కాలాతీత స్ఫూర్తి సుభాష్ చంద్రబోస్…. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే మనకు అంతులేని అభిమానం. ప్రేమ. ఆరాధన. తాదాత్మ్యం. పులకింత. ఆయన గురించి తెలిసింది ఎంతో- తెలియనిది కూడా అంతే ఉంటుంది. తెలిసినదానితో తెలియనిది ఊహించినా, తెలియనిదాన్ని తెలిసినదానితో ముడిపెట్టుకున్నా ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ కు వచ్చిన లాభమూ లేదు- నష్టమూ లేదు.
మార్గాలు వేరు కావచ్చు. ఎంచుకున్న విధానాలు వేరు కావచ్చు. కానీ- నూట ఇరవై ఐదేళ్లయినా మనమింకా సుభాష్ చంద్రబోస్ కు విలువ కట్టడంలో తడబడుతూనే ఉన్నాం. ఆయన్ను కొలవడానికి మన దగ్గరున్న తూనికరాళ్లు సరిపోవని తెలిసినా తక్కెడ పట్టుకుని తయారవుతూనే ఉన్నాం.
బ్రిటీషు వారిని వ్యతిరేకించే జర్మనీ, జపాన్ వారితో ఆయన చేతులు కలిపాడని ఇప్పుడు మనం ఆయన్ను బోనులో నిలబెట్టి ప్రశ్నించాలనుకుంటున్నాం. మన శత్రువుకు శత్రువు ఎక్కడున్నాడో వెతుక్కుంటూ ఆయన నదులు, సముద్రాలు, కొండలు, దేశాలు, ఖండాలు దాటి ఎలా వెళ్లాడో? ఏ సన్యాసి వేషం వేసుకుని ఆఫ్ఘనిస్తాన్ దాటి యూరోప్ గడ్డమీద కాలుపెట్టాడో? బ్రిటీషు వారి డేగకన్నుకప్పి సముద్రం అడుగున జలాంతర్గాముల్లో ఎలా ప్రయాణించాడో? మనకనవసరం.
Ads
ఉవ్వెత్తున ఎగసిన స్వతంత్ర ఉద్యమ దావానలం పొంగు మీద నీళ్లు చల్లినట్లు అప్పుడప్పుడూ ఎందుకు ఆగిపోతూ ఉంటుందో అంతుబట్టని సుభాష్ ఆవేదనతో అడిగిన ప్రశ్నలకు చరిత్ర అప్పుడయినా, ఇప్పుడయినా జవాబు చెప్పుకోవాల్సిందే. Winner takes all- అన్నట్లు గెలిచినవారు చరిత్రనంతా తీసుకెళితే మౌనంగా చూస్తూ నిలుచోవడానికి అతను సామాన్యుడు కాదు.
సుభాష్ చంద్రబోస్. భారత స్వాతంత్ర్య చరిత్ర పుటల్లో ఆయన చరిత్రను ఆయనే సువర్ణాక్షరాలతో రాసుకున్నవాడు. ఆరని అగ్నిజ్వాలగా నిత్యం రగిలినవాడు. వచ్చిన స్వాతంత్య్రంలో ఆయనకు మనం వాటా ఇవ్వకపోయినా- మన అమాయకత్వాన్ని క్షమించినవాడు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వచ్చే ప్రతిసారీ సుభాష్ చంద్రబోస్ మళ్లీ చర్చలోకి వస్తున్నాడు. ఓట్ల వేటకు పనికివచ్చే అంశమవుతున్నాడు. ఆయన జాతీయత, ఆయన ఎంచుకున్న విధానాల మీద ఇప్పుడు మన కళ్లతో చూసి మార్కులు వేస్తున్నాం. అంతటి సుభాష్ ఇప్పుడు మనం పెట్టే పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన బెంగాలీ కావచ్చు, కానీ యావత్ భారతీయం సొంతం చేసుకున్న హీరో…
“నిప్పులు చిమ్ముకుంటూ
నింగికి నే నెగిరిపోతే,
నిబిడాశ్చర్యంతో వీరు-
నెత్తురు కక్కుకుంటూ
నేలకు నే రాలిపోతే
నిర్దాక్షిణ్యంగా వీరే…”
కృష్ణుడిగా పుట్టిన రాముడిని కీర్తిస్తూ- మన త్యాగరాజు “కాలాతీత విఖ్యాత!” అని గొప్ప మాటన్నాడు. అలా అప్పుడు- ఇప్పుడు- ఎప్పుడూ సుభాష్ చంద్రబోస్ కాలాతీత విఖ్యాతుడే. ఆయన్ను గౌరవించుకుంటే- ఒక భరత జాతిగా మనల్ను మనం గౌరవించుకున్నట్లు. ఆయన్ను అవమానిస్తే, అనుమానిస్తే- మనల్ను మనం అవమానించుకున్నట్లు, అనుమానించినట్లు…….. By… పమిడికాల్వ మధుసూదన్
Share this Article