Paresh Turlapati….. ఎంట్రీలో హీరోలకు భారీ ఎలివేషన్ ఇవ్వటం సినిమాల్లో అనాదిగా వస్తున్న ఆచారమే !
గతంలో ఎన్టీఆర్.. కృష్ణ లాంటి హీరోల ఎంట్రీ కెమెరా యాంగిల్ ముందు కాలి బూటుతో మొదలై తలకు చేరేది !
అభిమాన హీరో ముఖం కనిపించగానే హాలంతా కెవ్వు కేకలు !
ఈమధ్యలో వెనక మైదాన సంగీతం (అదేలేండి ఇప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) అంటున్నారుగా ) అదరగొట్టేది !
ఆ రోజుల్లో దాదాపు చాలామంది హీరోల ముఖ దర్శనం పాదాలతోనే మొదలయ్యేది !
ముందు పాదపూజ అయితేగానీ సర్వ దర్శనం అయ్యేది కాదు !
సరే ఇప్పుడు తరం మారింది కదా
పద్ధతులు కూడా మారాయి !
ఓ వందమందినో
వెయ్యిమందినో రౌడీలను
హీరో ఆర్టీసీ బస్సు వేసుకునో
లారీ వేసుకునో
పైనుంచి హెలికాఫ్టర్ మీన్నుంచి దూకో
వెండితెరపై ఎంట్రీ ఇస్తాడు !
ముందు మనకి హీరో కనిపించడు !
ఉన్నపళంగా రౌడీలు వన్ బై వన్ గాల్లోకి లేస్తూ కింద పడిపోతారు !
ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు !
అసలు తమ రౌడీలు ఊరికే అలా గాల్లోకి ఎందుకు లేస్తున్నారో అర్థం కాక సహచర రౌడీలు ఎర్ర(ర్రి) ముఖం వేసుకుని గాల్లోకే చూస్తుంటారు !
రౌడీల చేతిలో ఉన్న చైనా మేడు
రష్యా మేడు
ఆయుధాలు కూడా చేష్టలుడిగి గాల్లోకి చూస్తుంటాయ్ !
ఆయుధాలైతే ఎక్కడెక్కడినుంచో ఏరుకుని తెచ్చుకున్నారు కానీ ట్రిగ్గర్ నొక్కటం ఒక్క రౌడీ కొడుక్కి తెలీదు !
సరిగ్గా ఇప్పుడు హీరో గాల్లోనుంచి ఊడి పడతాడు !
ఆ పడే టైములో ఓ ఇరవై డ్రమ్ముల మీద విపరీతంగా బాదేస్తాడు మ్యూజిక్ డైరెక్టర్ (బీజీఎం…బీజీఎం) !
గుండు సూదితో హీరో లైనుగా ఒక్కొక్కడిని గుచ్చుకుంటూ వెళ్ళిపోతాడు !
ఒక డ్యాముకి సరిపడా బ్లడ్డు అక్కడ కాలవై పారుతుంది !
ఇప్పుడు మనకి హీరో ముఖం కనిపిస్తుంది !
అప్పటిదాకా అసలు తమవాళ్ళు అలా గాల్లోకి ఎందుకు లేస్తున్నారో అర్థం కాక బిక్క ముఖం వేసుకున్న రౌడీలతో పాటు మనం కూడా అమ్మయ్య ఇది హీరోగారి పని అని ఎయిర్ పీల్చుకుంటాం !
ఇప్పుడు హీరో గారి పంచ్ డైలాగ్ ఒకటుంటుంది !
రేయ్ చీమ కుడితే చిమచిమలాడుతోంది
దోమ కుడితే రిమరిమలాడుతోంది
నేను కొడితే హోలు బాడీయే పటపటలాడిపోతుంది !
ఇంకేవుంది
చప్పట్లే చప్పట్లు !
నిన్ననే ఓటీటీ లో బోయపాటి వారి స్కంద అనబడే ఓ కళాఖండం చూసా !
అబ్బాబ్బా హీరోకి ఏమి ఎలివేషను..ఏమి ఎలివేషను !
హీరోగారు ఏకంగా స్టెన్ గన్ లతో ఫుల్ సెక్యూరిటీ ఉన్న సీఎం ఇంటికే వెళ్లి చిన్న ఉల్లిపాయ కత్తితో డీజీపీని.. ఎస్పీని బెదిరిస్తూ ( మధ్యలో అడ్డొచ్చాడని ఎస్పీ ని గుచ్చుతాడు కూడా ) సీఎం కూతురిని హెలికాఫ్టర్ లో లేపుకుపోతాడు !
సీఎం ఇంటికి ఓ ఉల్లిపాయ కత్తితో వెళ్లి దర్జాగా ఎవర్నైనా లేపుకురావొచ్చనే కొత్త సంగతి నాకు తెలిసింది !
ఆ మధ్య కేజీఎఫ్ లో కూడా హీరో గారు చిన్న వాన్ వేసుకుని పోలీస్ క్యాంప్ బయట నిదానంగా మెషిన్ గన్ మోపు చేసుకుని దీపావళి టపాసులు కాల్చినట్టు ఓ పావుగంట పేల్చి కాల్చి కాలిన ఆ గొట్టంతోనే సిగరెట్ వెలిగించుకుంటాడు !
ఇది హీరోయిజానికి పరాకాష్ట
ప్రేక్షకుడి సహనానికి’ ఫైర్ ఎగ్ఝామ్ !’
హీరో గారు హీరోయిజం చూపించటంలో తప్పులేదు
అయితే ఆ హీరోయిజం మోతాదు మించితే లిక్కర్ లెక్కన అవుతుంది !
బలహీన ప్రేక్షకుడికి మత్తెక్కువైపోయి చిత్తయిపోతాడు !
తట్టుకోలేడు
సరే ,
ఇవన్నీ దేనికి సూచిక
దర్శకుల పైత్యానికా
మారుతున్న ట్రెండుకా
లేకపోతే జనం అవే కోరుకుంటున్నారా ?…… పరేష్ తుర్లపాటి
Share this Article