ఫుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటిరా… ఫైర్… అని కొత్త నిర్వచనం చెబుతాడు కదా బన్నీ… సేమ్, హీరోయిన్ అనగానే హీరో పక్కన దేభ్యం మొహం వేసుకుని నిలబడుతూ, పాటలు రాగానే పిచ్చిగెంతులు వేసే బొమ్మలు అనుకున్నారా… కాదు, కొందరు అంతకుమించి…! అబ్బే, మన తెలుగులో ఎవరూ లేరులెండి… తమిళంలో మాత్రం కనిపిస్తారు… (మలయాళంలో కూడా హీరోయిన్ల లెక్కలు, అడుగులు, నడకలు వేరు…)
సపోజ్… సూర్య-జ్యోతిక కొన్ని సినిమాలను నిర్మించారు… వాళ్ల టేస్టుకు అందరి చప్పట్లూ పడ్డాయి… సేమ్, నయనతార- విఘ్నేశ్ శివన్… సౌతిండియాలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ ఆమె… అదేదో సినిమాకు ఏకంగా 10 కోట్లు తీసుకుంటున్నదట… నో ప్రమోషన్స్, నో ప్రెస్‌మీట్స్, నో స్పెషల్ ఇంటర్వ్యూస్… సినిమా చేశామా, చేతులు దులిపేసుకున్నామా… అంతే, ఐతే ఆమెను మరో కోణంలోనూ చూడొచ్చు… దాని పేరు కూళామ్‌గళ్… పెబెల్స్… ‘ Koozhangal (Pebbles)… ఈ సినిమాను నిర్మించింది ఆమే…
కొత్త దర్శకుడు వినోద్‌రాజ్ కలలుగన్న సినిమా అది… తాగుబోతు తండ్రి, వదిలేసి వెళ్లిన తల్లి, ఓ కొడుకు… ఈ కథ యూనివర్శల్… కానీ కథను చెప్పిన తీరు మీద క్రిటిక్స్ నుంచి అప్లాజ్ పొందిన సినిమా… దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు… సినిమా అంటేనే దృశ్యప్రధానం… వినిపించాల్సిన మాటలకన్నా చూపించాల్సిన సీన్లే బలంగా పడాలి… క్రియేటివిటీ ఉండాలి… దర్శకుడు వినోద్‌రాజ్ టేకింగ్ ఆ స్పిరిట్‌తోనే కొత్తగా, క్రియేటివ్‌గా సాగింది… ఫార్ములా, మసాలా సినిమాలకు సమాంతరంగా తమిళ కొత్త దర్శకులు తమిళ సినిమాకు కొత్త క్రియేటివ్ రెక్కలు తొడుగుతున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా కొన్నాళ్లుగా..! కొంతమేరకు మలయాళ సినిమా కూడా..! ఆ పరంపరలోనే ఈ సినిమా…
Ads
ఓ మిత్రుడు వాట్సపులో పంపించిన విశ్లేషణ దిగువన ఉంది… అనిల్ బత్తుల రాసిన సోషల్ రివ్యూ… ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు అధికారిక ఎంట్రీగా వెళ్లింది… బోలెడు అభినందనలు, అవార్డులు… సరే, ఇది ఓసారి చదవండి…
కూళామ్‍గళ్(పెబల్స్) – తమిళ సినిమా పరిచయం
‘ Koozhangal (Pebbles)’ tamil movie
– అనిల్ బత్తుల
**
తమిళనాడులోని ఒక మారుమూల కుగ్రామం. సరైన నీటివసతి లేని ఊరు. చెలమల్లో నీరుని జాగ్రత్తగా ప్లాస్టిక్ బిందెలతో తెచ్చుకోవాల్సిన పరిస్థితి. వేలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడు. అతని బుజ్జి చెల్లెలు పేరు లక్ష్మి. అమ్మ శాంతి. తాగుబోతు నాన్న పేరు గణపతి. ఇతను బీడీలు తాగుతూ కచ్చా మందు కొట్టి భార్యని, కొడుకుని బూతులు తిడుతూ కొడుతుంటాడు. భార్య అలిగి పక్క గ్రామంలోని పుట్టింటికి వెళ్తుంది. భర్త, తన కొడుకుని తీసుకుని అత్త గారి ఇంటికి వెళతాడు. అక్కడ పెళ్లాన్ని బూతులు తిడతాడు.
బావమరిదికి ఇతనికి గొడవ జరుగుతుంది. మరి పిల్లాడు తండ్రి మీద రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు? గులకరాయి లాంటి పిల్లాడు కొండ లాంటి తాగుబోతు తండ్రిని ఎలా ఏడిపించాడు? పిల్లాడు నున్నటి గులకరాళ్ళను ఎందుకు సేకరిస్తాడు? అలిగెళ్లిన తల్లి తమ పెంకుటింటికి తిరిగొచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమా తప్పక చూడాల్సిందే. కూళామ్‍గళ్ అనే తమిళ పదానికి అర్థం గులకరాయి.
.
సినిమాలో అందరూ బాగా నటించారు. ఒక ఇరాన్ పిల్లల సినిమా చూసిన గొప్ప అనుభూతి కలుగుతుంది. కరువు ప్రాంతమైన ఆ ఊరిని, కొండల్ని, రస్టిక్ రూరల్ లైఫ్ ని చాలా బ్రిలియంట్ గా చూపించాడు. చాలా కాలం తర్వాత ఒక గొప్ప రియలిస్టిక్ సినిమా చూసిన అనుభవం కలిగింది.
పి.యస్.వినోద్ రాజ్ డైరెక్షన్ బాగుంది. సినిమా ప్రొడ్యూస్ చేసిన నయనతార , విగ్నేష్ శివన్ లకు అభినందనలు. అసలు ఇటువంటి కథను తెలుగు ప్రొడ్యూసర్లు వింటారా? అంత ధైర్యం చేస్తారా? అందుకు తమిళోళ్లను మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమా ఆస్కార్ కి ఇండియా నుండి అఫిషియల్ ఎంట్రీగా వెళ్లింది. చాలా ఇంటర్నేషనల్ అవార్డులు వచ్చాయి. Sony Liv OTT లో వుంది. తప్పక చూడండి…
Share this Article