Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చివరకు టీడీపీకి తెలంగాణలో మిగిలింది ఆ ట్రస్ట్ భవన్ ఒక్కటే..!

October 30, 2023 by M S R

తెలంగాణ లో జరిగే 2023 శాసన సభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు . రాజమండ్రి జైలులో ఉన్న బాబు ములాఖత్ లో తెలంగాణ టీడీపీ నాయకులకు ఈ విషయం చెప్పారు . ఆ పార్టీ ఉనికి తెలంగాణలో అంతంత మాత్రమే . పోటీ చేసినా చేయక పోయినా పెద్దగా ప్రభావం ఉండదు . ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రభావం ఎంతో టీడీపీ ప్రభావం అంతే ఉటుంది .

ఐతే నాలుగు సార్లు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఈసారి పోటీ చేయడం లేదు అంటే . తెలంగాణలో ఆ పార్టీ చరిత్ర ముగిసినట్టు . తెలంగాణలో 1999 ఎన్నికలే టీడీపీ గెలిచిన చివరి ఎన్నికలు . 24 ఏళ్ళ నుంచి తెలంగాణలో పెద్దగా ప్రభావం లేదు . ఐతే ఈసారి పోటీ చేయడం లేదు అంటే తెలంగాణలో టీడీపీ చరిత్ర అధికారికంగానే ముగిసినట్టు .

వారం క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు . ఆరు నెలల క్రితం ఖమ్మంలో టీడీపీ బహిరంగ సభ జరిగింది . పాత టీడీపీ వారంతా టీడీపీలోకి వచ్చేయండి అని బాబు పిలుపు ఇచ్చారు . ఈ పిలుపును అందుకొని ఎవరెవరు రాబోతున్నారో తెలుగు ఛానల్స్ వారం రోజుల పాటు చర్చలతో ఊదరగోట్టాయి . ఒక్కరూ రాలేదు . పైగా బాబైనా పార్టీ మారుతాడేమో కానీ ఈయన మారడు అని పేరున్న రావుల చంద్ర శేఖర్ రెడ్డి కూడా టీడీపీని వీడి వెళ్లారు .

Ads

తెలంగాణ జనంలో టీడీపీకి లేకపోవచ్చు కానీ మీడియా గుండెల్లో బాబు గూడు కట్టుకొని ఉన్నారు . ఎన్నికల్లో పోటీ చేయకపోయినా వచ్చే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని ప్రచారం చేసే దమ్మున్న మీడియా టీడీపీకి ఉంది . ఎన్నికల్లో పోటీ చేస్తేనే రాజకీయ పార్టీకి ఉనికి . పోటీకి దూరం కావడంతో అధికారికంగా తెలంగాణలో టీడీపీ శకం ముగిసినట్టే . పార్టీ పుట్టుక నుంచి ముగింపు వరకు పలు కీలక సంఘటనల్లో ప్రత్యక్ష సాక్షిని ..

*****

క్లిక్ మని ఫ్లాష్ వెలగగానే ఎన్టీఆర్ ఒక్కసారిగా ఆ ఫోటో గ్రాఫర్ వైపు కోపంగా చూశారు . మార్వాడి షాప్ లో కనిపించే పరుపు గద్దె మీద ఎన్టీఆర్ కూర్చొని ఉన్నారు . పక్కన నాదెండ్ల భాస్కర్ రావు ఉన్నారు . ఫోటో గురించి నాదెండ్ల ఏదో చెప్పేసరికి ఎన్టీఆర్ మామూలు అయ్యారు . ఇది 1982లో రామకృష్ణ స్టూడియోలో ఎన్టీఆర్ ను టీడీపీ నాయకుడి పాత్రలో తొలిసారి చూసిన సందర్భం . అప్పుడు నేను పదవ తరగతి చదువుతున్నాను . పదవ తరగతి పరీక్షలు రాస్తున్న కరీంనగర్ జిల్లాకు చెందిన మిత్రుడు భూపాల్ తీసుకువెళితే రామకృష్ణ స్టూడియోకు వెళ్ళాను .

