*************************
ప్రచారం: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత అభివృద్దిలో హైదరాబాద్ దేశంలోనే “నంబర్-1”
వాస్తవం: ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సాధించిన అభివృద్దికన్నా, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ది దిగజారింది.
Ads
*************************
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్ర పాలకుల వ్యతిరేకత మొదటి నుండీ హైదరాబాద్ నగరం చుట్టే తిరిగేది. హైదరాబాద్ నగరం అభివృద్దిలో తమపాత్ర ఉందనే కన్నా, తమ వల్లే హైదారాబాద్ నగర అభివృద్ది జరిగిందని ఆంధ్రా పాలకులు చెప్పుకోవడం తెలంగాణ ప్రజలకు మింగుడుపడేది కాదు. తమవల్లే అభివృద్ది చెందింది కాబట్టి, ఒకవేళ రాష్ట్ర విభజన అనివార్యమైతే, హైదరాబాద్ నగరంపై తమకుకూడా హక్కు ఉండాలని ఆంధ్రా పాలకుల వాదనగా ఉండేది.
***********************
హైదరాబాద్ అభివృద్దిపై ఆంధ్రా పాలకుల వాదనలను విద్యుత్ రంగ అభివృద్ది ప్రాతిపదికగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జెయెసీ (టీజాక్) బలంగా తిప్పి కొట్టింది. హైదరాబాద్ నగరం వందేళ్ల క్రితమే దేశంలోనే అద్భుతమైన విద్యుదీకరణ సాధించిన మొదటి నగరాలలో ఒకటిగా ఉందనీ, అప్పట్లోనే అత్యాధునికతగల సాంకేతికతను హైదరాబాద్ లో ప్రవేశపెట్టారనీ, పరిశ్రమల అభివృద్ది కోసం ప్రత్యేక విద్యుత్ లైన్లు, ప్రత్యేక సబ్ స్టేషన్లను 1920 దశకంలోనే వేశారనీ, అప్పటికే కట్టిన పవర్ ప్లాంట్లు, సబ్ స్టేషన్లు, ఆధునాతన విద్యుత్ మీటర్లు, బిల్లింగ్ విధానాలు ఇంకా అనేక ఆధారాలతో హైదరాబాద్ వందేళ్ల క్రితమే సాధించిన అభివృద్దిని మొత్తం ప్రపంచానికి విద్యుత్ ఉద్యోగుల జెయెసీ చాటిచెప్పింది.
నిజానికి హైదరాబాద్ లో ఎలక్ట్రిసిటీ బోర్డ్ 1910లోనే స్థాపించారు. ఆ తరువాత 17 సంవత్సరాలకుగానీ అప్పటి ఆంధ్ర ప్రాంతం ఉన్న మద్రాస్ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ బోర్డ్ స్థాపించారు. ఈ ఆధారాలను బయట పెట్టిన తరువాత హైదరాబాద్ నగరాన్ని తామే అభివృద్ది చేశామని చెప్పటానికి ఆంధ్రపాలకులు సాహసించలేదు.
************************
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత హైదరాబాద్ నగర అభివృద్ది ఎలా వుందో చూద్దాం….
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత హైదారాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుందనీ, ప్రపంచం నలుమూలలనుండి తెలంగాణకు పరిశ్రమల పెట్టుబడుల ప్రవాహం భారీగా పెరిగిందనీ, దాంతో లక్షలాది యువతకు ఉపాధి కల్పించగలిగామనీ, అభివృద్దిలో హైదరాబాద్ దేశంలో అగ్రగామి నగరంగా దూసుకుపోతున్నదనీ తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నది. మాటలలో ఆంధ్రా పాలకులను మించి ప్రచారం చేసుకుంటున్నది.
************************
ఉమ్మడి రాష్ట్రంలో – ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగర అభివృద్ది:
హైదారాబాద్ నగర అభివృద్ది అంటే ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ది జరిగి ఉండాలి. హైదారాబాద్, రంగారెడ్డి జిల్లాలు తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్‌పిడిసిఎల్)లో ఉన్నాయి. కాబట్టి ఎస్‌పిడిసిఎల్ పరిధిలో పారిశ్రామిక విద్యుత్ వినియోగ తీరుతెన్నులు తెలంగాణ ఏర్పడక ముందు, తరువాత ఎలా ఉన్నాయో చూద్దాం.
2013-14 ఆర్ధిక సంవత్సరాంతానికి, అంటే మార్చ్ 31, 2014 నాటికి ఎస్‌పిడిసిఎల్ పరిధిలో పారిశ్రామిక వినియోగం 8636 మిలియన్ యూనిట్లు. తెలంగాణ ఏర్పడ్డ 8 ఏళ్లకు, 2021-22 లో ఎస్‌పిడిసిఎల్ పరిధిలో పారిశ్రామిక విద్యుత్ వినియోగం 12759 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే ఎనిమిదేళ్ళలో పరిశ్రమల వినియోగం 47.70% పెరిగింది.
ఇక 2005-06 లో ఎస్‌పిడిసిఎల్ పరిధిలో పారిశ్రామిక వినియోగం 4938 మిలియన్ యూనిట్లు. 2013-14 సంవత్సరంలో 8636 మిలియన్ యూనిట్లు, తెలంగాణ ఏర్పడక ముందు 8 ఏళ్లలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పారిశ్రామిక వృద్ది 74.90%.
*************************
తెలంగాణ సాధించుకున్న 8 ఏళ్లలో, ఎస్‌పిడిసిఎల్ కంపెనీ పరిధిలో పారిశ్రామిక వృద్ది రేటు 74.90% నుండి 47.70%కు పడిపోయింది.
అంటే, హైదరాబాద్ ప్రాంత వృద్ది రేటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దిగజారిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నవి.
హైదరాబాద్ నగర అభివృద్ది పై, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఉద్యోగ కల్పనపై ప్రభుత్వ వాదనల్లోని డొల్లతనాన్ని ఇవి బట్టబయలు చేస్తున్నవి.
కనీసం ఆంధ్ర పాలకులు సాధించిన అభివృద్దిని కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ప్రభుత్వం కొనసాగించలేదని మనకు తేటతెల్లం అవుతున్నది.
*************************
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టిజేఏసి)
*************************
Share this Article