Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అవి నేను ఎస్.వరలక్ష్మితో లేచిపోవాలని ప్లాన్ చేస్తున్న రోజులు…

November 10, 2023 by M S R

అక్షర తేజోమూర్తి సాక్షాత్కారం

A close encounter with Raavi Shastri

———————————————-

Ads

అవి నేను ఎస్.వరలక్ష్మితో లేచిపోదామని

ప్లాన్ చేస్తున్న రోజులు!

అహో!..ఏమా గొంతు! ఏం నవ్వు! ఏం చూపు!

వేళాపాళా లేకుండా నడుచుకుంటూ వచ్చేసేదావిడ కలల్లోకి…నీ సరి విలాసులు జగాన లేనే లేరుగా,

“వేయి శుభములు కలుగు నీకు” అని పాడుకుంటూ…

మనశ్శాంతి లేకుండా చేసేది.

లీలా కృష్ణుని నీ లీలలుగని…అని ఒకసారి,

“వరాల బేరమయా..” అని మరోసారి పాడేది.

మరువమూ.., మార్దవమూ.. ఆ గొంతులో

ఒకేసారి కలిసి పూసేవి.

ఏంటోమరి భానుమతి, సావిత్రి, జమున, కృష్ణకుమారి లాంటి హెవీ వెయిట్స్ కన్నా ఎస్.వరలక్ష్మే నాకు బాగా నచ్చేది.

నా హృదయానికి దగ్గరగా వచ్చేది.

మరీ ముఖ్యంగా విచ్చుకుంటున్న నందివర్ధనం పువ్వు లాంటి ఆ నవ్వూ.. పోనీ, ఒకవేళ ఆమె కోపంగా చూసినా సరే, చిదిమి శాపం పెట్టుకోవచ్చు!

ఏ రకంగా అయినా ఆమె నాకు ఇష్టమే అని చెప్పడమే ఉద్దేశం.

అప్పుడు నేను విశాఖపట్నం ‘ఈనాడు’లో చిన్నపాటి సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను.

నా వయసు 22సంవత్సరాలు.

“అరేయ్ నీకీ ఎస్.వరలక్ష్మి ఫిక్సేషన్ ఏమిటో..” అని అన్నయ్య ఆర్టిస్ట్ మోహన్ ఒకసారి నవ్వుతూ మందలించాడు కూడా.

అది 1979 – 80 ల నాటి మాట.

అంటే నలబై ఏళ్ల క్రితం…

మద్రాసు వెళ్ళడానికి ట్రైనుగ్గానీ, బస్సుగ్గానీ కేవలం నా దగ్గర డబ్బులు లేక ఎస్.వరలక్ష్మి మంచి ఛాన్స్ మిస్సయిపోయింది.

ఓ రోజు ఆమె గాన మాధుర్య మాయలో తేలియాడుతూనే, ఎడిటోరియల్ సెక్షన్లో కూచుని వార్తలు రాసుకుంటున్నాను.

నాటి ఈనాడు ఆఫీసు దిగువ మధ్య తరగతి వాడి కొంపలా దిగులుగా ఉండేది.

ఎవరో ఒక పెద్దాయన వచ్చి మా న్యూస్ ఎడిటర్ కేశవరావు గారి ముందు కుర్చీలో కూర్చున్నాడు. తలెత్తి చూస్తే గుండె గుభిల్లుమంది.

వచ్చినవాడు సాక్షాత్తూ రాచకొండ విశ్వనాథశాస్త్రి!

నల్లటి దళసరి ఫ్రేము ఉన్న కళ్ళద్దాలతో ఎంత హుందాగా ఉన్నాడో, ముండాకొడుకు అంత అందంగానూ ఉన్నాడు. సారా కథలు, బాకీ కథలు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, ఋక్కులు, ఆ అందమైన పిల్ల నూతిలో దూకి చచ్చిపోతుందిగా ఆ “వెన్నెల” కవిత్వం కథ, వియత్నాం విమల వృత్తాంతం విడమర్చిన రత్తాలూ, రాంబాబు… ఇంకా సవాలక్ష అద్భుతాలు రాసిన, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ రాచకొండ అనంత పద్మనాభస్వామి, బడుగు జర్నలిస్టుల ముందుకొచ్చి అల్పజీవిలా కూర్చోవడమేమిటి?

ఆయన్నే గమనిస్తూ ఉన్నాను.

నా గుండె గుబగుబలాడుచున్నది.

రావిశాస్త్రి ఒక న్యూస్ ప్రింట్ కాగితం తీసుకుని పది పన్నెండు లైన్లు రాసి, న్యూస్ ఎడిటర్ చేతికిచ్చి, వినయంగా, చిన్నగా నవ్వి నెమ్మదిగా వెళ్ళిపోయారు.

నేనింకా రావిశాస్త్రి అంటే, ఎడమచేతిలో ఎర్రజెండా, కుడిచేతిలో Ak-47,

నోటి నుంచి దూసుకొస్తున్న అగ్నిజ్వాలలతో విశాఖ వీధుల్లో విప్లవాసురునిలా తిరుగుతుంటాడని అనుకున్నా, వెర్రి మొహాన్ని..! కేశవరావు గారు నా చేతికి ఆ కాగితాన్నిచ్చి, విరసం ప్రకటనని వార్తగా రాయమన్నారు. మహాప్రసాదంలా స్వీకరించి చూద్దును కదా… పొందికైన అక్షర నక్షత్రాలు… శాస్త్రిగారి దస్తూరి… ముత్యాలకోవ… నిజం చెప్పొద్దూ, ఎస్.వరలక్ష్మి కంటే వీడే బెటరేమో అనిపించింది నాకా క్షణంలో…

తర్వాత రోజుల్లో, రావిశాస్త్రి కోసం ఒక విరసం మీటింగుకి వెళ్ళాను. ముందొకాయన మాట్లాడారు. ఈ సామ్రాజ్యవాద, నయా వలసవాద, నికృష్ట దోపిడీ దుర్మార్గ వ్యవస్థని బాంబుల్తో పేల్చేసి శనివారం సాయంత్రానిగ్గానీ, లేటయితే మంగళవారం మధ్యాహ్నానిగ్గానీ విప్లవం తెచ్చేస్తామని హామీ ఇచ్చారు. చివర్లో, ఇపుడు ప్రసిద్ధ రచయిత రావిశాస్త్రి ప్రసంగిస్తారని కూర్చున్నాడు. ఇక ఈయనెన్ని బాంబులు పేలుస్తాడో అని నేను జడుసుకు చస్తుండగా, నెమ్మదిగా రావిశాస్త్రి మైకు ముందుకొచ్చారు. రెండు చేతుల్తో టక్ ని నాజూగ్గా సవరించుకున్నారు “మరేట్నేదు, నేను చెప్పొచ్చేదేమంటే..ఈ లోకంలో పేదవాడికి న్యాయం జరగాలి, ఏ చెడుకీ మేలు జరక్కూడదనీ, ఏ మంచికీ చెడు జరక్కూడదనీ అనుకుంటున్నాను. కవులైనా, రచయితలైనా కష్టజీవుల పక్షానే ఉండాలని కూడా నేననుకుంటున్నాను” అని చెప్పి ముగించారు.

నిప్పులు కురిపిస్తారనుకుంటే ఈయన ఇంత మర్యాదగా, సౌమ్యంగా మాట్లాడారేమిటీ అని ఆశ్చర్యపోయాను.

“ఆమెని చూస్తే ఎవరికీ తల్లీ, చెల్లీ గుర్తుకురారు,”

“ఆమె నడిచి వస్తుంటే వీధిలోని మొగకుక్క కూడా ఓసారి మోరెత్తి చూస్తుంది,” “ఆమె ఎగిసిపడే రొమ్ములతో గుద్దితే ఎదురున్న గోడ కూలిపోతుంది…” అని అన్యాయంగా రాసిన దుర్మార్గుడేనా ఈ మృదుభాషి! విస్మయం నాకు!