కొత్తగా పెట్టిన టీడీపీలో జిల్లాల వారిగా నాయకులతో ఎన్టీఆర్ సమావేశం . ఆ రోజు కరీంనగర్ సమావేశం కావడంతో తనకు తెలిసినవారు టీడీపీలో చేరుతున్నారని , వారితో ఎన్టీఆర్ సమావేశం ఉంది వెళదాం అంటే స్టూడియోలోకి వెళ్ళాను . దాదాపు ఓ వందమంది ఉండవచ్చు . అంతకు ముందు దివిసీమ తుఫాన్ బాధితుల కోసం ఎన్టీఆర్ అక్కినేని బృందం విరాళాలు సేకరిస్తుంటే సికింద్రాబాద్ దర్గా వద్ద రేఖా ఎంపోరియంలోకి వెళ్లి విరాళాలు తీసుకుంటుంటే చూశాను . కానీ టీడీపీ ఏర్పడ్డాక ఎన్టీఆర్ ను 82లో రామకృష్ణ స్టూడియోలో చూశాను .

84లో లో ఎన్టీఆర్ కు నాదెండ్ల వెన్నుపోటు తరువాత రామకృష్ణ స్టూడియో వద్ద పిట్టగోడ ఎక్కి వెంకయ్య నాయుడు బీజేపీ కార్యకర్తలతో చేసిన ఉపన్యాసం , ఉద్యమం చూశాను . ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో టీడీపీ కన్నా బీజేపీ హడావుడి ఎక్కువ ఉండేది . ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో స్టూడియో వద్ద బీజేపీ నాయకులదే ఎక్కువ హడావుడి . ఆ సమయంలో నేను అక్కడ ఎందుకు ఉన్నానో గుర్తు లేదు కానీ.. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమమప్పుడు ఆ స్టూడియో వద్దనే ఉన్నాను .

చాలా మంది రోడ్డు మీద నిలబడి చూశారు . ఆ మరుసటి సంవత్సరం ఒక వైపు కాలేజీకి వెళుతూనే 1985 నుంచి ఉదయం స్థానిక విలేకరిగా టీడీపీని దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . విద్యార్థిగా , జర్నలిస్ట్ గా టీడీపీ  పుట్టుక నుంచి మహోజ్వలంగా వెలిగిపోవడం , ఆరిపోవడం వరకు అన్ని కీలక పరిణామాలను దగ్గరి నుంచి చూసే అవకాశం లభించింది . ఎన్టీఆర్ ను దించేసిన వైస్ రాయ్ ఎపిసోడ్ నుంచి తెలంగాణ ఏర్పాటుతో టీడీపీ నిర్వీర్యం కావడం వరకు ఆంధ్రభూమి నుంచి టీడీపీ రిపోర్టర్ గా అన్ని పరిణామాలను చూశాను .

***

ఎంఎల్ఏ క్వార్టర్ లో టీడీపీ పుట్టిన సందర్భంలో అక్కడ లేను కానీ అటు నుంచి రామకృష్ణ స్టూడియోలో సమావేశాలు ప్రారంభం నుంచి .. తెలంగాణలో పార్టీ శకం ముగియడం వరకు అన్నీ చూశాను . తెలంగాణ ఏర్పడినా 2014లో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి ఎన్నికలు జరిగాయి . ఒక ప్రాంతీయ పార్టీ ఒకే రాష్ట్రంలో ఉంటుంది . రెండు రాష్ట్రాల్లో ఉండదు . ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల విభజనను అంత త్వరగా జీర్ణం చేసుకోరు . ఆ ఎన్నికల్లో టీడీపీ పది స్థానాల్లో గెలిచింది .

ఓటుకు నోటు తెరాసకు వరంలా మారింది . 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ , టీడీపీ మహాకూటమి మీడియాతో కలిసి అధికారంలోకి వచ్చేస్తున్నారు అనే భావన కలిగించడంలో విజయం సాధించారు . మంత్రివర్గాలను కూడా ఏర్పాటు చేసేసుకున్నారు . ఫలితాల్లో బోల్తా కొట్టారు . ప్రచారంలో బాబు సింహభాగం ఆక్రమించారు . తీరా రెండు సీట్లకు పరిమితం అయ్యారు .

150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీకి ఒక్క టంటే కేవలం ఒక్క కార్పొరేటరే గెలిచారు . ఓటుకు నోటు కేసులు , పరాజయాలతో తెలంగాణ టీడీపీ నాయకులు తెరాస , కాంగ్రెస్ , బీజేపీ ఏదో ఒక పార్టీలో సర్దుకున్నారు . రిటైర్డ్ అయినవారి కాలక్షేపం క్లబ్ తరహాలో ఎన్టీఆర్ భవన్ కొద్దిమందికి పరిమితం అయిపొయింది .

