పార్ధసారధి పోట్లూరి ……… ముప్పేట దాడి అనే పదం ఒక విశేషణంగా వాడుతుంటాము, ఇప్పుడు ప్రత్యక్షంగా పాకిస్థాన్ ముప్పేట దాడిని అనుభవిస్తున్నది! పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన పైలట్ ట్రైనింగ్ బేస్ మీద జరిగిన ఉగ్రదాడి ఒక్కటి చాలు వాళ్ళ నిస్సహాయత గురుంచి చెప్పడానికి! పాకిస్థాన్ తన పౌరులకి పాస్పోర్ట్ జారీ చేయలేకపోతున్నది ప్రస్తుతం!
నవంబర్ 3వ తేదీన పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్న మెయిన్వ్వలి (Mainwali) శివార్లలో ఉన్న MM ఆలం ఎయిర్ బేస్ మీద శుక్రవారం తెల్లవారుఝామున ఉగ్రవాదులు దాడి చేసి మొత్తం 14 విమానాలని పూర్తిగా ధ్వంసం చేయడమో లేదా పనికిరాకుండా చేయడమో జరిగింది. మరో 34 మంది ఎయిర్ ఫోర్స్ బేస్ కాపలా సైనికులని కూడా చంపేశారు!
దాడి జరిగిన మరుసటిరోజు కేవలం 4 F-7 (చైనా తయారీ) లని మాత్రమే నష్టపోయామని పాకిస్థాన్ కి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ (ISPR) ఒక ప్రకటనలో తెలియచేసింది! 4 జెట్స్ కూడ సర్వీస్ నుండి రిటైర్ అయినవే అని తెలిపింది!
Ads
ఆయేషా సిద్దికా : సీనియర్ ఫెలో , డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ స్టడీస్, కింగ్స్ కాలేజ్, లండన్. ఆయేషా సిద్దికా నేరుగా ISPR అధికారులతో ఫోన్ లో మాట్లాడగా మొత్తం 14 విమానాలు నష్టపోయినట్లు తెలిపారు. మరో 34 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్లు ఒప్పుకున్నారు! కానీ విషయం బయటకు రానివ్వద్దని కోరారు! కానీ ISPR ప్రకటనకి పాక్ లోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తలకు పొంతన లేదు.
పాక్ మీడియాలో 18 జెట్లు, 45 కి పైగా సైనికులు చనిపోయినట్లు చెపుతున్నాయి! అయితే తెల్లవారుఝామున ఎయిర్ బేస్ మీదకి దాడికి వచ్చింది 7 గురు సభ్యుల బృందం! వాళ్ళు చంపింది 45 మంది సైనికులని, 18 జెట్లని ధ్వంసం చేయగలిగారు అంటే వాళ్ళ దగ్గర అధునాతన ఆయుధాలు, నైట్ విజన్ గాగుల్స్, హై ఎక్స్ప్లోజివ్స్ ఉండి తీరాలి !
2020 లో అమెరికన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో వదిలి వెళ్ళిన ఆయుధాలలో రాత్రిపూట చూడగలిగే నైట్ విజన్ గాగుల్స్ ఉన్నాయి. అలాగే హై ఎక్స్ప్లోజివ్స్ కూడా ఉన్నాయి. పటిష్టమైన భద్రత ఉండే ఎయిర్ బేస్ మీద దాడి చేసి అదీ 15 నిముషాలలో ఆపరేషన్ పూర్తి చేశారు ఉగ్రవాదులు. కానీ 45 నిమిషాల దాకా కాల్పుల శబ్దం వినపడుతూనే ఉంది అని ఎయిర్ బేస్ దగ్గర ఉన్న ప్రజలు లోకల్ మీడియాతో చెప్పారు!
దాడి చేయడానికి వచ్చిన ఉగ్రవాదులలో ఇద్దరిని ఎయిర్ బేస్ లోనే కాల్చి చంపాయి పాక్ భద్రతా దళాలు! దాదాపు అరగంట సేపు చీకట్లో తమ వారి మీదనే కాల్పులు జరిపి చంపేసాయి పాక్ భద్రతా దళాలు! ఉగ్రవాదుల దగ్గర నైట్ విజన్ గాగుల్స్ ఉండడం వలన పని తొందరగా ముగించి వెళ్లిపోయారు! దాడి మొదలవగానే విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో చీకట్లో చూడగలిగారు ఉగ్రవాదులు!
