మిత్రుడు Bharadwaja Rangavajhala వ్యంగ్యంగా ఏమంటాడంటే… ‘‘ఎవరికి ఓటేయాలి అనే మీమాంస వద్దు! అద్వైతంగా ఆలోచన చేయండి … సైకిల్ ఓటుబ్యాంకును హస్తానికి అమ్మేసుకున్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న టీగ్లాసు మద్దత్తుతో పోటీ చేస్తున్న కమలంతో లాలూచీ పడ్డ కారు గుర్తుకే మీ ఓటు…’’
చదవగానే నవ్వొచ్చినా… నిజంగానే తెలంగాణలో ఓ వింత పరిస్థితి… ఎలాగంటే..? టీడీపీ పోటీచేయడం లేదు, కాంగ్రెస్‌కు అనుకూలించడం కోసం… బహిరంగంగా చెప్పకపోయినా, ప్రకటించకపోయినా, ఇప్పుడు పోటీచేసే స్థితిలో లేమంటూ ఆ జాతీయ పార్టీ చెప్పుకున్నా సరే… ఆ నిర్ణయం కాంగ్రెస్ రేవంత్‌రెడ్డికి, అనగా చంద్రబాబు విధేయ రేవంత్‌రెడ్డికి అనుకూలించడం కోసమే… పోనీ, అలా అనుకుందాం కాసేపు…
ఐనా గత ఎన్నికల్లో చంద్రబాబు నేరుగానే కాంగ్రెస్‌తో మిలాఖత్ అయ్యాడు కదా… అప్పుడేమో పొత్తు తరహా… ఇప్పుడేమో బేషరతు పరోక్ష మద్దతు తరహా… సరే, అలా కాంగ్రెస్‌కు సహకరిస్తున్న చంద్రబాబుతో జనసేన పొత్తు… ఇది బహిరంగమే… ఏపీలో మాత్రమే అనుకోకండి… రాష్ట్రానికోరకం వైఖరి ఉండదు కదా… అలా తెలంగాణలో కూడా వారిద్దరూ ఒకటే అనుకోవాలి కదా… మరి చంద్రబాబు ధోరణి కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుండగా, అధికారిక పొత్తు మాత్రం జనసేనతో అన్నమాట…
Ads
ఇప్పుడు టీడీపీ శ్రేణులు తమ చంద్రబాబు మనిషి రేవంత్‌రెడ్డి కోసం కాంగ్రెస్‌కు వోటేయాలా..? అధికారికంగా చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న జనసేనకు వోటేయాలా..? అబ్బే, జనసేన పోటీచేసేది ఏడెనిమిది సీట్లే కదా, పర్లేదు, అక్కడ జనసేనకు, మిగతాచోట్ల కాంగ్రెస్‌కు వోటేస్తే సరి అనుకోవడానికి కూడా వీల్లేదండోయ్… ఎందుకంటే..?
తెలంగాణలో బీజేపీకి జనసేనకు నడుమ అధికారిక పొత్తు ఉంది… మొన్న మోడీ వచ్చినప్పుడు పవన్ కల్యాణ్‌ను పక్కన కూర్చోబెట్టుకుని మస్తు మర్యాద కూడా ఇచ్చాడు… అసలే తెలంగాణ ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులు ఆహారనిద్రలను మరిచి బాధపడిన కేరక్టర్ కదా… సో, తమకు అధికారిక పొత్తు ఉన్న జనసేనతో కూడా అధికారిక పొత్తు ఉన్న బీజేపీకి మిగతా చోట్ల వోటేయాలా..? కానీ బీజేపీకి, టీడీపీకి టరమ్స్ బాగాలేవు కదా… పైగా బీజేపీకి వోట్లేస్తే మరి రేవంత్‌రెడ్డికి ఉపయోగపడేదెలా..? ఇదీ మీమాంస…
పోనీ, బీజేపీకి వోట్లేద్దాం, కాంగ్రెస్‌తో మనకేం పని..? మన జనసేనతో బీజేపీకి పొత్తుంది కదాని అనుకోవాలంటే… బీజేపీకి బీఆర్ఎస్‌కు రహస్య అవగాహన ఉంది… అంటే బీజేపీకి మద్దతు అంటే పరోక్షంగా బీఆర్ఎస్‌కు మద్దతు అనుకోవాలా..? మరి అలాంటప్పుడు బీజేపీకి వేసినా, బీఆర్ఎస్‌కు వేసినా అది కాంగ్రెస్‌కు నష్టమే కదా… సో, మీమాంస తప్పదు…
మొత్తం గందరగోళంగా ఉందనిపిస్తోందా..? అవును మరి… టికెట్టు రాకపోతే జంప్ చేసిన నాయకులకు నీతి లేదు, రీతి లేదు అని తిట్టిపోస్తున్నాం కదా… మరి సిద్ధాంతాల్లేకుండా, రాద్ధాంతమే ఓ సిద్ధాంతంగా ఇలా ప్రజలకు అర్థమయ్యీకాని పొత్తులు, దోస్తానాలతో జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్న పార్టీలను ఏమనాలి..?
పోనీ, ఇలా పైన చెప్పిన ఈక్వేషన్‌లో చెప్పినట్టు… బీజేపీ, జనసేన, బీఆర్ఎస్, మజ్లిస్ గాకుండా మిగతా పార్టీలన్నీ ఓ మహాకూటమిగా వ్యవహరిస్తున్నాయనే అనుకుందాం… మరి టీడీపీ, జనసేన పొత్తుకు ఉన్న పవిత్రత ఎంత..? జనసేనతో బీజేపీకి ఉన్న పొత్తు పవిత్రత ఎంత..?
Share this Article