*****

ఎందుకు పోటీ చేయడం లేదు …

రాజకీయ పక్షాలు నిజం చెప్పవు .. వారు చెప్పేది నిజం కాదు . ఎందుకు పోటీ చేయడం లేదు అనే దానిపైనా నిజం చెప్పడం లేదు .. అబద్దం చెప్పడం లేదు . మరో ఆరు నెలల్లో ఆంధ్రాలో ఎన్నికలు . టీడీపీకి అవి చావుబతుకుల పోరాటం . తెలంగాణలో అన్ని చోట్ల డిపాజిట్లు పోవడం ఖాయం .. డిపాజిట్లు పోతే ఆంధ్రలో ఆ ప్రభావం పడుతుంది .

బాబు జైలుకు వెళ్లిన తరువాత ఆంధ్రాలోకన్నా తెలంగాణలోనే నిరసన కార్యక్రమాలు ఎక్కువగా జరిగాయి . ఒక సామాజికవర్గం వారాంతపు ఆటవిడుపులా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మీడియా మాత్రం జనప్రవాహం అని చెబుతోంది . డిపాజిట్లు పోతే ఓస్ సానుభూతి ఇంతేనా ? అని ఆంధ్రాలో గాలి పోతుంది .

మరోవైపు ఈ సామాజికవర్గం ఓట్లు కాంగ్రెస్ వైపు మళ్లించాలి అని టీడీపీ అనుబంధ మీడియా ప్రయత్నాలు . టీడీపీ పోటీలో ఉంటే ఆ వర్గం అటు ఓటు వేయాలో ఇటు వేయాలో అని గందరగోళం . బిఆర్ఎస్ కన్నా రేవంత్ రెడ్డి అధికారంలో ఉంటే తానే అధికారంలో ఉన్నట్టు బాబు భావించడానికి అవకాశం ఉంటుంది . ఎలాగూ గెలిచే అవకాశం లేని ఒకటి రెండు శాతం ఓట్లతో పోటీ చేయడం కన్నా పోటీకి దూరంగా ఉండడం ప్రయోజనం అని టీడీపీ తెలంగాణలో తమ పార్టీకి మంగళం పాడింది . నిజానికి తెలంగాణ ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో మంగళం పాడారు . ఇప్పుడు టీడీపీ కూడా మంగళం పాడింది .

***

ఎన్టీఆర్ పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన గండిపేట కుటీరం , హిమాయత్ నగర్ లోని టీడీపీ కార్యాలయం ( ఎన్టీఆర్ ది , బాబుది తొలి పార్టీ కార్యాలయాలు హిమాయత్ నగర్ లో దగ్గర దగ్గరే ఉన్నాయి ) ఎన్టీఆర్ భవన్ ఇవన్నీ ఒకప్పటి జ్ఞాపకాలు . విశాలమైన , అత్యంత ఖరీదైన ఎన్టీఆర్ భవన్ అక్కడే ఉంటుంది కానీ తెలంగాణలో టీడీపీ రాజకీయాలు ఉండవు . తెలంగాణ ఉద్యమ కాలంలో టీడీపీ తెలంగాణ గడ్డ మీద పుట్టింది .. ఇక్కడే ఉంటుంది అని బాబు చెప్పేవారు . ఇక్కడ పుట్టినా ఇప్పుడు ఆంధ్రాకే పరిమితం .

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఎదురుగా విశాలమైన స్థలం కేటాయిస్తే .. బాబు దానిని ఎన్టీఆర్ భవన్ పేరుతో టీడీపీకి కేటాయించుకున్నారు . పేరుకు ఎన్టీఆర్ విధానాలపై అధ్యయనం , ప్రచారం కోసం ఈ భవన్ అని చెప్పినా పూర్తిగా టీడీపీ పార్టీ కోసమే ఆ భవన్ ఉండేది . తెలంగాణలో ఇప్పుడు పార్టీ లేదు . విశాలమైన ఎన్టీఆర్ భవన్ మాత్రమే మిగిలింది … – బుద్దా మురళి

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions