Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజకీయ భేతాళం..! అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా వోటరు తీర్పు ఓ పారడాక్స్…!!

November 8, 2023 by M S R

రాజకీయ భేతాళం.. ! పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైనున్న శవాన్ని దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే స్మశానం వైపు నడవసాగాడు. శవంలోని భేతాళుడు విక్రమార్కుడితో మాటలు కలిపాడు.

‘రాజా… ఏమిటీ విశేషాలు?’

‘ఏముందీ… రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఓటరు స్పష్టమైన తీర్పు చెప్పాడుగా తనకు మార్పు కావాలంటూ…’

Ads

‘అదేమిటి ఒక్క ముక్కలో తేల్చేశావు. స్థూలంగా పరిశీలిస్తే ఓటరు మార్పు కోరాడన్నది నిజమే… కానీ నీవంటి సూక్ష్మబుద్దులు మరింత సూక్ష్మంగా పరిశీలించి గానీ అంతిమ ప్రకటన చేయకూడదు…’

‘నువ్వనేది ఏమిటో బోధపడటం లేదే… ఓటరు నాడి ఏమిటో ఎగ్జిట్ పోల్స్ కూడా బయటపెడుతూనే ఉన్నాయి కదా…’

‘ఓటరు నాడి ఏమిటో ఛానళ్లకేం తెలుసు..? తెలుగు సినిమా ప్రేక్షకుడి మనస్సేమిటో… వన్డే క్రికెట్ పోటీలో ఎవరు గెలుస్తారో… ఎవరూ చెప్పలేరు… ముందే తెలిస్తే ఇక ఇన్ని తిప్పలెందుకు? లేనిపోని హామీలు చేయడమేల? ప్రచారంలో ఇంతగా వ్యయప్రయాసలేల?’

‘నువ్వన్నదీ నిజమే కావచ్చు… కానీ తనకు తెలుగుదేశం ప్రభుత్వ పనితీరు నచ్చలేదని, దాన్ని వ్యతిరేకిస్తున్నానని స్పష్టంగానే చెప్పాడు కదా ఓటరు…’

‘సరే, సరే… ఎలాగూ చర్చ వచ్చింది కదా, కొన్ని అంశాలు చెబుతా… అప్పుడు నా సందేహాలకు సమాధానాలు ఆలోచించి మరీ చెప్పు రాజా… ఇక విను…’

‘సరే… కానివ్వు’

‘భువనగిరి అసెంబ్లీ స్థానంలో నరేంద్రను ప్రజలు ఓడించారు, కానీ మెదక్ పార్లమెంటు స్థానంలో గెలిపించారు.? ఇంతకీ నరేంద్ర నాయకత్వాన్ని ప్రజలు ఆమోదించినట్టా..? తిరస్కరించినట్టా..?

‘నరేంద్ర కోణం నుంచి కాకుండా వేరే కోణంలో చూడాలిది… భర్త పోయినా రాజకీయాల్లోనే ఉంటూ, కార్యకర్తలను పట్టించుకుంటూ కష్టపడుతున్నందున అక్కడ ఉమామాధవరెడ్డి నాయకత్వాన్ని ప్రజలు కోరుకున్నారు. కానీ కాంగ్రెస్‌లో ఎంతోకాలం ఉండి, పలు పదవులూ అనుభవించి, అకస్మాత్తుగా పార్టీ మార్చి భాజపా తరఫున నిలబడిన రామచంద్రారెడ్డిని ప్రజలు తిరస్కరించారు…’

‘మరి అదే నిజమైతే… మొన్నమొన్ననే నక్సలైట్లు తన భర్తను చంపేసినా వెరవకుండా తిరిగి పోటీలో నిలబడిన మంత్రి మణికుమారిని ఎందుకు గెలిపించలేదు..? పార్టీ ఫిరాయించినా నాగేందర్‌ను ఆసిఫ్‌నగర్‌లో ఎందుకు గెలిపించారు..?’

‘….?….’

‘సమాధానం చిక్కడం లేదా..? సరే, ఇది విను… ఎన్టీయార్ సతీమణి లక్ష్మిపార్వతికి డిపాజిట్ కూడా దక్కలేదు. కానీ ఎన్టీయార్ కుమార్తె పురంధరేశ్వరికి మాత్రం ఘనవిజయం దక్కింది. ప్రజలు ఎన్టీయార్ పట్ల ప్రదర్శించిన భావమేమిటన్నట్టు.?’

