Bharadwaja Rangavajhala…… తెలుగు తెర చంద్రుడు… చంద్రమోహన్ గా పాపులర్ అయిన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా స్వర్ణయుగపు మేలి గురుతు . బిఎన్ దర్శకత్వంలో నటించి ఇప్పటికీ మనకు మిగిలి ఉన్న నటుల్లో ఆయన ఒకరు. 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ప్రారంభమైంది. అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిద్యమైన పాత్రలు పోషించాడు. ఈ రోజుకీ తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటుడు చంద్రమోహన్. ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని ఏలేసేవాడు అని మహానటుడు ఎస్వీఆర్ తో ప్రశంసలు పొందిన నటుడు చంద్రమోహన్. చంద్రమోహన్ దర్శకుల నటుడు. దర్శకుడి ఊహలో రూపుదిద్దుకున్న పాత్రకు తెర మీద ప్రాణ ప్రతిష్ట చేయడంలో చంద్రమోహన్ కు తిరుగులేదు. తెర మీద ఆయన కనిపించరు పాత్ర మాత్రమే కనబడేలా చేయగలగడం ఆయన గొప్పతనం.
చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో జన్మించారు. అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. బాపట్ల ఎగ్జికల్చర్ కాలేజీలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. వాహినీవారి రంగులరాట్నం చిత్రంతో మొదలుపెట్టి, విలన్ గా , హీరోగా సహనటుడుగా తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.
వాహినీ సంస్ధలో మహాదర్శకుడు బిఎన్ రెడ్డి చేతుల మీదుగా కెరీర్ ప్రారంభించిన చంద్రమోహన్ తొలి చిత్రం రంగుల రాట్నం. ఆ తర్వాత ఆయన చేసిన సుఖదుఖాలు, బాంధవ్యాలు ఆయనకు చాలా పేరు తెచ్చిపెట్టాయి. నటనలో అద్భుతమైన ఈజ్ ఉన్న నటుడు దొరికాడని ఇండస్ట్రీ మురిసిపోయింది.
Ads
ఎనభై దశకంలో చిరంజీవి లాంటి హీరోలు వచ్చేసిన తర్వాత కూడా చంద్రమోహన్ హీరోగా చేస్తూనే వచ్చారు. విశ్వనాథ్, బాపు లాంటి కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వచ్చిన దర్శకులకు చంద్రమోహన్ ఒక వరంగా కనిపించేవారు. విశ్వనాథ్ తీసిన అనేక చిత్రాల్లో చంద్రమోహన్ కీలక పాత్ర పోషించడం వెనుక ఉన్న విషయం అదే. దర్శకుడి అంతరంగాన్ని ఎరిగి నటించే నటుడాయన.
దర్శకుడు విశ్వనాథ్ తో బంధుత్వం ఉంది చంద్రమోహన్ కు. విశ్వనాథ్ గారి తండ్రి సుబ్రహ్మణ్యం గారి మొదటి భార్య చంద్రమోహన్ పెద్దమ్మగారే. అలా విశ్వనాథ్ చంద్రమోహన్ కు అన్నగారు. అలాగే గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతోనూ చుట్టరికం ఉంది. బాలు చంద్రమోహన్ కు తమ్ముడు వరస అవుతాడు. అది కూడా తన తల్లి వైపు నుంచీ వచ్చిన చుట్టరికమే అంటాడు ఆయన.
ఇండస్ట్రీకి వచ్చాక తెల్సిన విషయం అయినప్పటికీ ఇద్దరికీ విడిగా బ్రదర్స్ లేకపోవడంతో వీరిద్దరి మధ్యా బంధం పెరిగింది. అది ఎంత దాకా వెళ్లిందంటే ఇద్దరూ పక్కపక్కనే ఇళ్లు కట్టుకునేదాకా … అయితే దర్శకుడు విశ్వనాథ్ మీద నటుడు చంద్రమోహన్ కు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. ఆయన తను నటించి చూపించడంతో నటుడి స్వేచ్చ తగ్గిపోతుందని .. అందరూ విశ్వనాథ్ లాగా నటించాల్సిన పరిస్థితి వస్తుందనేది ఆయన ప్రధాన కంప్లైంటు.
అది పక్కన పెడితే … చంద్రమోహన్ సరసన నటించే కొత్త హీరోయిన్ ఎవరైనా ఇండస్ట్రీని దున్నేస్తారనే సెంటిమెంట్ ఆ రోజుల్లో బలంగా ఉండేది. హీరో పాత్రల నుంచి తండ్రి పాత్రలకు చాలా తేలిగ్గా షిఫ్ట్ అయిన చంద్రమోహన్ అక్కడా తనదైన ప్రత్యేకత చాటారు. తనతో సహ కథానాయకుడుగా నటించిన చిరంజీవికి తండ్రిగా కూడా చేసి తన నట వైదుష్యాన్ని నిరూపించుకున్నారు.
