Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ ఎనిమిది మందిలో మన తెలుగువాడు కూడా…! ఖతార్ వదిలేసేనా..?!

October 27, 2023 by M S R

Nancharaiah Merugumala….  ఖతార్‌ లో మరణశిక్ష పడిన 8 మంది భారత నేవీ మాజీ సిబ్బందిలో తెలుగు అధికారి పాకాల సుగుణాకర్‌! ఇజ్రాయెల్‌ తరఫున అత్యంత సంపన్న అరబ్‌ దేశంలో గూఢచర్యం నిజమైతే అది పెద్ద నేరమే!

…………………………

అత్యంత సంపన్న పెట్రో అరబ్‌ దేశం ఖతర్‌ సైనిక దళాలకు సేవలందించే ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ కంపెనీలో పనిచేస్తున్న 8 మంది భారత నేవీ రిటైర్డ్‌ ఉన్నతోద్యోగులకు గురువారం అక్కడి కోర్టు మరణ శిక్ష విధించిందనే వార్త దేశంలో సంచలనం సృష్టించింది. వారు ఇజ్రాయెల్‌ తరఫున గూఢచర్యానికి పాల్పడ్డారనేది ప్రధాన అభియోగం. కాంగ్రెస్, ఎంఐఎం సహా ప్రధాన రాజకీయపక్షాలు ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఎనిమిది మంది భారతీయులను కాపాడడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అన్ని ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేశాయి.

మరణశిక్ష పడిన భారతీయుల్లో ఒకరైన కమాండర్‌ సుగుణాకర్‌ పాకాల విశాఖపట్నానికి చెందిన తెలుగు కుటుంబంలో పుట్టారు. ఆయనతోపాటు ఇండియన్‌ నేవీలో పనిచేసిన కెప్టెన్లు నవతేజ్‌ సింగ్‌ గిల్, బీరేంద్రకుమార్‌ వర్మ, సౌరభ్‌ వశిష్ట్, కమాండర్లు అమిత్‌ నాగపాల్, పూర్ణేందు తివారీ, సంజీవ్‌ గుప్తా, సెయిలర్‌ రాగేవ్‌ పై నేరాభియోగాలను ఒక ఖతార్‌ న్యాయస్థానం కొన్ని మాసాలుగా విచారించి మరణ శిక్ష విధించింది. ఎనిమిదో భారత నిందితుడి పేరు ఖతార్‌ వెల్లడించ లేదు.

Ads

ఖతార్‌ సైనిక దళాలకు, ఇతర భద్రతా దళాలకు శిక్షణ, ఇతర సేవలు అందించే అల్‌ దహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌ అండ్‌ కన్సల్టెన్సీ సర్వీసెన్‌ అనే ప్రైవేటు కంపెనీలో పాకాల కరుణాకర్‌ తోపాటు మిగిలిన ఏడుగురు భారత నేవీ మాజీ సిబ్బంది పనిచేస్తున్నారు. మరో గల్ఫ్‌ అరబ్‌ దేశం ఒమాన్‌ కు చెందిన ఎయిర్‌ ఫోర్స్‌ అధికారి ఈ కంపెనీని 2015లో స్థాపించారు. 8 మంది అరెస్టు తర్వాత ఈ సంస్థను మూసివేశారు.

అల్‌ దహ్రా ప్రపంచ స్థాయి సైనిక విమానాల విడి భాగాలను సరఫరా చేస్తుందని, రక్షణకు సంబంధించిన కీలక పరికరాల సేకరణ, సరఫరా తమ ప్రధాన వ్యాపారమని ఈ కంపెనీ వెబ్‌సైట్‌ వెల్లడిస్తోంది. ఖతార్‌ జలాంతర్గాముల కార్యక్రమానికి సంబంధించిన రహస్యాలను ఇజ్రాయెల్‌ కు చేరవేస్తూ, ఈ యూదు దేశం తరఫున గూఢచర్యానికి పాల్పడ్డారనే అభియోగంపై ఈ 8 మందిని కిందటేడాది ఆగస్టులో అరెస్టు చేశారు. అయితే, అప్పుడు వారిపై నమోదైన నేరాభియోగాలు ఏమిటో ఖతారీ అధికారులు వెల్లడించలేదు.