‘పురంధరేశ్వరి ఎన్టీయార్ రక్తం. కానీ లక్ష్మిపార్వతి బయటి నుంచి వచ్చిన వ్యక్తి. అదీ తేడా..’

‘మరి ఒక అల్లుడు చంద్రబాబును గద్దె ఎందుకు దించారు? ఇంకో అల్లుడు వెంకటేశ్వరరావును ఎందుకు ఆదరించారు?’

…..?…..

‘మరోటి చెబుతా విను. ఎంపీగా పోటీచేసిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన భార్య సుజాతమ్మను గెలిపించారు. అదే సమయంలో అదే జిల్లాలోనే నాగిరెడ్డినీ, ఆయన భార్య శోభనూ ఓడించి తిరస్కరించారు. భార్యాభర్తలు ఇద్దరూ పోటీలో నిలబడినప్పుడు వేర్వేరుగా ప్రజలు ఎందుకు స్పందించారు?’

‘వాళ్లు కాంగ్రెస్ జంట… వీళ్లు తెలుగుదేశం జంట… ఒక జంటను గెలిపించారు, ఇంకో జంటను తిరస్కరించారు… అంతే…’

‘మరి అలాంటప్పుడు బొత్స సత్యనారాయణను ఎందుకు గెలిపించారు? ఆయన భార్య ఝాన్సీని ఎందుకు ఓడించారు?’

….?…..

‘జవాబు తట్టడం లేదా? ఇది విను… వెంకటరెడ్డి జైలులో ఉంటే ఆయన భార్య గౌరు చరితను గెలిపించారు. ఇదే పోతుల సురేష్ భార్య సునీతను ఓడించారు. ప్రజలు నేరచరితుల పట్ల ఏ విధంగా స్పందించినట్టు..? ‘

‘ఇదీ అలాగే… ఆమె కాంగ్రెస్ కాబట్టి గెలిపించారు. ఈమె తెలుగుదేశం కాబట్టి ఓడించారు…’

‘అవునా..? మరి కాంగ్రెస్‌కే చెందిన సూర్యనారాయణరెడ్డి భార్య భానుమతిని ఎందుకు ఓడించినట్టు..?’

…?….

msr

‘కృష్ణాజలాలను జంటనగరాలకు తీసుకురావడం ఎంత కష్టమో నీకు తెలుసు. అది సాధించిన తెలుగుదేశాన్ని హైదరాబాదులో ప్రజలు ఓడించారు. మెట్రో రైలును తీసుకొచ్చిన భాజపానూ ఓడించారు. ఇక అభివృద్ధి చేసే వారిని ప్రజలు ఆదరిస్తున్నట్టా..? ఆ విషయాన్నే పట్టించుకోనట్టా..?’

‘ప్రజలు ఉమ్మడిగా ఉపయోగపడే పనులకు ప్రభావితులు కారు. తమకు వ్యక్తిగతంగా ఉపయోగపడే లాభాలను, సాయాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే నాయకులు ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేది’

‘మరి సింగరేణిని లాభాల బాటలోకి తీసుకొచ్చి, జీతాలు పెంచి, లాభాల్లో వాటాలు కూడా పంచిపెట్టడం వల్ల సింగరేణి కార్మికులు వ్యక్తిగతంగానూ లాభపడ్డారు కదా… మరి అక్కడ మేడారంలో తెరాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ 56 వేల మెజారిటీలో ఎలా గెలిచినట్టు? వ్యక్తిగతంగా సాయాలు చేస్తే ఆదరిస్తారనేదే నిజమైతే కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ వెంకటేశ్ అంతగా మంచినీరు- డిష్ కనెక్షన్లు, ఓట్ల కానుకలు ఇచ్చినా జనం ఎందుకు ఓడించారు? సీపీఎం అభ్యర్థి గఫూర్‌ను ఎందుకు గెలిపించారు..?’

….?…..

‘సరే… సరే… సాక్షాత్తూ చిరంజీవి మద్దతు పలికినా అశ్వినీదత్ ఎందుకు ఓడిపోయారు..? స్వయంగా రంగంలో దిగిన రోజా ఎందుకు ఓడిపోయింది..? అంత మెగాస్టార్ చెప్పినా ప్రజలు ఎందుకు వినలేదు… అంత అందాలనటి రోజా పోటీచేసినా ప్రజలు ఎందుకు కాదన్నారు..? సినీనటులకు, వారి మాటలకు ప్రజలు ఎందుకు ఆదరణ చూపించలేదు..?

