సత్యం రాజేష్ ఇంటర్వ్యూ… అదేనండీ, ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఒకటి కనిపించింది పొద్దున్నే… సినిమాలో ఓచోట నేను నగ్నంగా కనిపిస్తాను అంటాడు… నవ్వొచ్చింది… ప్రధాన పాత్రధారులు బరిబాతల నటిస్తే పెద్ద ఫాయిదా ఏమీ ఉండదోయ్… అప్పట్లో అల్లరి నరేష్ ఏదో సినిమాలో అలాగే కనిపించాడు… నయాపైసా ఫాయిదా రాలేదు సినిమాకు…
అంతెందుకు..? అమలాపాల్ కూడా ఏదో సినిమాలో చాలాసేపు నగ్నంగా కనిపిస్తుంది… ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు… కథలో ఆ సీన్ అత్యంత బలంగా డిమాండ్ చేస్తే, దాన్ని అంతే బలంగా ప్రొజెక్ట్ చేయగల డైరెక్టర్ ఉంటే ఆ నగ్నత్వానికి ఏమైనా ఇంపార్టెన్స్ వస్తుందేమో… సరే, దాన్నలా వదిలేస్తే ‘మా ఊరి పొలిమేర’ మొదటి పార్ట్ తీశారు… ఓటీటీ… అది బాగానే ఆదరణ పొందింది కదాని రెండో పార్ట్ తీశారు… ఇది థియేటర్లలోకి వచ్చింది…
సినిమా చివరలో ఇంకాస్త గుప్పిట అలాగే మూసి ఉంచి, గుడి మిస్టరీని మూడో పార్టు కోసం అట్టిపెట్టారు… ఏవో చేతబడులు, స్మశానాలు, తాంత్రికం, నిమ్మకాయలు, ముగ్గులు, క్షుద్రపూజలు ఎట్సెట్రా కథ… కాంచనలు, కాంతారాలు, చంద్రముఖులు, కార్తికేయలతో ఈ చేతబడుల కథలు మళ్లీ పాపులర్ అవుతున్నయ్… అఫ్‌కోర్స్ అన్నీ క్లిక్ అవ్వాలని ఏమీ లేదు… చంద్రముఖి డిజాస్టర్ దానికే సూచిక… ఎలాగూ మొత్తం కథ చెప్పుకోవడం లేదు కదా… అందుకే అసలు కథ జోలికే వెళ్లడం లేదిక్కడ…
Ads
సత్యం రాజేష్ నటనతో పాటు బాలాదిత్య వంటి మిగతావాళ్ల నటన పర్లేదు… గొప్పగా కూడా ఏమీలేదు… అంతగా జీవించే స్కోప్ కూడా ఆ పాత్రలకు లేదు… కథ, కథనం, ప్రజెంటేషన్ ఎట్సెట్రా సో అండ్ సో… కానీ చెప్పుకోవాల్సింది ఒక్కటుంది… ప్రధాన పాత్రల్లో నటించిన కామాక్షి భాస్కర్ల… ఆమె కల్పనా రాయ్, రంభలకు బంధువు అట… హైదరాబాదీ…
చైనాలో ఎంబీబీఎస్ చేసింది… కొన్నాళ్లు అపోలో హాస్పిటల్‌లో కూడా పనిచేసింది… తరువాత మోడల్… మిస్ తెలంగాణ 2018… అదే సంవత్సరం మిస్ ఇండియా పోటీలో ఫైనలిస్ట్…
లుక్ పరంగా వోకే… కానీ సరైన అవకాశాలు రాక ఏవేవో పిచ్చి పాత్రలు చేస్తూ వస్తోంది ఇన్నేళ్లూ… చెత్త పాత్రలు కూడా… రెండు వెబ్ సీరీస్ చేసింది… కానీ ఈ పొలిమేర సినిమాలో ఫుల్ లెంత్ పాత్ర దొరికింది… సద్వినియోగం చేసుకుంది… సరిగ్గా మంచి పాత్ర పడాలే గానీ ఇంకా రాణిస్తుంది… సినిమా అంటే ప్యాషన్… నిజంగానే ఆమె డాక్టర్… ఇప్పుడు యాక్టర్… త్వరలో డైరెక్టర్ అవుతాను అంటోంది కాన్ఫిడెంటుగా…
మొన్నామధ్య బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య కూడా తనకు దక్కిన పాత్రను బాగా చేసింది… ఆమెకు ఇక కొన్నాళ్లు తిరుగు లేదు… సో, తెలుగువాళ్లకు ఏం తక్కువ..? మంచి ఆఫర్లు, మంచి పాత్రలు లభించాలే గానీ ఎందుకు నిరూపించుకోరు..? డాక్టర్ కామాక్షి భాస్కర్ల కూడా అంతే… కాకపోతే మన నిర్మాతలకు తెల్లతోలు పైత్యం ఎక్కువ కదా… అది తొలగిపోయిననాడు వైష్ణవిలు వస్తారు, కామక్షిలు వస్తారు…
చిన్నదే, చివరగా మరొకటి… జబర్దస్త్ అనగానే గుర్తొచ్చేవాళ్లు ప్రధానంగా హైపర్ ఆది, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్… ఇంకా చాలామంది కమెడియన్లు బాగానే చేస్తున్నా ఈ నలుగురు బాగా పాపులరయ్యారు… ఒక దశలో ఆది, సుధీర్ స్కిట్లు మిలియన్ల వ్యూస్‌తో పోటీలు పడ్డాయి… సుధీర్ హీరో అయిపోయాడు… గెటప్ శ్రీను ఈరోజు విడుదలైన కీడాకోలా, పొలిమేర సినిమాల్లో మంచి పాత్రలే చేశాడు, ఇంకా సినిమాలు ఉన్నయ్, అసలు టీవీల్లోకి తిరిగి వచ్చే సీన్ కనిపించడం లేదు… ఆమధ్య ఏదో చిరంజీవి సినిమాలోనూ బాగానే చేశాడు…
హైపర్ ఆది కూడా ఏవేవో కొన్ని పాత్రలు చేసినా తను పెద్దగా క్లిక్ కాలేదు.,. చివరకు అదే ఢీ, అదే శ్రీదేవి డ్రామా కంపెనీ… ఆటో రాంప్రసాద్ కూడా కేవలం టీవీ షోలకే పరిమితం… మంచి పాత్రలు లభిస్తే గెటప్ శ్రీను కమెడియన్‌గా, కేరక్టర్ ఆర్టిస్టుగా ఇంకా రాణించగలడు… సుడిగాలి సుధీర్ అంటారా..? అది వేరే కథ…!!
Share this Article