నిన్న ఈ కేసులో తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ఆ వివరాలు ప్రకటించలేదు. దౌత్యపరమైన వెసులుబాటుతో అక్టోబర్‌ ఒకటిన కస్టడీలో ఉన్న ఈ భారతీయులను ఖతార్‌ లోని భారత రాయబారి కలుసుకోవడానికి అనుమతించారు. తన కంపెనీలో పనిచేసే ఈ నిందితులను విడుదల చేయించడానికి అల్‌ దహ్రా గ్లోబల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఖతార్‌ రాజధాని దోహాకు ఆ మధ్య వెళ్లారు. అయితే, ఈ ఉన్నతాధికారి కూడా అవే ఆరోపణలపై రెండు నెలలు ఒంటరి నిర్బంధంలో (సాలిటరీ కన్ఫైన్‌మెంట్‌)లో గడిపాడు. తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు.

హైటెక్‌ ఇటాలియన్‌ సబ్‌ మరైన్ల దిగుమతిపై ఖతార్‌ కు సేవలందిస్తున్న అల్‌ దహ్రా

…………………………………………………………………………………………

రాడార్ల కంటికి కూడా చిక్కని హైటెక్‌ ఇటాలియన్‌ జలాంతర్గాములు సంపాదించే ఖతార్‌ కార్యక్రమం విషయంలో రక్షణ దళాలకు అల్‌ దహ్రా సలహాలు, ఇతర సేవలందిస్తోంది. మొత్తం 75 మంది భారతీయ ఉద్యోగులు పనిచేస్తున్న ఈ కంపెనీని 2023 మే నెలలో మూసివేశారని, ఈ భారత సిబ్బందిలో ఎక్కువ మంది భారత నేవీ మాజీ ఉద్యోగులేనని అల్‌ జజీరా టీవీ చానల్‌ తెలిపింది. ఈ మీడియా సంస్థ ఖతార్‌ ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తోంది.

అయితే, ఈ కంపెనీలో సిబ్బంది 120 మంది ఉండేవారనీ, వారిలో 90 శాతం భారత జాతీయులేనని మరో మీడియా సంస్థ తెలిపింది. 45–64 ఏళ్ల మధ్య వయసు ఉన్న భారత నేవీ మాజీ సిబ్బందిలో 8 మందిపై మాత్రమే గూఢచర్యం చేశారనే ఆరోపణలు రావడం ఆలోచించాల్సిన విషయమే. 2022 ఆగస్టులో అరెస్టు చేసిన ఈ భారతీయులను కొన్ని నెలల నిర్బంధం తర్వాత మాత్రమే ఖతార్‌ సర్కారు అసలు సంగతి వెల్లడించింది.

తమ జలాంతర్గాముల దిగుమతి కార్యక్రమం గురించి ఈ 8 మంది భారతీయులు ఇజ్రాయెల్‌ కు (గూఢచర్యం ద్వారా) రహస్యాలు చేరవేశారని ఖతార్‌ అధికారులు వివరించారు. ఏకాంత నిర్బంధంలో నెల రోజులు గడిపాక వారు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోగా స్థానిక కోర్టు నిరాకరించింది. భారత రాయబారి వారి విడుదలకు ప్రయత్నించినప్పుడు, నిందితులు ఇజ్రాయెల్‌ కు సైనిక రహస్యాలు చేరవేసిన కారణంగా వారిని వదిలేయడం కుదరదని ఖతార్‌ అధికారులు చెప్పారు. భారతీయుల నిర్బంధం వార్త వెల్లడయ్యాక వారి విడుదలకు భారత ప్రభుత్వం ప్రయత్నించాలని పార్లమెంటులో మనీష్‌ తివారీ (కాంగ్రెస్‌), అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌) సహా పలువురు సభ్యులు కోరారు.

మరణశిక్ష పడిన దోషుల్లో పాకాల సుగుణాకర్‌ ఉండడంతో తెలుగోళ్లలో ’ఆందోళన’

…………………………………………………………………………………………..

మరణశిక్ష పడిన భారతీయుల్లో విశాఖపట్నం కుటుంబానికి చెందిన సుగుణాకర్‌ పాకాల ప్రముఖుడు కావడంతో మొదటిసారి తెలుగువారిలో ఆందోళన కనిపిస్తోంది. 54 ఏళ్ల సుగుణాకర్‌ భారత నేవీలో పాతికేళ్లు గొప్ప సేవలందించారని ఆయన స్నేహితులు మీడియాకు చెప్పారు. సుగుణాకర్‌ నేవీ కమాండర్‌ గా నౌకాదళానికి చెందిన ‘ఐఎనెస్‌ తరంగణి’పై పయనిస్తూ భూమధ్య రేఖను రెండుసార్లు దాటివచ్చి అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఇంతటి గొప్ప నేపథ్యం ఉన్న మాజీ నౌకాదళాధికారికి మరణశిక్ష విధించడంతో ఆయన కుటుంబసభ్యులు, మిత్రులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

18 ఏళ్లకే ఇండియన్‌ నేవీలో చేరిన సుగుణాకర్‌ పాతికేళ్ల సర్వీసు తర్వాత 2013లో రిటైరయ్యారు. గూఢచర్యం కేసులో అరెస్టయ్యేనాటికి ఆయన అల్‌ దహ్రా గ్లోబల్‌ కంపెనీ డైరెక్టర్‌ గా పనిచేస్తున్నారని మీడియా వార్తలు సూచిస్తున్నాయి. సుగుణాకర్‌ పుట్టిన రోజు డిసెంబర్‌ 18 లోగా ఆయన విడుదలకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన బంధుమిత్రులు కోరుతున్నారు. విజయవంతంగా కొనసాగిన ఆయన సర్వీసులో భాగంగా ముంబై, అండమాన్‌ నికోబార్‌ దీవులు, విశాఖపట్నంలో సుగుణాకర్‌ పనిచేశారు. ‘సమాజ సేవలకు అంకితమైన’ ఈ నౌకాదళాధికారికి అనేక సందర్భాల్లో పురస్కారాలు లభించాయి. ఖతార్‌ న్యాయస్థానం తీర్పుతో విషాదంలో మునిగిన ఆయన భార్య, కూతురు, కొడుకును ఆయన స్నేహితులు, చుట్టాలు విశాఖపట్నంలోని వారి ఇంట్లో ఓదార్చుతున్నారు.

కోరుకొండ సైనిక్‌ స్కూల్లో, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రీయ విద్యాలయలో చదువు

……………………………………………………………………………………..

విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ కోరుకొండ సైనిక స్కూల్లో 1984 వరకూ చదివిన సుగుణాకర్‌ తర్వాత విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ కేంద్రీయ విద్యాలయలో పాఠశాల విద్య పూర్తిచేశారు. ఈ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్‌ గా సుగుణాకర్‌ తండ్రి పనిచేశారు. నేవల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ లో బీటెక్‌ (మెకానికల్‌), తమిళనాడు నీలగిరి కొండల ప్రాంతంలోని వెలింగ్టన్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ లో ఎమెస్సీ (డిఫెన్స్‌ అండ్‌ స్ట్రెటెజిక్‌ సర్వీసెస్‌) చదివారు.