‘సినీనటులను అభిమానించేది కేవలం వారి నటన చూసే… సినిమాలను దాటి రాజకీయాల్లోకి వస్తే జనం ఆదరించే రోజులు కావివి… అందుకే రజినీకాంత్ చెప్పినా తమిళనాడు ప్రజలు ఆయన మాటలు ఖాతరు చేయలేదు…’

‘మరి ఎన్టీయార్ మనమడు చిన్న ఎన్టీయార్ మద్దతు పలికిన కొడాలి నానిని ప్రజలు ఎందుకు గెలిపించినట్టు..?

….?….

పూర్తిగా పట్టణ ప్రాంతమైన సికింద్రాబాద్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రజలు ఓడించారు. అదే పూర్తిగా పల్లె ప్రాంతమైన స్టేషన్ ఘన్‌పూర్‌లో మంత్రి కడియం శ్రీహరిని ఓడించారు. దీంట్లో ప్రజల వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి..?

‘ఆ కోణం సరికాదు, ఇద్దరు మంత్రులూ తెరాసను విపరీతంగా తిట్టేవారు, తెలంగాణవాదం ప్రబలంగా ఉండి, ప్రజలు వారి ధోరణిని నచ్చక వారిని ఓడించారు’

‘మరి నాగర్‌కర్నూలులో మరో మంత్రి నాగం జనార్ధనరెడ్డిని ఎందుకు గెలిపించారు..? ఆయన కూడా తెరాసను బాగానే తిట్టేవాడు కదా..?’

…..?…..

‘ఇలా ఎన్నో… ఎన్నెన్నో… ఒక అంశంలో ఒకలాగా అనిపించే ఓటరు తీర్పు మరో అంశంలో మరోలా అనిపిస్తుంది… అందుకే ఓటరు తీర్పును ఎవరికి వారు ఏ రీతిలోనైనా అన్వయించుకోవచ్చు’

‘నేనే సమాధానపడలేకపోతున్నా…’

‘ఇంగ్లిషులో పారడాక్స్ అనే ఒక పదముంది… అబద్ధంలా కనిపించే నిజం… నిజంలాగే కనిపించే అబద్ధం… హేతుబద్ధంగా అనిపించే నిర్హేతుకత… నిర్హేతుకంగా కనిపించే హేతుబద్ధత… క్లిష్టంగా ఉందా అర్థం చేసుకోవడం..? ఓటరు నాడి కూడా సూక్ష్మంగా పరిశీలిస్తే ఇలాగే ఉంటుంది…’

‘విక్రమార్కుడు మాట్లాడకపోయేసరికి భేతాళుడు తిరిగి చెట్టెక్కాడు…



ఇది అప్పట్లో… అనగా 2004లో… ఎన్నికల ఫలితాలు వచ్చాక, ఈనాడు ఎన్నికల స్పెషల్ పేజీల్లో నేను రాసిన చివరి బైలైన్ స్టోరీ ఇది… ఓటరు తీర్పును ఎవరుపడితే వాళ్లు, ఎలాపడితే అలా ఎలా అన్వయించుకుంటారు అనేది పక్కా ఉదాహరణలతో రాశానప్పుడు… వావ్… 19 ఏళ్ల క్రితం స్టోరీ… ఈ తెలంగాణ ఎన్నికల తరువాత, ఆ తరువాత ఏపీ ఎన్నికల తరువాత, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చాక కూడా అచ్చంగా ఇదే చిత్రం కనిపిస్తుంది… ఇక్కడే కాదు… ఏ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలైనా ఇంతే… ఇలాగే ఉంటాయి… స్థూలంగా కొన్ని ఏకీభవించవచ్చు, సూక్ష్మ స్థాయికి వెళ్తే మాత్రం ఎటూ అంతుపట్టదు, ఏ సూత్రీకరణలకూ లొంగదు… – మంచాల శ్రీనివాసరావు…

(ప్రస్తుత ఈనాడు ఎడిటర్ ఎం.నాగేశ్వరరావు, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి అప్పట్లో ఈ ఎన్నికల స్పెషల్ పేజీలకు బాధ్యులు… ఓ మిత్రుడు పంపించడం వల్ల ఇది దొరికింది… మిగతావి నాకు అందుబాటులో లేవు…)



 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions