నిజమే… అందరిలోనూ ఈ సందేహం అయితే ఉంది… ఎందుకింత ఆగమేఘాల మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం మేడిగడ్డ కుంగుబాటు మీద రిపోర్ట్ ఇచ్చింది..? మరీ నమస్తే రాసినట్టు… నదిలోకి దిగారా, పునాదులు చూశారా అని అడగలేం కానీ… ఏమిటింత వేగం అనే సందేహం మాత్రం కలుగుతోంది… ఎందుకంటే నేపథ్యం డిఫరెంట్ కాబట్టి…
20 రిపోర్టులు అడిగితే 12 మాత్రమే ఇచ్చారు అని ఇప్పుడు చెబుతోంది సదరు టీం… మరి ఇన్నేళ్లూ ఏం చేశారు..? అసలు డిజైన్లు పరిశీలించారా..? నాణ్యత పర్యవేక్షించారా..? లాభదాయకత లెక్కలేశారా..? నిధుల ఖర్చు మీద కన్నేశారా..? ఏమీలేదు… లక్షన్నర కోట్ల ప్రజాధనం ఖర్చు మీద అసలు కేంద్రానికి ఏ బాధ్యత లేదా..? అంతా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమేనా..?
కావల్సినన్ని రుణాలు కూడా కేంద్ర సంస్థలే ఇచ్చినట్టున్నాయి కదా… పర్యావరణ అనుమతులు కూడా ఇచ్చింది కేంద్రమే కదా… ఇప్పుడు తూచ్, మాకేమీ తెలియదు అనడం కుదురుతుందా..? ఇక పొలిటికల్ సైడ్ వెళ్దాం… అప్పట్లో కేంద్ర పెద్దలు కాలేశ్వరం కేసీయార్ ఏటీఎం అన్నారు… బండి సంజయ్ వంటి నేతలైతే కేసీయార్ జైలుపాలే అన్నారు… ఏమైంది..? ఆ బండి నొగలు విరిగినయ్… మళ్లీ ఏటీఎం మాట అనలేదు… పైగా కేసీయార్ ఏవేవో కేసులు పెట్టి బజారుకు ఈడ్చడానికి ప్రయత్నించాడు కేంద్ర పెద్దలను…
Ads
ముఖ్యమంత్రులకు, పార్టీలకు, కోర్టులకు వీడియోలు, కాగితాలు, ఆడియోలు పంపించి బద్దిబదనాం చేశాడు… కౌంటర్ కరువైంది బీజేపీలో… డిఫెన్స్… చివరకు ఇప్పుడు కేసీయార్ కోసం పార్టీయే సంస్థాగతంగా మార్పులు చేసుకుంటూ, రాజీపడుతూ గుప్తస్నేహానికి దిగింది… అందుకేగా, పార్టీ నుంచి అందరూ వలసబాట పట్టింది… ఆ సోయి కూడా లేదు తెలంగాణ బీజేపీకి, కాదు, కాదు, తెలంగాణపై బీజేపీకి…
ఈ స్థితిలో బీజేపీ హైకమాండ్ ఏం చేయదలుచుకుంది..? ఇంత వేగంగా, యమర్జెంటుగా ఆ ప్రాజెక్టే వేస్ట్, మళ్లీ కట్టాల్సిందే అని రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది..? అదీ అంతే వేగంగా పబ్లిక్ డొమయిన్‌లోకి తీసుకొచ్చింది తెలుగు అనువాదాలతో సహా… ఒకవైపు కేసీయార్‌తో దోస్తీ (కాంగ్రెస్ రాకుండా చూసేందుకు కావచ్చు, రేప్పొద్దున కేంద్రంలో కేసీయార్ అవసరమని భావన కావచ్చు, ఇంకేదైనా కావచ్చు…) కనిపించకుండా కంటిన్యూ చేస్తూనే ఈ నెగెటివ్ రిపోర్టులు దేనికి..?
ఎందుకు నెగెటివ్ రిపోర్టు అనేది కాదు ఇక్కడ ప్రశ్న… బీజేపీ ఉద్దేశం ఏమిటనేదే ప్రశ్న… ఓ ఢిల్లీ మిత్రుడు అంటాడూ… చూస్తూ ఉండండి సార్, బీజేపీ స్టాండ్ మారుతోంది, వారం పది రోజుల్లో కేసీయార్ పట్ల స్పష్టమైన నెగెటివ్ ధోరణి తీసుకుంటుంది అని…! పోలింగ్‌కు మరో 24 రోజులే సమయం… ఈ స్వల్ప వ్యవధిలో బీజేపీ సాధించేదేమిటి..? మళ్లీ ఆ పాత జోష్ వచ్చేదేముంది..? పుణ్యకాలం అయిపోయింది… బీజేపీ ఆలోచనవిధానం ఏమిటో ఆ పార్టీ వాళ్లకే అర్థం కావడం లేదు… భలేవారే, ఇందులో రాజకీయ కోణం ఏముంది..? సదరు నిపుణుల టీం తన పని చేసింది అంటారా..? ఇలాంటి విషయాల్లో అధికంగా పనిచేసేది రాజకీయాలే…!!
Share this Article