‘సుగుణాకర్‌ అమాయకుడు. అతను నాకు చిన్నప్పటి నుంచీ తెలుసు. కేంద్రీయ విద్యాలయలో నా కొడుకు రఘుకు అతను క్లాస్‌ మేట్‌. జెంటిల్మన్‌ గా గుర్తింపుపొందిన సుగుణాకర్‌ ఎలాంటి సంఘ వ్యతిరేక, నేర కార్యకలాపాల్లో దిగే మనిషి కాదనే నమ్ముతున్నా,’ అని విశాఖవాసి ఏ.కృష్ణ బ్రహ్మం ఓ ఆంగ్ల దినపత్రికకు చెప్పారు. ఈ సుగుణాకర్‌ బంధువులు కొందరు తరచు విశాఖపట్నం పర్యటనకు వచ్చే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు గారి ద్వారా ఆయనను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కూడా వార్తలొస్తున్నాయి.

కమాండర్‌ పూర్ణేందు తివారీ కూడా పేరున్న భారతీయుడే!

………………………………………………………………

సుగుణాకర్‌ తోపాటు మరణశిక్ష పడిన కమాండర్‌ పూర్ణేందు తివారీ కూడా భారత నేవీలో పనిచేసినప్పుడు ఎన్నో పురస్కారాలు అందుకున్న సైనికుడేనని తెలుస్తోంది. అల్‌ దహ్రా గ్లోబల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గా పనిచేసిన తివారీకి నాలుగేళ్ల క్రితం ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్‌’ అవార్డు ఇచ్చింది భారత సర్కారు. భారత సైనిక దళాల్లో పనిచేసిన అనుభవం ఉన్న మాజీ సైనికుల్లో ఈ అవార్డు తొలుత లభించినది పూర్ణేందు తివారీకే.

దీర్ఘకాలం భారత సైనికదళాల్లో పనిచేసిన 8 మంది ఇండియన్‌ నేవీ మాజీ అధికారులకు భారత సంతతి జనం ఎక్కువ మంది పనిచేస్తున్న ఖతార్‌ లో గూఢచర్యం చేశారనే అభియోగంపై మరణశిక్ష పడడం అసాధారణ విషయమే. ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న దేశాల్లో ఒకటి ఖతార్‌. అలాంటి ధనిక దేశంలో కొందరు భారత జాతీయులు– కొన్ని అరబ్‌ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించే యూదు దేశం ఇజ్రాయెల్‌ కు సైనిక రహస్యాలు చేరవేశారనే కారణంపై ఏడాదికి పైగా నిర్బంధంలో ఉన్నాక స్థానిక కోర్టులో దోషులుగా తేలడం భారత ప్రజలకు ఆందోళన కలిగించే పరిణామం…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ధర్మస్థలపై ఏదో భారీ కుట్ర… ఆమె కూతురు ఓ అబద్ధం… ఓ కల్పిత కథ..!!
  • చివరకు పండుగల స్పెషల్ షోలలోనూ అవే రోత స్కిట్లా..?!
  • ఈ సీరీస్‌లో నిజం ఏదైనా ఉందీ అంటే… అది ఆ డిస్‌క్లెయిమర్ మాత్రమే…
  • కేటీయార్ వింత పొలిటికల్ ధోరణి..! రాను రాను ఓ సైద్ధాంతిక శూన్యత..!?
  • మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం… ఆహా… ఏవీ నాటి ఆర్ద్ర గీతాలు…?
  • ఎవరి పదవి ఊడబీకాలన్నా… ఏదో ఓ కేసులో అరెస్టు చేస్తే సరి ఇక..!!
  • అదే కథ, అదే పాత్ర… విజయచందర్ సూపర్ హిట్… నాగార్జున ఫ్లాప్…
  • కాళేశ్వరంపై బీఆర్ఎస్ క్యాంప్ ఆపసోపాలు… నానా విఫల సమర్థనలు…
  • కాంతారా బీజీఎం మోతల వెనుక ఈ ఆఫ్రికన్ గిరిజన వాయిద్యం..!
  • సింగరేణి మట్టి కూడా బంగారమే… అత్యంత విలువైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions