Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

చంద్రమోహన్ అంటే చంద్రమోహనే… ఏ తోక పురస్కారాలూ లేవు…

November 11, 2023 by M S R

..‌. అవసరమైన విషయాలను వదిలేసి అనవసరమైనవి గుర్తు పెట్టుకోవడంలో ప్రపంచంలో తెలుగు వాళ్లని కొట్టేవాడు లేడు. తెలుగు వాళ్లకు భలే భలే విషయాలు గుర్తుంటాయి. అసలు విషయాలు, అతి ముఖ్యమైన సంగతులు మాత్రం అరిచి గీపెట్టినా గుర్తుండవు. ఫలానా ఆవిడ ఫలానా ఆయనతో తిరుగుతోంది, ఫలానా అతను ఫలానా ఇంటి ముందు రాత్రిపూట తచ్చాడాడు, ఫలానా వాళ్లు విడాకులు తీసుకున్నారు, ఫలానా ఆవిడకు పెళ్లయినా కాళ్లకు మెట్టెలు లేవేంటి.. ఇలా సవాలక్ష విషయాలు మన జ్ఞానగ్రంథుల్లో తచ్చాడుతూ ఉంటాయి.వాళ్ల మంచి మనకు అక్కర్లేదు. ఈ మసాలాలే కావాలి. అందుకే చూడండి మనవాళ్లకి ‘రుక్మిణీ కల్యాణం’ కన్నా ‘శ్రీకృష్ణ తులాభారం’పైనే మక్కువ ఎక్కువ. కృష్ణుడు రుక్మిణిని రథంపై తీసుకెళ్ళి పెళ్లాడితే ఎవరికి కావాలి? ఆ కృష్ణుడు సత్యభామ చేత నారదుడికి దానంగా మారి, తులాభారం తూయించుకుంటే కదా చూడాలి. అదీ మజా! ఈ బుద్ధిని తప్పు అని చెప్పలేం! నేరం అని ఖండించలేం! అదొక సంస్కృతి అని వదిలేయడమే!

… ఇలాంటిదే చంద్రమోహన్ గారి విషయంలోనూ ఉంది. పరమ పిసినారి, భోజనప్రియుడు, తన ఖర్చులు నిర్మాతల మీద రుద్దే రకం.. వగైరా! ఇందులో భోజనప్రియత్వం గురించి ఆయనే చాలాసార్లు చెప్పుకొన్నారు. 70 ఏళ్ల దాకా తన ఆరోగ్యాన్ని ఆయన కాపాడుకున్నారు. నటిస్తూనే ఉన్నారు. ఇక ‘పిసినారితనం’ అనే మాటను కూడా ఒక ఇంటర్వ్యూలో ఉదహరిస్తూ “సినిమా రంగం గ్యారెంటీ లేని ప్రొఫెషన్. డబ్బు విషయంలో జాగ్రత్తగా లేకపోతే నటీనటుల చివరి రోజులు ఎంత దయనీయంగా ఉంటాయో నేను కళ్లారా చూశాను. పెద్ద హీరోల స్థాయిలో నేను సంపాదించలేదు. కానీ నాకొచ్చిన కొంచెమే జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నాను. అదే నన్ను ముసలి వయసులో కాపాడుతూ ఉంది” అన్నారు.

ఇందులో ఏమైనా తప్పు ఉందా? నాకైతే ఏ తప్పూ కనిపించడం లేదు. Financial Control and Systematic Plan ఇది. చాలామందికి పాఠం లాంటిది. ఆయన డబ్బు సంపాదించారు. దాచుకున్నారు. దానధర్మాలు చేసి ఉండొచ్చు, ఉండకకపోవచ్చు.. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఆ మాత్రానికే పిసినారి అనడంలో ఆంతర్యం నాకు అంతుబట్టదు.

Ads

… సినిమా రంగంలో అందరూ దానకర్ణులే ఉండాలన్న నిబంధన ఏదో మనకు బాగా రిజిస్టర్ అయి ఉన్నట్టుంది. హీరో అనగానే కోట్లు సంపాదిస్తారు కాబట్టి రెండు చేతులతో ఎడాపెడా దానాలు చేయాలని, పేదలకు పెళ్లిళ్లు చేయించి, చదివించి, వృద్ధిలోకి తేవాలని మనలో కొందరు ఆశిస్తూ ఉంటారేమో? ఏం? ఎందుకలా? ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. కానీ డబ్బు పట్ల ఏమాత్రం జాగ్రత్త చూపినా ‘పిసినారి’ అనే ట్యాగ్ తగిలించడం షరా మామూలుగా అలవాటైంది.

హీరోలు అలా కోట్లకు కోట్లు సమాజంపై గుమ్మరిస్తేనే మనకు తృప్తి. అదేంటో మరి? జనాల దగ్గర కోట్లు తీసుకోలేదా, ఇస్తే ఏం పోయింది అని అనకండి. ఆ వాదనే నిజమైతే సంతూర్ సబ్బు, కోల్గేట్ పేస్ట్ సంస్థలు కూడా జనాల నుంచి కోట్లకు కోట్లు తీసుకుంటున్నారు. కానీ సినిమా వాళ్ల మీదే మన చులకన భావం బయటపడుతూ ఉంటుంది.

