ఏ అనే వ్యక్తికి బీ మిత్రుడు… బీ అనే వ్యక్తికి సీ మిత్రుడు… సో… ఏ అనే వ్యక్తికి సీ అనే వ్యక్తి ఏమవుతాడు..? సింపుల్… మిత్రుడే అవుతాడు… ఇది మైనస్ ఇన్‌టూ మైనస్ ఈక్వల్ టు ప్లస్ అనే సమీకరణం కాదు కదా… తెలుగులో చెప్పాలంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అనే సూత్రం కూడా కాదు… ఇక మన రాజకీయాల్లోకి వద్దాం…
తన తిక్క చేష్టలు, ఎడ్డి మాటలతో చికాకు పుట్టిస్తాడు అంబటి రాంబాబు ఒక ట్వీట్ మాత్రం భలే పెట్టాడు… (దిగువన చూడండి ఆ ఫోటో)… అక్కడలా, ఇక్కడిలా అనేది దానికి శీర్షిక… అంటే ఏపీలో టీడీపీతో జనసేన దోస్తీ… తెలంగాణలో బీజేపీతో జనసేన దోస్తీ… అంటే బీజేపీ, టీడీపీ కూడా దోస్తులే కదా… లెక్క ప్రకారం అంతే… కానీ..?
ఏపీలో టీడీపీతో నా పొత్తు అనేస్తాడు పవన్ కల్యాణ్… మరి టీడీపీ ఎన్‌డీఏలో లేదు కదా అని ఎవరూ అడగరు… అడగొద్దు… అడిగితే ఎవడూ జవాబు చెప్పరు కూడా..! సరే, ఏపీలో టీడీపీతో పొత్తు సరే అనుకుందాం… టీడీపీకి కూడా అవసరమే అనుకుందాం… జనసేనతో పొత్తుకు సై అంటారనే అనుకుందాం… సీట్లు కూడా కొన్ని ఇస్తారనీ అనుకుందాం… ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవకపోయినా, తనే రెండు సీట్లలో ఓడిపోయినా సరే పవన్ కల్యాణ్ రాజకీయమే అది కదా…
Ads
అదృష్టమంటే అదే… జగన్ దెబ్బకు చంద్రబాబు డీలాపడిపోయి, పవన్ కల్యాణ్ సాయం కావాలని, ఎంతో కొంత వోట్ల శాతం పెరుగుతుందని ఆశపడుతోంది… ఆయనేమీ బజారులోకి వచ్చి చంద్రబాబు అరెస్టుల మీద పెద్దగా ఉద్యమించిందీ లేదు, కన్సిస్టెన్సీ కూడా లేదు… తను అధికారికంగా ఎన్‌డీఏలో భాగస్వామి… కానీ టీడీపీ దోస్త్‌ను అంటాడు… బీజేపీ హైకమాండ్ ఎడ్డిమొహం వేసుకుని చూస్తూ ఉంటుంది… ఏపీలో తనకు ఎలాగూ బలం లేదు, ఇప్పట్లో అది ఎదిగే సీనూ లేదు…
ఇప్పటికైతే జగన్ కావాలి… కానీ అదే సమయంలో ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి మాత్రం జగన్ మీద నిప్పులు చెరుగుతూ ఉంటుంది… జైలులోకి పంపించాల్సిందే అంటుంది… హేమిటో ఏపీలో బీజేపీ రాజకీయానికి ఓ దశ లేదు, ఓ దశ లేదు… తెలంగాణలో మరీ ఘోరం… బీజేపీ అభిమానులే చీదరించుకునే దురవస్థ…
తెలంగాణ ఏర్పడితే 11 రోజులు నిద్రాహారాలు లేని, తెలంగాణ బద్ద వ్యతిరేకి పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి మిత్రుడు… టీడీపీ వద్దు, కానీ టీడీపీ జాన్ జిగ్రీ దోస్త్ పవన్ కల్యాణ్ కావాలట… పది సీట్లు ఇస్తారట… సరే, గాలికి పోయే పేలపిండి వంటి సీట్లు ఇస్తారేమో… ఐనా సరే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పవన్ మద్దతు బాగా ఉపయోగపడిందనే ఓ ఫేక్ సూత్రీకరణ చేసేసి పవన్ కల్యాణ్ ఎదుట సాగిలపడిపోయారు కిషన్ రెడ్డి, లక్ష్మణ్…
ఒకవైపు టీడీపీ సెటిలర్ల వోట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లుతున్న (కారణాలు బోలెడు) దశలో పవన్ కల్యాణ్ వల్ల బీజేపీకి ఒరిగేది ఏమిటి..? మరి పవన్, చంద్రబాబు దోస్తులు అయినప్పుడు టీడీపీ, బీజేపీ కూడా దోస్తులు కావాలి కదా… కాదు… టీడీపీ పోటీ నుంచే విరమించుకుంది… తెలంగాణలో ఈరోజుకూ ఎంతోకొంత వోట్ల శాతం ఉన్న టీడీపీ పోటీకి దూరం అట… ఏమీ లేని పవన్ కల్యాణ్ ఏమో పది సీట్లలో పోటీచేస్తాడట… ఇదీ బీజేపీ రాజకీయం… దిక్కుమాలిన రాజకీయం… ఎవరెన్ని సూత్రీకరణలతో సమర్థించుకోజూసినా సరే, సగటు తెలంగాణ బీజేపీ అభిమానికే జీర్ణం కాని ఎత్తుగడ… ఇలాంటి ఎడ్డి వ్యూహాలతో తెలంగాణ బీజేపీని మరింత దిగజార్చి, అంతిమంగా కేసీయార్‌కు సాయం చేసే మతిమాలిన వ్యూహాలు… కేసీయార్‌ను నమ్మి చాలామంది భంగపడ్డారు… తెలంగాణ బీజేపీ ఎంత..?!
Share this Article