావస్కర్ పేరు కలిసేలా బేదీ తన పెద్ద కొడుకుకు గావసిందర్ అని పేరు పెట్టాడనేది ఆసక్తిదాయక వార్తే. అయితే, అన్ని తెలుగు పత్రికలూ బేదీ మరణం వార్త రెండో వాక్యంలో సాంప్రదాయబద్ధంగా–ఆయనకు భార్య అంజు, కుమారుడు అంగద్ బేడీ, కూతురు నేహా ఉన్నారని రాశాయి. ప్రముఖుల వ్యక్తిగత విశేషాలు కాస్త పకడ్బందీగా ఇస్తుందనే పేరున్న ఈనాడు మాత్రం బేదీ ఆస్ట్రేలియా భార్య గ్లెనిత్ ఊసే ఎత్తలేదు. అలాంటిది సాక్షి పత్రికలో– బేదీ మొదటి భార్య గ్లెనిత్ మైల్స్ ద్వారా ఇద్దరు సంతానం కొడుకు గావసిందర్, కూతురు గిలిందర్ ఉన్నారు–అని రాయడం నిజంగా గొప్పే.
కానీ, గ్లెనిత్ ఆస్ట్రేలియన్ అని చెప్పలేదు ఈ వార్తలో. మంచి కరిజ్మా (జనాకర్షణ శక్తి) ఉన్న క్రీడాకారులు లేదా సినిమా స్టార్లు భాషాంతర, మతాంతర, దేశాంతర, ఖండాంతర పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాల్లో వారి ‘ఇమేజ్’ కొత్త రూపం సంతరించుకుంటుంది. తెలుగు హీరో ఘట్టమనేని మహేష్ బాబు గోవాలో మూలాలున్న ప్రఖ్యాత కళావంత్ కుటుంబానికి (ఈ కులంవారు ఇప్పుడు మరాఠా గోమంతక్ సమాజ్ అని పేరు మార్చుకున్నారు) చెందిన నమ్రతా శిరోద్కర్ ను వివాహమాడడం టాలీవుడ్ లో చాలా అరుదుగా జరిగే పరిణామం. అత్యధిక ప్రజానీకానికి తెలిసిన క్రీడాకారులు బేదీ, సచిన్ తెందూల్కర్ లాగా చేసుకునే మతాంతర, భాషాంతర పెళ్లిళ్లు జనాన్ని బాగానే అప్పటికీ, ఇప్పటికీ ఆకట్టుకుంటాయి…
Share this Article