కళాతపస్వి కాశీనాధుని విశ్వనాథ్ దర్శకత్వంలో చంద్రమోహన్ చేసిన చిత్రాలన్నీ విజయవంతమైనవే. చంద్రమోహన్ నటించిన చిత్రాలు ఫెయిల్ అయి ఉండచ్చుగానీ…నటుడుగా ఆయన ఫెయిల్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఆత్మీయులు లాంటి చిత్రాల్లో విలన్ తరహా పాత్రలు కూడా చేసి తనకు నటనే ప్రధానం తప్ప ఫలానా పాత్రే చేయాలనే పట్టింపులు లేవని ప్రకటించారు.
ఒక రకంగా తమిళ సినిమా రంగంలో కమల్ హసన్ ఏ తరహా మార్పుకు నాంది పలికారో…తెలుగు పరిశ్రమలో చంద్రమోహన్ కూడా అలాంటి పాత్రనే నిర్వహించారు. కోలీవుడ్ లో అందరు దర్శకులతో పనిచేసిన నటుడు మరొకరు కనిపించరు. బిఎన్ రెడ్డితో ప్రారంభించి బాలచందర్, బాపు, విశ్వనాథ్, జంద్యాల, మణిరత్నం తదితర క్రియేటివ్ దర్శకుల చిత్రాల్లో చంద్రమోహన్ హీరోగా చేశారు.
నట దర్శకురాలు విజయనిర్మల దర్శకత్వం వహించిన దాదాపు అన్ని చిత్రాల్లోనూ చంద్రమోహన్ కీలకు పాత్రలు చేశారు. ఏ తరహా పాత్రకైనా చంద్రమోహన్ అయితే న్యాయం చేయలగడనే కాన్ఫిడెన్స్ తో చంద్రమోహన్ ను ఎప్రోచ్ అయ్యేవాళ్లమని విజయనిర్మల ఇటీవలే గుర్తు చేసుకున్నారు. నిజానికి ఎఎన్నార్ తొలిరోజుల్లో జగ్గయ్య ఏ తరహా పాత్ర నిర్వహించారో దాదాపు అలాంటి బాధ్యతలనే తర్వాత తరం హీరోల చిత్రాల్లో చంద్రమోహన్ నిర్వర్తించారు.
చంద్రమోహన్ నటనను రంగుల రాట్నంలో చూసిన ఎస్వీరంగారావు ఫిదా అయిపోయి … ఒక్క అడుగు ఎత్తుంటే ఇండస్ట్రీని దున్నేసేవాడు అన్నారు. అనడమే కాదు తన బాంధవ్యాలులో దాదాపు హీరో పాత్ర ఇచ్చి ప్రోత్సహించారు.
చంద్రమోహన్ పోషించిన టిపికల్ కారక్టర్లలో శుభోదయంలో పనిదొంగ పాత్రను ప్రముఖంగా చెప్పుకోవాలి. బద్దకానికి నిలువెత్తు నిర్వచనంలా కనిపించే పాత్రలో చంద్రమోహన్ నటన అద్భుతంగా పేలింది. తమిళ్ లో భాగ్యరాజ్ హీరోగా చెలరేగిన టైమ్ లో ఆయన కారక్టర్లను తెలుగులో చంద్రమోహన్ చేసి ప్రేక్షకులను మెప్పించారు.
వరసగా ఐదారు సినిమాలు అలా తెలుగులో రూపొంది విజయవంతం అయ్యాయి. వాటిలో బాపు రాధాకళ్యాణం కూడా ఒకటి. బాపు రమణల రెండో చిత్రం బంగారు పిచ్చుకలో చంద్రమోహన్ చేసిన బంగార్రాజు పాత్ర ఆ స్థాయిలో పోషించడం అప్పటి కుర్రహీరోలకే కాదు…ఇప్పటివారికీ ఛాలెంజే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిన్న సినిమాలతో పెద్ద విజయాలు అందుకున్న ప్రతి సందర్భంలోనూ చంద్రమోహనే ఆయన పక్కన ఉండేవారు. పదహారేళ్ల వయసు…సత్యభామ లాంటి చిత్రాల విజయం వెనుక చంద్రమోహన్ కృషి చాలానే ఉంది.
చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదులో హీరో చంద్రమోహనే. ఒక మూగ చెవిటి పనివాడిగా చంద్రమోహన్ నటన ఉన్నత శిఖరాలకు ఎక్కింది. తను పనిచేసే కామందు భార్యతో తనకు అక్రమ సంబంధం అంటకడుతూ కొట్టినప్పుడు చంద్రమోహన్ నటన అత్యంత సహజంగా ఉంటుంది…
Share this Article