తర్వాత్తర్వాత, సాహిత్య సమావేశాల్లో ఆ రౌడీ రచయితని కలవడం, మాట్లాడడం, ఆయనతో టీ తాగడం లాంటి గౌరవాలు దక్కాయి.

ఓ సారి హిందూ రీడింగ్ రూములో సమావేశం ముగిశాక, రావిశాస్త్రిగారు నా భుజంమీద చెయ్యేసి నడుస్తూ, “మీరు విశాఖ రచయితల సంఘంలో ఒక సెక్రటరీగా ఉండరాదూ…” అన్నారు.

సిగ్గుతో చచ్చి సున్నం అయిపోయాను.

“కుర్రనా కొడుకుని ఒదిలేయండి” అని తప్పించుకున్నాను.

ఇవ్వాళ ఎందుకో ‘చాత్రిబాబు’ పూనాడు నన్ను.

ఎన్టీరామారావు గొప్ప విజయం సాధించినపుడు “ఆయనకేం చౌదరీ కా చాంద్” అన్నాడు ఆయన. ఇకాయన సోదరసోదరీమణులారా అనడు, చౌదరీ చౌదరీ మణులారా అంటాడు అని ఆటపట్టించిందీ రావిశాస్త్రిగారే. కులం కాదు ఇక్కడ చూడాల్సింది, ఆయన హాస్య ప్రియత్వమూ, beauty of spontaneity.

(కులం అస్సలు లేదని కాదు సుమా!)

*** *** ***

పెద్దవయసొచ్చాక రావిశాస్త్రిగారు ఓ నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ఆంధ్రప్రభ వారు ఒక వ్యాసం రాసిమ్మని అప్పుడే అడిగారు. రావిశాస్త్రి గారు రాసి సిద్ధం చేశారు. అయితే, చివరి పేరాలో, “నేనీ మధ్య ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చేరాను, నాలుగు రోజుల్లోనే కోలుకున్నాను, మందుల వల్ల కాదు, నాకు సేవచేసిన నర్సు అందమైన నవ్వు వల్ల (ఆమె పేరు మర్చిపోయాను) అని రాశారు.

మహా రచయిత మీద గౌరవంతో ఎడిట్ చెయ్యకుండా,ఆంధ్రప్రభ వాళ్ళు చివరి పేరాతో సహా పబ్లిష్ చేశారు. ప్రింటయివచ్చింది. వ్యాసం చదువున్న రావిశాస్త్రి, “ఆఖరి పేరా అనవసరంగా రాసాను, ఆ నర్సు ఎవరో ఏమిటో, నాన్సెన్స్..” అనుకుని బాధపడ్డారు. ‘నా స్టేచర్ కి తగని పని’ అని లోలోపల గింజుకున్నారు.

ఓ గంటా గంటన్నర తర్వాత, ఆ నర్సు వాళ్ళాయన రావిశాస్త్రి ఇంటికొచ్చారు. ఆమె భర్త, శాస్త్రిగారికి పూలగుత్తి ఇచ్చి, పళ్ళబుట్ట మంచం దగ్గరగా పెట్టి, “మీ అంతటివారు గుర్తు పెట్టుకొని మా ఆవిడ పేరు పేపర్లో రాయడం…” అంటూ కృతజ్ఞతతో కుంగి, వొంగి కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోయాడు.

*** *** ***

రచయిత పతంజలి విశాఖ “ఈనాడు”లో మా డెస్క్ ఇన్చార్జుల్లో ఒకరు. ఒక సాయంకాలం, “ఈ రోజు చాలా ఆనందంగా ఉంది, చాయ్ తాగుదామా?” అన్నారు నాతో. టీ తాగుతూ “నిన్న సాయంత్రం రావిశాస్త్రి గారిని కలుద్దామని కోర్టులో బార్ అసోషియేషన్ హాలుకి వెళ్ళాను. తలుపుమూసి ఉంది. స్టూలు మీద కూర్చునున్న అటెండర్ ని అడిగితే “చాత్రిబాబు మీటింగులో ఉన్నారు, కూకోండి” అన్నాడు. ఆ స్టూలు మీద కూర్చున్నా, చాలాసేపయింది. లోపలి నుంచి పెద్దగా నవ్వులూ, మాటలూ వినిపిస్తున్నాయి. నాకు లేటవుతుంది.