… ‘నిర్మాతల మీద తన ఖర్చులు రుద్దే..’ అనే మరో బలమైన ఆరోపణ కూడా చంద్రమోహన్ గారి మీద అక్కడక్కడా కొందరు చేశారు. ఆయన దాదాపు 900 సినిమాలకు పైగానే చేసి ఉంటారు. నిర్మాతల మీద ఆయన ఖర్చులు రుద్ది ఉంటే అన్నిసార్లు ఎందుకు ఆయన్ని తీసుకుంటారు? మళ్లీ మళ్లీ ఎందుకు రిపీట్ చేస్తారు? అన్ని సినిమాల్లో అవకాశాలు ఎందుకు ఇస్తారు? ఏనాడో టాటా చెప్పి ఇంటికి పంపించేవారు కదా!

పైగా ఆ నిర్మాతల్లో ఎంతమంది ఆయనకు పూర్తి పేమెంట్ ఇచ్చారనే విషయం మనకు తెలుసా? ఎంతమంది ఎగ్గొట్టారో తెలుసా? ఆయన నచ్చిన భోజనం పెట్టి, బతిమాలి, ఉచితంగా సినిమాలు చేయించుకున్న నిర్మాతలున్నారనే సంగతి తెలుసా? ఇవేవీ తెలియవు. ఎక్కడో ఎవరో చెప్పిన మాట దొరికింది. దాన్నే చిలువలు పలువలు చేసి చెప్పడం, మళ్లీ మళ్లీ దాన్నే రిపీట్ చేయడం! సరే ఎవరి గోల వారిదే! మనం చెప్తే మాత్రం ఆగుతారా?

… చంద్రమోహన్ గారు నటన తెలిసిన నటుడు. ఉత్తుత్తిగా కాక, నిజంగా నటించడం వచ్చిన నటుడు. ఆయన మలయాళ, తమిళ సినిమా రంగంలో ఉండి ఉంటే తప్పకుండా నాలుగైదు జాతీయ అవార్డులు వచ్చేవి. అంత బలమైన పాత్రలు, అందుకు తగ్గ నటన. నిరుపేద, లక్షాధికారి, పల్లెటూరి అమాయకుడు, పట్నంలో చదువుతున్న చిన్నోడు, భార్య చాటు భర్త, భార్యపై అజమాయిషీ చేసే భర్త, నలుగురు హీరోల్లో ఒకరు, నలుగురు బిడ్డలున్న తండ్రి.. ఏ పాత్ర అయినా చేశారు. అందులో జీవించారు. ‘సుఖదుఃఖాలు’, ‘బొమ్మాబొరుసు’, ‘రంగులరాట్నం’, ‘ఓ సీత కథ’, ‘పక్కింటి అమ్మాయి’, ‘రారా కృష్ణయ్య’, ‘సీతామాలక్ష్మి’, ‘కొత్తనీరు’, ‘సిరిసిరిమువ్వ’, ‘పదహారేళ్ల వయసు’, ‘శుభోదయం’, ‘శంకరాభరణం’, ‘ప్రతిఘటన’, ‘రాధాకల్యాణం’, ‘సువర్ణసుందరి’, ‘శిక్ష’, ‘శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం’, ‘పెద్దరికం’.. చెప్తే బోలెడన్ని సినిమాలు. ఆయన నటనా కౌశలం అన్ని పాత్రల్లోనూ నిండు దీపమై వెలుగుతూ ఉంది‌.

… గుండమ్మ కథ’ సినిమా రీమేక్ చేస్తే ‘గుండమ్మ’ పాత్ర ఎవరు చేస్తారని అందరూ అనుకుంటారు కదా, ‘కలికాలం’ సినిమా‌ రీమేక్ చేస్తే అందులో చంద్రమోహన్ గారి పాత్ర ఎవరు చేస్తారు? ఇవాళ ఆ రేంజ్ రియలిస్టిక్ నటన ఎవరికి సాధ్యపడుతుంది? పోనీ ‘సగటు మనిషి’, ‘ఓ భార్య కథ’, ‘శ్రీమతికి ఒక బహుమతి’.. వీటిల్లో చంద్రమోహన్ గారి పాత్రల్లో మరొకరిని ఊహించగలమా? ‘ఆమె’లో వేసిన మధ్యతరగతి తండ్రి పాత్ర, ‘7/జి బృందావన్ కాలనీ’లో వేసిన తండ్రి పాత్ర మరొకరికి సాధ్యమా?

కామెడీ ఇహ చెప్పక్కర్లేదు! హీరోలు కామెడీ చేయడం అనేది ఆయన మొదలు పెట్టగా, ఆ తర్వాత అనేకమంది అందుకుని అద్భుతంగా రాణించారు. ‘పాపే నా ప్రాణం’ అనే సినిమాలో భార్య (జయసుధ)ను చంపాలని చూసే భర్త పాత్రనూ చంద్రమోహన్ విలక్షణంగా పోషించారు. తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత అంత సమర్థంగా తెనాలి రామకృష్ణుడి పాత్ర పోషించిన ఘనత చంద్రమోహన్ గారికే దక్కింది. ఆ అవకాశం ‘ ఆదిత్య 369’ సినిమాలో చిక్కింది.

… “చంద్రమోహన్‌గా వచ్చాను. చంద్రమోహన్‌గానే వెళ్లిపోతాను. నాకు ఏ బిరుదులూ వద్దు” అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అన్నట్టే వెళ్లిపోయారు. తెలుగు తెర మీద తెలుగును అద్భుతంగా పండించిన తెలుగు నటుడు. తెలుగు నేలను విడిచి వెళ్లిపోయారు. ఆయనకు నివాళి. జలంధర గారికి ప్రగాఢ సానుభూతి. – విశీ

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions