మిత్రులు చెబుతున్నట్టు… గెలవడం కోసం గాకుండా… ఇంకెవరినో ఓడించడానికి మాత్రమే బరిలో ఉంటాయి లెఫ్ట్ పార్టీలు… అదేమంటే ఎత్తుగడలు, వ్యూహాలు అని బోలెడు పడికట్టు పదాలు చెబుతారు ఆ నాయకులు… కలిసి పోరాడటం, సొంతంగా ఎదగడం ఏనాడో మరిచిపోయి… నానాటికీ బలహీనపడుతున్నా పంథాలు మారవు… ఆ నాయకులు మారరు… కొత్తతరం రాదు, కొత్త నాయకత్వాన్ని రానివ్వరు… ముసలి నాయకుల చేతుల్లో ఆ పార్టీలు మూలుగుతున్నాయి…
ఒకప్పుడు ప్రభ వెలిగిన లెఫ్ట్ పార్టీల ఇప్పటి పరిస్థితి ఏమిటి..? ఆ బెంగాలీ అడ్డాలో ఇప్పుడు కానేవాడే లేడు… త్రిపుర ఏనాడో మటాష్… ఒక్క కేరళ మిగిలి ఉంది… అన్ని లెఫ్టులూ కూటమి గట్టిన బొంత అది… దేశమంతా ‘రైట్’ సైడ్ నడుస్తుంటే, కేరళ ప్రభుత్వం ‘లెఫ్ట్’ బాటలో ఉంటుంది… వర్తమానానికి వస్తే… బీజేపీని బూచిగా చూపించి, ఎవరో మెయిన్ పార్టీకి తోకపార్టీగా మారిపోవాలని, ఆ పెద్ద పార్టీలు ఏమైనా ముష్టి వేయకపోవు అని ఆశగా చూడటం…
మొన్నమొన్నటిదాకా అంతే కదా… ప్రగతిభవన్ వైపు ఆశగా చూసీచూసీ, పెద్ద దొరవారు లైట్ తీసుకునేసరికి… భంగపడి, ఇంకెవరిని బతిమాలాలో తెలియక మళ్లీ ఆ కాంగ్రెస్ వైపు చూశారు… ఆ ముష్టికి కూడా డిమాండ్… అన్ని సీట్లు కావాలి, ఇన్ని సీట్లు కావాలి, ఇవే కావాలి… పాత కాంగ్రెస్ కాదు కదా… ఎహెపో అని దులిపేసుకుంది… సీపీఐకి గత్యంతరం లేదనే ఆత్మప్రబోధం బాగా అర్థమై ఒక సీటుకు, తరువాత ఇస్తారో లేదో తెలియని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రాజీపడిపోయి, ఎర్రజెండాను కాంగ్రెస్ స్థంభానికి కట్టేసింది…
Ads
సీపీఎంకు తత్వం బోధపడలేదు… 18 సీట్లలో (ఝ?) పోటీ… సీపీఎం ఒక పంథా… సీపీఐ మరో పంథా… మాటిమాటికీ అందరూ చెబుతుంటారు, ఆ రెండు పార్టీలు కలవాలని… కలిసే గుణముంటే అన్ని చీలికలు, పీలికలు ఎందుకయ్యేవి..? పోనీ, బలమున్న స్థానాల్లోనే పూర్తిగా కాన్సంట్రేట్ చేయక అన్ని స్థానాల్లో పోటీ ఎందుకయ్యా అంటే..? ఓడించడానికి అట…! ఎవరిని..? బీజేపీని..! హహ… ఫాఫం, అదే లేవలేని దుస్థితిలో ఉండి, ఆ బీఆర్ఎస్ కరుణ కోసం, కేసీయార్‌కు మళ్లీ అధికారాన్ని అప్పగించడం కోసం తనంతట తనే బోలెడు సూసైడల్ స్టెప్స్ వేస్తుంటే, దాన్ని అడ్డుకోవడానికి ఎర్రజెండాలు కావాలా..?
ఇదంతా ఒకెత్తు… ఒంటెద్దు పోకడతో తనే అన్ని స్థానాల్లో పోటీచేస్తోంది కదా… మాకు మద్దతు ఇవ్వరా, సిగ్గు లేదా అని ప్రజాపంథా పార్టీని విమర్శించాడు సీపీఎం పెద్ద మనిషి రాఘవులు… తమను బలపరచకుండా బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేక శక్తులకు మద్దతునిస్తోందని ఆ విమర్శ సారాంశం… మరి కాంగ్రెస్‌కు మద్దతునిచ్చే సీపీఐ చేసేదీ అదే పని కదా… పోనీ, వామశక్తుల ఐక్యపోరాటం దిశలో సీపీఎం చేసిన ప్రయత్నం ఏముందని..? (తెలంగాణ ఉద్యమాల దగ్గర నుంచీ సీపీఎం ఒంటెద్దు పోకడే కదా… తెలంగాణ సమాజానికి పూర్తి వ్యతిరేకమే కదా…)
ప్రజాపంథా కార్యదర్శి రంగారావు ఈ విమర్శలకు దీటుగా దులిపేశాడు… అసలు ఇన్ని స్థానాల్లో పోటీచేస్తున్నందుకు బీఆర్ఎస్ ఆర్థికసాయం చేస్తుందనే ప్రచారం జరుగుతోంది, దానికి జవాబు చెప్పు అని నిలదీశాడు… కాంగ్రెస్ గెలవకుండా… ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలడానికి బీఆర్ఎస్ సీపీఎంను ఈ స్థానాల్లో ఎగదోస్తోందట… వావ్… చివరకు ఈ స్థితికి చేరామన్నమాట మనం… కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా, పొత్తుకు రాకుండా, ఒక్క సీటూ ఇవ్వకుండా దూరం పెడితే… అవసరమైతే నాలుగు పైసలు పారేస్తాం, ఆ సీట్లలో అలాగే బలంగా నిలబడండి అని బీఆర్ఎస్ చెబితే, కిక్కుమనకుండా ‘అధికార పార్టీ’ అడుగులకు మడుగులొత్తుతోందా..? ఇదేనా మీ విమర్శల సారాంశం కామ్రేడ్ రంగారావు…?
మొత్తానికి తెలివి అంటే బీఆర్ఎస్‌దే…!! జాతీయ పార్టీల్లో కోవర్టులు… గెలిచాక జంపడానికి ముందుగానే కనుసైగలు, కేంద్ర అధికార పార్టీతోనే గుప్తస్నేహం… చివరకు సెటిలర్ల వోట్లు చీల్చడానికి పవనుడి ఎంట్రీ… ఇదుగో లెఫ్ట్ నిర్వాకాలు… మొత్తానికి పైసలతో ప్రజాస్వామ్యం… ఈ ధీమాతోనే కదా, ప్రతిపక్షాల మొత్తం ప్రచారఖర్చు భరించడానికి రెడీ అన్నది… ఇంత సాధనసంపత్తి ఎలా వచ్చాయి..? అంతా ఓ బ్రహ్మపదార్థం…!! అన్నట్టు, బీజేపీని ఓడించే శక్తీ సీపీఎంకు మాత్రమే ఉందనే వ్యాఖ్యను వెంటనే వెనక్కి తీసుకోవాలి కామ్రేడ్ రాఘవులూ… తప్పు, అంత సీన్ లేదులే గానీ… తనను తాను ఓడించుకునే శక్తి ఒక్క తెలంగాణ బీజేపీకే ఉంది… అవునూ, మాట్లాడితే బీజేపీతో బద్ద వైరం చూపిస్తారు కదా… ఇద్దరూ కలిసి ఆ బీఆర్ఎస్ కోసమే కదా ‘‘పోరాడేది’’…
Share this Article