నిన్న తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఓ పోస్ట్ పెట్టింది… మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు మీద మాత్రమే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమ్మీద నాణ్యత పరీక్షలు జరగాలనీ, లేకపోతే మొత్తం ప్రాజెక్టే ప్రమాదకరంగా మారొచ్చుననీ, కానీ కేంద్రం అడుగుతున్న వివరాల్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదనీ ఆ పోస్ట్ సారాంశం… ఆ పోస్ట్ మరీ జనాన్ని ఎక్కువ భయపెట్టేదిగా ఉందని కొందరు అభిప్రాయపడ్డారు…
ఇప్పుడు కేసీయార్ తమ రహస్య స్నేహితుడు కాబట్టి బీజేపీ నేతలు పెద్దగా మేడిగడ్డ ఇష్యూ మీద పెద్దగా స్పందించడం లేదు… ఏదో మీడియాలో నామ్‌కేవాస్తే విమర్శలు… అభినవ విశ్వేశ్వరయ్య, నదికి కొత్త నడకలు నేర్పి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టు కట్టిన ఇంజినీర్ కేసీయార్ ఈరోజుకు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు… కేటీయార్ ఏదో ఓ మొక్కుబడి వివరణ ఎక్కడో ఇచ్చినట్టుంది, అదీ రిపేర్ల ఖర్చు కన్సర్న్‌డ్ కంపెనీయే భరిస్తుంది అని…
కానీ నాసిరకం నిర్మాణానికి, డిజైన్‌కు, పర్యవేక్షణకు బాధ్యులు ఎవరు..? శిక్షలు ఏమిటి…? దీనిపై తెలంగాణ సమాజంలో కూడా పెద్దగా చర్చ లేదు, మొత్తం మీడియా సైలెంట్… ఆమధ్య బీఆర్ఎస్ మీద నిప్పులురిమిన ఆంధ్రజ్యోతి కూడా కొన్నాళ్లుగా ‘‘చల్లబడింది’’… నిజానికి ఎన్నికలవేళ ఇలాంటి వైఫల్యాలు బాగా చర్చకు వస్తుంటాయి… కానీ కాలేశ్వరంపై అదేమీ లేదు… మొదట్లో కాంగ్రెస్ కూడా పెద్దగా పట్టించుకోలేదు… కానీ ఒక్కసారిగా రాహుల్ గాంధీ మేడిగడ్డను సందర్శించడంతో మళ్లీ అందరి దృష్టీ కాలేశ్వరం నిర్మాణ, డిజైన్ లోపాలపై పడుతోంది…
Ads
రాహుల్ వంటి నేతలు ఈ విషయానికి ప్రాధాన్యం ఇస్తే జాతీయ స్థాయిలో దృష్టి పడుతుంది… కాలేశ్వరం ప్రాజెక్టు కేసీయార్‌కు ఏటీఎంగా మారిందనీ, కేసీయార్ అంటేనే కాలేశ్వరం కరప్షన్ రావు అనీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు… కాకపోతే ఈ ఒక్క ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి అనేది ‘అతి’గా ఉంది… (పొలిటికల్ లిబర్టీ కావచ్చు..!!) ఇవే విమర్శలు గతంలో బీజేపీ చేసింది… కానీ తరువాత నోళ్లు మూతపడ్డయ్… బీజేపీ జాతీయ ముఖ్యులు ఎవరూ కాలేశ్వరం విమర్శల జోలికి పోవడం లేదు… ఈలోపు…
మరో బరాజ్ అన్నారంలో లీకేజీలు అనే వార్తలు, వీడియోలు వైరల్ అయిపోయాయి… పది బుంగలు పడ్డాయనీ, లీకేజీని ఆపేందుకు ఇంజనీర్లు ఇసుక బస్తాలు వేస్తున్నారనీ పత్రికలు వార్తలు వేశాయి… (ఎప్పటిలాగే నమస్తే తెలంగాణ ఇవన్నీ దిక్కుమాలిన ప్రచారాలు అని రాసుకుంది…) అబ్బే, అది లీకేజీ కాదు, జస్ట్ సీపేజీ మాత్రమే, ఏ బరాజ్‌కైనా ఇది కామనే అని ప్రాజెక్టు ఈఈ ఏదో వివరణ ఇచ్చాడు… మరో పత్రిక ఏదో సుందిళ్ల కూడా ఇలాగే అని రాసుకొచ్చింది… (దానికి ధ్రువీకరణ లేదు)…
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ సమంజసమే… కేంద్రం అడిగిన వివరాలన్నీ వెంటనే ఇవ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నట్టు..? ఇన్నాళ్లూ కప్పిపెట్టిన ఏవైనా నిజాలు బయటికొస్తాయనే భావనేనా..? తాజాగా అన్నారం ఇన్సిడెంట్‌తో మొత్తం ప్రాజెక్టు నాణ్యత, డిజైన్లపై కేంద్రం సమగ్ర దర్యాప్తు, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనేది తెలంగాణ సమాజం కోరిక… తాజాగా రాహుల్ గాంధీ మేడిగడ్డ సందర్శన ద్వారా బీఆర్ఎస్‌ను ఇరుకునపెట్టాడు… అందరి దృష్టీ మళ్లీ కాలేశ్వరంపై పడేలా చేశాడు… కాలేశ్వరంపై రాహుల్‌కు అవగాహన లేదంటున్న హరీష్ ఈ మేడిగడ్డ, అన్నారం సంఘటనలపై మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోయాడు… నిజానికి మాట్లాడాల్సింది తనే… కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణ తనదే కాబట్టి… కేసీయార్ కూడా రాజశ్యామల యాగాలు సరే, రాజధర్మం కూడా నిర్వర్తించాలి…!!
Share this Article