రాష్ట్రవ్యాప్తంగా ఒక భావన ప్రబలిపోయింది… బీజేపీ, బీఆర్ఎస్ రహస్య స్నేహితులు అని..! జనం దాన్నే విశ్వసిస్తున్నారు… బండి సంజయ్ మార్పు దగ్గర నుంచి కవిత సేఫ్ వరకు… రకరకాల అంశాల్ని క్రోడీకరించుకుంటున్నారు… దాన్ని ఎలా కౌంటర్ చేయాలో తెలియడం లేదు బీజేపీకి… బీఆర్ఎస్‌కు కూడా… బీజేపీ-బీఆర్ఎస్ సేమ్ అనే ప్రచారం స్ట్రెయిట్‌గా కాంగ్రెస్ జోష్ పెరగడానికి కొంత కారణమవుతోంది…
మరేం చేయుట..? దాన్ని ఎలాగోలా బ్రేక్ చేయాలి..? అలాగని అబ్బే, బీఆర్ఎస్‌తో మాకేమీ దోస్తానా లేదు, మీ అందరి మీద ఒట్టు, నమ్మండి ప్లీజ్ అని చెప్పలేదు కదా… సో, దాన్ని కూడా కాంగ్రెస్ మీదకే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది బీజేపీ… కిషన్‌రెడ్డి మాట్లాడినా, ఎల్బీ స్టేడియం సభలో మోడీ మాట్లాడినా… బీఆర్ఎస్, కాంగ్రెస్ సేమ్ అని చెప్పడానికి ప్రయత్నించారు… రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటే, కాంగ్రెస్ వాళ్లు గెలిచినా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లిపోతారు, గతంలో జరిగింది అదే కదాని కిషన్‌రెడ్డి చెప్పగా…
అవినీతి, కుటుంబపాలన వంటి విషయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని మోడీ చెప్పుకొచ్చాడు… కానీ పెద్దగా బీఆర్ఎస్ అవినీతిని స్ట్రెస్ చేయలేదు… ఎక్కువగా బీసీ ముఖ్యమంత్రి అనే పాయింట్‌నే బలంగా చెప్పడానికి ప్రయత్నించాడు… అదీ ఒక తెలంగాణ రెడ్డిని, ఒక ఓసీ ఆంధ్రా కాపును ఇరువైపులా కూర్చోెబెట్టుకుని…!!
Ads
కేవలం రేషన్‌ను మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్టు మాత్రం బలంగా చెప్పిన మోడీ మిగతా బీజేపీ పథకాలను ప్రభావవంతంగా చెప్పలేకపోయాడు… ఆ రేషన్ కూడా కేసీయార్ ఇస్తున్నట్టే ప్రజలు భావిస్తారు తప్ప మోడీ ఇస్తున్నాడని ప్రజల బుర్రలకు ఎక్కదు… సరే, కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు సరే… ఇదెలా ఉందంటే…
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందూ వోటు బలంగా కన్సాల్డేట్ అవుతున్న తీరు గమనించి… జాన్ జిగ్రీ దోస్తులుగా ఉన్న మజ్లిస్, టీఆర్ఎస్ (అప్పుడు అదే) మేం పోటీదారులం, ఎన్నికల దోస్తులం కాము అని చెప్పడానికి విశ్వప్రయత్నాలు చేశాయి… ఎన్నికలైన మరుసటి రోజు మళ్లీ కేసీయార్, ఒవైసీ ఆప్యాయంగా, ఆత్మీయంగా, అనురాగంతో హత్తుకుపోయారు… అంటే జనం కళ్లకు గంతలు కట్టే ప్రహసనాలు…
ఇప్పుడూ అంతే… మేం, బీఆర్ఎస్ ఒక్కటి కాదు అని చెప్పడానికి… బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటి అనే పాట అందుకున్నారు… కాంగ్రెస్ మాత్రం తనకు బాగా ఉపయోగపడుతోంది కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే పాటను ఎత్తుకుంది… మరి బీఆర్ఎస్ ఏం చేస్తోంది..? తన వాదనలో పంచ్ లేకపోయినా సరే… కాంగ్రెస్, బీజేపీ సేమ్ అంటోంది… అసలు ఎవరైనా నమ్ముతారా దాన్ని..? అదేమంటే రెండూ జాతీయ పార్టీలు, అవేమీ ఉద్దరించవు… ప్రాంతీయ పార్టీలే దిక్కు అంటోంది…
మరి ప్రాంతీయ పార్టీలే బలమైనవి, దేశానికి దిక్సూచులు అయినప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరిట ఎందుకు జాతీయ పార్టీ అయినట్టు..? దేశమంతా గాయిగత్తర లేపుతామనే గొప్పలు దేనికి..? పంజాబ్ రైతులకు, గల్వాన్ అమర జవాన్లకు తెలంగాణ జనం సొమ్మును ఎందుకు పంపిణీ చేసినట్టు..? ఆయా రాష్ట్రాల్లో కాలంచెల్లిన మొహాలను తీసుకొచ్చి ఇక్కడ కండువాలు కప్పడం ఎందుకు..? వారిలో ఎందరు మిగిలారు..? పేరుకు బీఆర్ఎస్… రక్తం, ఆత్మ తెలంగాణ ప్రాంతీయత..? ఓ తెలంగాణ మేధావి ఏకంగా మేడిగడ్డ కుంగుబాటుకు కూడా ఆంధ్రోళ్లే కారణమని గొప్ప సత్యం చెప్పాడు… ఖర్మ… భలే ఉన్నయ్ పాలిటిక్స్…!!
Share this Article