Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మా పెళ్లి పెటాకుల మహోత్సవానికి మీకిదే మా సాదర ‘ఆహ్వానం’…

November 1, 2023 by M S R

Grey divorce:  కలిసి ఉండడం కష్టమనుకున్నప్పుడు విడిపోవడమే మంచిదన్నది ఆధునిక నాగరికత. సర్దుకుపోవాల్సిన అవసరం లేదు. భరించాల్సిన పని లేదు. కూరిమిలో ఓరిమికి చోటు లేదు. వద్దంటే వద్దు- అంతే. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి– అన్నంత మాత్రాన మంత్రానికి కట్టుబడి ఉండాల్సిన పనిలేదు.

భారతదేశంలో మహానగరాల్లో అరవై నుండి డెబ్బయ్యేళ్ళ వయసులో విడాకులు తీసుకుంటున్న వృద్ధ దంపతుల సంఖ్య ఏటేటా క్రమంగా పెరుగుతోంది. ఈమధ్య బాంబేలో ఒక వృద్ధ దంపతుల విడాకులు పెద్ద వార్త అయ్యింది. ఆమె వయసు-70; ఆయన వయసు- 74. కోటీశ్వరులు. 45 ఏళ్ల సంసార జీవనంలో మనవళ్లు, మనవరాళ్లను కూడా చూశారు. ఎందుకో కొంతకాలంగా ఇద్దరికీ ముసలి చాదస్తాలు పెరిగాయి. ఒకరంటే ఒకరికి పడలేదు. మొదట విసుగుతో మొదలై చివరికి మాట్లాడుకోవడం మానేశారు.

వన్ ఫైన్ మార్నింగ్ భార్య విసా విసా భర్త దగ్గరికి వెళ్లి…ఈ మౌనం, ఈ దూరం, ఈ నో టాకింగ్ లో నాకో ఐడియా వచ్చింది. హాయిగా విడాకులు తీసుకుందాం. ఎవరి దారిలో వారు ఎలా కావాలంటే అలా బతుకుదాం…అంది. పండు ముసలి భర్త గుండెలో కోటి వీణలు కదలి మోగాయి. ఇలాంటి వార్తకోసమే ఇన్నేళ్లుగా వేచి ఉన్నట్లుగా ఎగిరి గంతేశాడు. పట్టరాని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. అదే ఊపులో ఇద్దరూ విడాకుల స్పెషలిస్ట్ లాయర్ దగ్గరికి వెళ్లారు.

Ads

పరస్పర అంగీకారంతో కోర్టు సాక్షిగా సుహృద్భావ వాతావరణంలో విడిపోయారు. భార్యకు కొంత ఎక్కువ ఆస్తి ఉండాలని భర్త ఉదారంగా వ్యవహరించాడు. భర్తకు బాంబేలో ఒక విల్లా (విలువ యాభై కోట్లు) పది కోట్ల నగదు డిపాజిట్ ఉండడం సముచితమని భార్య హృదయ వైశాల్యాన్ని చాటుకుంది. బోసినవ్వులతో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని గౌరవప్రదంగా విడిపోతుంటే…

ఒక పున్నమి చంద్రుడు అరేబియా అలలను ముద్దాడే రాత్రి వేళ ట్రైడెంట్ నక్షత్రాల హోటల్ శిఖరాగ్ర ఫ్లోర్లో మనవళ్లు అవ్వా-తాతల బ్రేకప్ పార్టీని న భూతో న భవిష్యతి అన్నట్లు అంగరంగ వైభవంగా ధూమ్ ధామ్ గా చేశారు. విడిపోతే ఇలా విడిపోవాలని పార్టీకి వచ్చిన వృద్ధ దంపతులు ఆ క్షణమే కంకణం కట్టుకున్నారట. ఈ వృద్ధ దంపతుల విడాకులకు ఇంగ్లీషులో ముద్దుగా “సిల్వర్ లైనింగ్ డైవోర్స్” అని పేరు కూడా పెట్టారు. అంటే “తల నెరిసిన వేళ విడాకులు” అని అర్థం!

ఈ లేటు వయసు విడాకులకు కారణాలను లాయర్లు, మానసిక శాస్త్రవేత్తలు లోతుగా విశ్లేషిస్తే తేలిన కొన్ని విషయాలివి:-
1 . విడాకులకు వయసుతో పనిలేదు.
2 . ఇన్ని దశాబ్దాలు భరించాం. పోయే ముందన్నా…చీకు చింతా లేకుండా పోదాం.
3 . ఎవరో ఏదో అనుకుంటారని భయపడాల్సిన పనిలేదు.
4 . ఆర్థిక స్వేచ్ఛ ఉంటే ఎప్పటినుండో చేయాలనుకున్న పనులు చచ్చేలోపు చేయవచ్చు.
5 . పిల్లల కోసం సర్దుకుపోయాం. ఇప్పుడు వారు ఎదిగి నిలబడ్డారు. మా దారి మేము చూసుకోవచ్చు.
6. చచ్చేలోపు భర్త తప్పును భార్య; భార్య తప్పును భర్త ఎత్తి చూపి దులిపి పారేయాలి.

నెమ్మదిగా మహానగరాల్లో మీకు ఇలాంటి ఆహ్వానాలు రావచ్చు!

గౌరవనీయ….గారికి,

ఫలానా రోజు
ఫలానా ఫంక్షన్ హాల్
ఫలానా టైమ్

మా ఎనభై ఏళ్ల తాత, మా డెబ్బయ్ అయిదేళ్ల నానమ్మ ముచ్చటగా విడిపోవడానికి దైవజ్ఞులు కాని లాయర్లు సంప్రదింపులు జరపగా…గౌరవనీయ న్యాయస్థానం ముహూర్తం ఖరారు చేసి ఆమోద ముద్ర వేసిందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. వారి అర్ధ శతాబ్దపు ఎడమొగం పెడమొగం వైమనస్యపు సంసారానికి ప్రతిరూపాలైన మేము వారి బ్రేకప్ పార్టీని అత్యంత వైభవోపేతంగా చేయదలిచాము. పాము- ముంగిసల్లా; ఉప్పు- నిప్పులా ఒకరినొకరు ఎలా చూసుకున్నారో ఈ పార్టీలో వారు చెప్పే మాటలను వినడానికి లౌడ్ స్పీకర్లు, ఎల్ ఈ డి స్క్రీన్లు ఏర్పాటు చేశాము.

మీరు సకుటుంబ సపరివారంగా విచ్చేసి..బ్రేకప్ పార్టీలో మదర్పిత చందన ఫల పుష్ప తాంబూలాదులను స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన.

ఇట్లు
ఫలానా పెద్ద మనిషి మనవళ్లు, మనవరాళ్లు.
బ్రేకప్ సంగీత విభావరి బై ఫలానా ఫేమస్ మ్యూజిక్ ట్రూప్
బ్రేకప్ నాట్యం బై ఫలానా కొరియోగ్రాఫర్
ఇతర దేశాల్లో ఉండి రాలేనివారి కోసం ఇది ఫలానా ప్రత్యక్ష ప్రసార యూ ట్యూబ్ లింక్….. – పమిడికాల్వ మధుసూదన్   9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions