దుబ్బాక అభ్యర్థి, బీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై పోలీసుల ప్రకటన ఆశ్యర్యపోయేలా చేసింది… వీళ్లు మనకు తెలిసిన తెలంగాణ పోలీసులేనా అనేది ఆ విస్మయం… అందరూ అని కాదు, కానీ చాలామంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఇతర ఉన్నతాధికార్లు అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతున్న కాలమిది… ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా సరే…
ఒకరిద్దరు కేసీయార్ కాళ్లను మొక్కుతున్న సీన్లు, ఒకాయన ఏకంగా పార్టీలో చేరి రిచ్చెస్ట్‌గా అవతరిస్తున్న సీన్లూ చూశాం, చూస్తున్నాం… అనేక సందర్భాల్లో నిజాల్ని దాచేసి, కేసీయార్ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తీరు పలుసార్లు వార్తల్లోకి వచ్చింది కూడా… అలాంటిది బీఆర్ఎస్ రాజకీయ రచ్చకు వ్యతిరేకంగా పోలీసులు చేసిన తాజా ప్రకటన అబ్బురమే…
అసలు కారణాలు ఏమున్నాయో తెలియదు గానీ స్థూలంగా జనానికి ఈ ప్రకటన కనెక్టయింది… నిందితుడు గటం రాజును అరెస్టు చేశారు, అయిపోయింది… తను కేవలం సెన్సేషన్ సృష్టించి అందరి దృష్టిలో పడాలనే భావనతోనే ఎంపీపై హత్యాయత్నం చేశాడని నిందితుడే వాంగ్మూలం ఇచ్చాడని సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత మీడియాకు వివరించింది…
Ads
యూట్యూబ్ చానెల్‌లో పనిచేస్తూ, మీడియా కార్డులు చూపిస్తూ ప్రజల నుంచి డబ్బు వసూలు చేసేవాడు, కానీ ఎవరూ ఫిర్యాదు చేయలేదు కాబట్టి కేసులు నమోదు కాలేదు… తనను ఎవరు ప్రోత్సహించారో దర్యాప్తు చేస్తారట కూడా…! ఎంచక్కా జనం నుంచి వసూళ్లు చేసుకుంటూ బతికే వ్యక్తి ఏకంగా ఓ ఎంపీపై కేవలం సంచలనం సృష్టించే భావనతో హత్యాయత్నం చేస్తాడా..? ఇది పెద్దగా నమ్మబుల్‌గా లేదు… అదెంత తీవ్ర నేరమో నిందితుడికి తెలియదని అనుకోలేం… మరెందుకలా చేసినట్టు..? ఏదో ఉంది… అదేమిటో బహుశా ఇప్పట్లో లేదా ఇక తేలకపోవచ్చు కూడా… ఎందుకంటే తెల్లారితో మరో సమస్య, మరో రచ్చ… జనం మరిచిపోతారు…
ఇక్కడ గమనించాల్సింది మరొకటుంది… హత్యాయత్నం జరిగిన వెంటనే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు అధినేతతో సహా తొందరపాటు వ్యాఖ్యలు ఎందుకు చేసినట్టు..? జస్ట్, రాజకీయంగా ఉపయోగించుకోవాలనే కదా… లండిదో మొండిదో మాకు కత్తి దొరకదా..? మాకు తిక్క రేగితే దుమ్ము రేగుతుంది అని కేసీయార్ ఏదో బహిరంగసభలో అన్నాడు… కేటీయార్ అయితే మరీ ముందుకెళ్లి ఇది కాంగ్రెసోళ్ల పనే అని ట్వీటాడు… అంతేకాదు, రేవంత్ వంటి థర్డ్ రేట్ క్రిమినల్‌ను పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయనీ ట్వీట్ పారేసుకున్నాడు… ఇది దూకుడు కాదు, దుందుడుకు…
ఒకవైపు పోలీసులు చెబుతున్న కారణాలు వేరు… మరోవైపు అధికార పార్టీ వాడుకోవాలని అనుకుంటున్న రాజకీయ ప్రయోజనాలు వేరు… ఎవరో దిగువ శ్రేణి కేడర్ ఏదో ఆరోపణలు చేస్తే ఏమో గానీ, ముఖ్యమంత్రి స్థాయి, కాబోయే ముఖ్యమంత్రి స్థాయి నాయకులు కూడా ఈ వ్యాఖ్యలు, ప్రకటనలు ఏమిటి..? మరి సిద్దిపేట సీపీ క్లారిటీ ఇచ్చింది కదా, ఇప్పుడేమంటారు సీఎం, కాబోయే సీఎం…
ఇది నెగెటివ్ అవుతుందేమోనని వెంటనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు స్పందించారు… తమకేం సంబంధం లేదని ప్రకటించారు… ఈలోపు వాటి సోషల్ మీడియా విభాగాలు బీఆర్ఎసే కావాలని ‘‘కోడికత్తి డ్రామా’’ ఆడుతుందనే ప్రచారానికి దిగారు… అంటే బీఆర్ఎస్ వాళ్లే చేయించుకున్నారు అనే అర్థమొచ్చేలా..? అదీ కరెక్టు ధోరణి కాదు… ప్రభాకర్‌రెడ్డి అలాంటి వ్యక్తి కాదు… ఈ హత్యాప్రయత్నం ప్రభావం ప్రధానంగా పడేది దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మీద… అందుకే తనూ వెంటనే ఖండించి, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు… ప్రభాకర్‌రెడ్డి ఇప్పటికిప్పుడు ప్రచారం చేసుకునే స్థితిలో లేడు కాబట్టి తన భార్యకు గానీ ఇంకెవరికైనా బీఫామ్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నట్టు ఓ వార్త… బహుశా అది జరగకపోవచ్చునేమో…!!
Share this Article