పతంజలి వచ్చాడని శాస్త్రిగారికి చెప్పగలవా? అని అటెండర్ ని అడిగాను. వెళ్లి, చెప్పాడు. తలుపు తీసుకొని రావిశాస్త్రి వచ్చారు. “భలే వచ్చారే, రండి అంటూ నా చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ చాలా మంది లాయర్లు ఉన్నారు. విశేషం ఏమిటంటే, రావిశాస్త్రి నా ‘గోపాత్రుడు’ నవల చదివి వాళ్ళకి వినిపిస్తున్నారు. వాళ్ళు పడీపడీ నవ్వుతున్నారన్న మాట. ఇదిగో పతంజలి గారు, నవల ఈయన రాసిందే అని రావిశాస్త్రిగారు పరిచయం చేసారు. లాయర్లంతా లేచి నిలబడి, చప్పట్లు కొట్టి, షేక్ హాండ్ ఇచ్చి నన్ను అభినందించారు” అని చెప్పారు.

అప్పుడు, అసమాన ప్రతిభా సంపన్నుడైన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి ముఖంలో సాహిత్య నోబెల్ బహుమానం పొందిన ఆనంద పారవశ్యాన్ని నేను చూడగలిగాను.

*** *** ***

అలా, సీతమ్మధారలో రోడ్డుమీద నడిచి వెళ్లే ఇరవై రెండేళ్ల కుర్రవాడినైన నేను, ముష్టి వెయ్యి రూపాయల జీతగాణ్ణి…

ద్వారకానగర్ లో…

పీక తెగినా రాజీపడని రచయితని,

ఆసీల్ మెట్టలో…

పేదవాడి పక్షాన నిలువెత్తు నిజాయితీగా నిలబడిన లాయర్ని…

విశాఖ నీలి సముద్ర కెరటాల మీద…

దివ్యకాంతితో తేలియాడుతున్న రాచకొండనీ

దర్శించుకున్నవాడనై

సంధ్యారుణ కిరణాల సాక్షిగా ధన్యుడనయ్యాను.

*** *** ***

ఆత్మగీతం:జీవన్ అప్నా వాపస్ లేలే, జీవన్ దేనేవాలే… అని మహ్మద్ రఫీ నా వెనక నించొని హైపిచ్ లో పాడుతుండగా… భ్రమల మాయపొర తొలిగినా కలల గాన గంధర్వ కన్య ఎస్.వరలక్ష్మిని కోల్పోయి, శాపవిమోచన భాగ్యమునొందిన నేను,మేరునగధీరుడైన రాచకొండ విశ్వనాథ శాస్త్రియను అక్షర తేజోమూర్తి సాక్షాత్కారంతో పునీతమై, తుచ్ఛమైన మానవ జన్మను చాలించి, పిపీలికముగా మారి ఆయన పాదాలను తాకి, లీనమై, మోక్షమునొందితిని.*** *** ***- గాన సరస్వతి ఎస్.వరలక్ష్మికి క్షమాపణలతో-ఖాళీ సమయాన్నిచ్చిన కరోనా వైరస్ కికృతజ్ఞతలతో…. – తాడి ప్రకాష్, 97045 41559 old post

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!
  • ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!
  • జర్నలిస్టులంటే తోపులూ, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
  • 1.74 లక్షల కోట్ల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…
  • అదిప్పుడు క్రిమినల్ గ్యాంగుల స్వీడన్… కిశోర బాలికలే గ్యాంగ్‌స్టర్లు…!
  • అరుదైన సాహసం..! ఈ వయస్సులో, ఈ అనారోగ్యంలో కైలాస యాత్ర..!!
  • ఏదో ఓ పురాణకథని సినిమాకరిస్తే సరి… అప్పట్లో అదే పరుచూరి ట్రెండు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions