చంద్రబాబుకు బెయిలొచ్చింది… టీడీపీ శ్రేణులు పండుగ చేసుకున్నాయి… నిజంగానే చంద్రబాబు ఊహించనంతగా తన కుటుంబసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, కొన్నిచోట్ల జనం, సానుభూతిపరులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు… ఇక ఏబీఎన్, టీావీ5, ఈటీవీ కూడా సంక్రాంతి జరుపుకున్నాయి… ఇవన్నీ సహజమే…
ఇన్నేళ్ల ప్రజాజీవితంలో ఎప్పుడూ కోర్టు మెట్లు ఎక్కనివాడు, జైలు గుమ్మం దాటనివాడు హఠాత్తుగా పలు కేసుల్లో ఇరుక్కుని, 50 రోజులకు పైగా రిమాండ్ ఖైదీగా ఉండాల్సి రావడం ఏపీ రాజకీయాల తీరును చూస్తే పెద్ద ఆశ్చర్యం అనిపించదు… ఏపీ కూడా ఈ విషయంలో తమిళనాడు బాట… జగన్ చంద్రబాబు మీద పెట్టింది అక్రమ కేసులు, అది అక్రమ అరెస్టు అని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయిస్తూ దీన్ని పొలిటికల్ ఫాయిదా కోసం ప్రయత్నించడమే కాదు, రాజకీయ కక్షసాధింపు అనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి తెలుగుదేశం శ్రేణులు గరిష్ఠ స్థాయిలో ప్రయత్నించాయి…
మరొోవైపు రిమాండ్‌కు ఆదేశించిన మహిళా న్యాయమూర్తి మీద చిల్లర ట్రోలింగ్ ఓ వెగటు ధోరణి… న్యాయవాది లూథ్రా గందరగోళం ట్వీట్లు, సూక్తులు అదొక ప్రహసనం… సరే, ఒకరకంగా న్యాయవ్యవస్థ మీద ప్రెజర్ బిల్డప్ చేయడానికి ప్రయత్నించినట్టుగా కూడా ఈ ఆందోళనల్ని భావించవచ్చు… జగన్ మీద కూడా పెట్టినవి పొలిటికల్ కేసులే అయినా ఎక్కడా తన అరెస్టుపై ఈ ఆందోళనలు కనిపించలేదు… కాకపోతే తన విడుదల సందర్భంగా హైదరాబాదులో భారీ ఊరేగింపు జరిగింది… హంగామా చేశారు జగన్ కార్యకర్తలు, సాక్షి కార్యకర్తలు…
Ads
సో, చంద్రబాబు విడుదల సందర్భంగా జరిగిన ఊరేగింపును తప్పుపట్టడం సాక్షికి నైతికంగా కరెక్టు కాదు… తనకు ఆ నైతికార్హత లేదు… కానీ సాక్షి కవరేజీ కూడా ‘అరెరె, బెయిల్ వచ్చిందే, ఐనా తగ్గేదే లే…’ అన్నట్టుగా సాగింది… ఫస్ట్ పేజీ సెకండ్ బ్యానరే మళ్లీ చంద్రబాబు మీద దాడి…
షరతులతో మధ్యంతర బెయిల్ అని ఓ బ్యానర్ కొట్టి, దాని పక్కనే ఇదెక్కడి రోగం అంటూ మరో స్టోరీ… ఆయనేమైనా స్వాతంత్ర్య సమరయోధుడా..? ముందే ప్లాన్ చేసి ఈ ఊరేగింపులు ఏమిటి..? అంటూ ఏదేదో రాస్తూ పోయింది… విద్వేషం మోతాదు ఎక్కువ అనిపించింది… (మరి జగన్ విషయంలో యెల్లో మీడియా చేసింది కరెక్టేనా అనేది వేరే చర్చ…) సరే, ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే చంద్రబాబు రిలీజ్‌ను పండుగ చేసుకున్నాయి… ఈనాడు అయితే మరీ అతి చేస్తూ జైలు నుంచి జనం గుండెల్లోకి అంటూ చంద్రబాబుది ఓ పేద్ద విజయంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించింది… కార్టూన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది…
ఎస్, కేవలం కంటి ఆపరేషన్ కోసమే మధ్యంతర, తాత్కాలిక బెయిల్… ఇది రెగ్యులర్ బెయిల్ కాదు… నెల ఆగి మళ్లీ సరెండర్ కావాలి, ప్రెస్ మీట్లు పెట్టొద్దు, ఇందులో కేసు గెలిచిందేమీ లేదు… ఏసీ, భద్రత వంటి ఎన్నో సాకులు చూపి, చివరకు కంటి ఆపరేషన్ పేరిట బెయిల్ తీసుకోవడం ఇది… నిజమైన రిలీజ్ కాదు, కానీ ఈ ఫస్ట్ పేజీ యాడ్ చూడండి…
బాస్ ఈజ్ బ్యాక్ అంటూ… సత్యమేవ జయతే అట… ధర్మోె రక్షతి రక్షితః అట… నిర్బంధంలోని నిజాయితీకి, చెరలోని ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ అట… ఏవేవో నాలుగు పడికట్టు పదాలు… ప్రస్తుతం సత్యం గెలిచింది ఎక్కడ..? తనేమైనా కేసు గెలిచాడా..? ఇందులో చంద్రబాబు రక్షించిన ధర్మం ఏమిటో… అఫ్‌కోర్స్, ప్రస్తుత రాజకీయాల్లో ఈ ధోరణులు కామన్ అనుకోవాలేమో… పైగా ప్రతి దానికీ జగన్‌తో పోలిక లేదా చంద్రబాబుతో పోలిక… ‘‘నువ్వు చేయలేదా..?’’ ఈ మాటతో అన్నీ సమర్థించేసుకునే విచిత్ర ధోరణులు…
చంద్రబాబు బయటికి రావాలని భువనేశ్వరి, బ్రాహ్మణి, లోకేష్ ఆరాటపడటం సహజమే కదా… వాళ్లు జనంలోకి వచ్చి మరీ ఆందోళనలకు నాయకత్వం వహించారు… ఇంట్లో సైలెంటుగా ఏడుస్తూ కూర్చోకుండా తమకు చేతనైన నిరసనను తాము ప్రకటించారు… దాన్ని తప్పుపట్టడం కరెక్టు కాదు… కానీ వైసీపీ శ్రేణులు దాన్ని కూడా విపరీతంగా ట్రోల్ చేశాయి… అదేమంటే తెలుగుదేశం వాళ్లు ఏమైనా శుద్ధపూసలా అంటారు… వాళ్లు చేశారు కాబట్టి వీళ్లు చేయడం కరెక్ట్ అవుతుందా..?
సో, చివరాఖరికి ఏమిటి..? తన రెగ్యులర్ బెయిల్ ఇంకా విచారణలోనే ఉంది… మరో రెండు కేసులు రెడీగా ఉన్నాయి… జగన్ ధోరణిని బట్టి తను చంద్రబాబును వదలడు… మళ్లీ చంద్రబాబు సరెండర్ అయిపోయి, మళ్లీ జైలుకు వెళ్తే సిట్యుయేషన్ వస్తే..? (రావొద్దనే ఆశిద్దాం)… అప్పుడు ఈ సత్యమేవ జయతే అనే నినాదాల మాటేమిటి..? అందుకే ‘అతి’ ప్రదర్శించవద్దు… కానీ ఏపీ రాజకీయాల్లో ఈ నీతిసూత్రాన్ని ఎవరూ పాటించరు… ఇది ఇంతే…
Share this Article