దాడి చేసింది మేమే అని తెహ్రిక్-ఈ-జిహాద్ పాకిస్థాన్ (TJP) ప్రకటించింది! తెహ్రిక్ – ఈ- తాలిబన్ పాకిస్థాన్ (TTP) అనుబంధ సంస్థ TJP. తాలిబన్లు 2020 లో అధికారంలోకి వచ్చాక పాకిస్థాన్ ISI తాలిబన్ల అధికారం చెలాయించగలిగింది కొన్నాళ్ళు! 2021 లో ISI కి తాలిబన్ల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో మా పాలన మేము చేసుకుంటాము మీ జోక్యం అవసరంలేదని తెగేసి చెప్పారు తాలిబన్లు!
అదే సమయంలో తన అనుబంధ సంస్థలకి ఆదేశాలు ఇచ్చారు మీ లక్ష్యాలు ఏమున్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టమని! మధ్య ఆసియాలో (ఇరాన్) తాలిబన్ ని విస్తరించడం వాటిలో ఒకటి కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పాకిస్థాన్ ని మొదటి లక్ష్యంగా చేసుకున్నారు!
అలా అని తాలిబన్లు నేరుగా పాకిస్థాన్ మీద దాడి కోసం పథక రచన చేయట్లేదు! TTP, TJP లని ప్రోత్సహిస్తున్నది! ఆఫ్ఘనిస్థాన్ లో ఉంటున్న తాలిబన్ నాయకుల కుటుంబాలు పాకిస్థాన్ లో ఉంటున్నారు ఇప్పటికీ! పాక్ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ నేరుగా తాలిబన్ల మీద ఆరోపణలు చేయట్లేదు!
అలాగే 17 లక్షల మంది ఆఫ్ఘన్ పౌరులని దేశం నుండి వెళ్లగొట్టడానికి కారణం వాళ్లలో ఎవరు TTP, TJP కి సహకరిస్తున్నారో కనిపెట్టడం కష్టంగా మారింది పాక్ ఇంటెలిజెన్స్ కి. 17 లక్షల మంది అదనంగా వచ్చి చేరడం తాలిబన్ కి భారమే! TTP, TJP గ్రూపులకి ఇది నచ్చలేదు.
********************
ఉగ్ర గ్రూపులు- రాజకీయ బంధం!
పాకిస్థాన్ లో మొదటి నుండి ఉగ్రవాద గ్రూపులు అక్కడి రాజకీయ పార్టీల గొడుగు కింద ఉంటూ వస్తున్నాయి! అలా జరగకపోతే అది ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్ ఎలా అవుతుంది? నవంబర్ 3న MM ఆలం ఎయిర్ బేస్ మీద దాడి చేసిన TJP ఉగ్ర సంస్థకి ఇమ్రాన్ ఖాన్ తో సన్నిహిత సంబంధం ఉంది! అఫ్కోర్స్ TJP మాతృ సంస్థ TPP తో కూడా మంచి స్నేహం ఉంది!
తాలిబన్లలో గుడ్, బాడ్ తాలిబన్లు ఉంటారని ISI విశ్లేషణ! ఈ తరహా విశ్లేషణలతో ISI తో పాటు పాక్ పౌర ప్రభుత్వం కూడా ఆత్మవంచన చేసుకున్నాయి! ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్న సమయంలో ISI చీఫ్ గా లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్ ఉన్నాడు. ఇమ్రాన్ ఖాన్, ఫయాజ్ హమీద్ కలిసి TTP ని దగ్గరగా చేరదీశారు, ఎందుకంటే TTP GOOD తాలిబన్ అన్నమాట!
ఇమ్రాన్, ఫయాజ్ కలిసి TTP కి ఎంత చనువు ఇచ్చారంటే TTP నాయకులు ముఖ్యమయిన ప్రభుత్వ కార్యాలయాలలో స్వేచ్ఛగా తిరిగేంతగా!
ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నసమయంలోనే TTP ముందు ముందు తమ దాడికి అనుకూలంగా ఏవేవి ఉన్నాయి, వాటికి రక్షణగా ఎంతమంది ఉంటున్నారు, డ్యూటీ మారే సమయాలు, లైట్స్ ఎప్పుడు వేస్తున్నారు లాంటి కీలక డాటా సేకరించిపెట్టుకున్నారు! ఇమ్రాన్ ప్రధాని పదవి నుండి దిగిపోగానే అవినీతి ఆరోపణల మీద పోలీసులు అరెస్ట్ వారెంట్ తో వచ్చినప్పుడు ఇమ్రాన్ ఖాన్ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడి పోలీసులను ఆపింది TTP తీవ్రవాదులే!
ఎయిర్ బేస్ మీద దాడి చేసిన బృందంలో ఇద్దరు అక్కడే చనిపోగా మిగిలినవాళ్ళని పంజాబ్ దక్షిణ ప్రాంతంలో సింధ్ సరిహద్దుల్లో సైన్యం కాల్చిచంపింది. దాడిలో పాల్గొన్న వాళ్ళు అందరూ ఇమ్రాన్ ఖాన్ దగ్గరికి చేరదీసిన TTP సభ్యులు అని సైన్యం గుర్తించింది! ఎయిర్ బేస్ కి రక్షణ బాధ్యత వహిస్తున్న అధికారి చాలా కాలంగా తమకి థర్మల్ ఇమేజింగ్, నైట్ విజన్ గాగుల్స్ కావాలని అడుగుతూ వచ్చాడు కానీ అధికారులు పట్టించుకోలేదు! కానీ TTP, TJP ఉగ్రవాదుల దగ్గర అవి ఉన్నాయి!
పాస్పోర్ట్ కి ఉపయోగించే లామినేషన్ పేపర్ కొరత వలన పాక్ తన పౌరులకి పాస్పోర్ట్ జారీ చేయడం నిలిపివేసింది! ఫ్రాన్స్ కి చెందిన సంస్థ లామినేషన్ పేపర్ సప్లై చేస్తుంది కానీ గత రెండేళ్ల నుండి బిల్లులు చెల్లించకపోవడంతో ఫ్రాన్స్ సంస్థ సరఫరా నిలిపివేసింది. పాకిస్థాన్ కి చెందిన విద్యార్థులు విదేశాలలో పలు యూనివర్సిటీలకి ఉన్నత విద్య కోసం అప్ప్లై చేశారు.. స్టూడెంట్ వీసా కూడా వచ్చింది కానీ పాస్పోర్ట్ లేకపోవడంతో వీసా గడువు ముగిసింది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ లో ఉన్నత విద్య అభ్యసించిన విద్యార్థులు విదేశాలలో ఏదో ఒక చిన్న ఉద్యోగంలో అయినా సరే చేరి అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు తప్పితే పాకిస్థాన్ తిరిగి రావడానికి ఇష్టపడడం లేదు.
********************
పాకిస్థాన్ సైన్యం పాత్ర!
పాక్ సైన్యం రాజకీయ జోక్యం చేసుకోకుండా బారక్స్ కే పరిమితం అయితేనే పాక్ పరిస్థితి బాగుపడుతుంది! 1947 నుండి ఇప్పటివరకు సైన్యం ఇష్ట ప్రకారమే అక్కడ ప్రధాని ఎన్నుకోబడుతూ వస్తున్నారు కానీ సైన్యం జోక్యం లేకుండా ఎన్నికలు జరిగింది లేదు. ప్రస్తుత పాకిస్థాన్ పరిస్థితికి సైన్యమే కారణం! ఇమ్రాన్ ఖాన్ ని ప్రధానిని చేయడానికి పోలింగ్ బూత్ దగ్గర కాపలాగా సైనికులని పెట్టి రిగ్గింగ్ చేసి గెలిపించింది!
మళ్లీ అదే సైన్యం ఇమ్రాన్ ని దించేసి జైల్లో పెట్టింది! ఇమ్రాన్ ఖాన్ క్రూడ్ ఆయిల్ కోసం రష్యా వెళ్లి పుతిన్ ని కలవడం వల్ల ఈరోజు జైల్లో ఉన్నాడు!
అమెరికా ఆదేశాల వల్లనే సైన్యం ఇమ్రాన్ ని జైల్లో పెట్టింది! పోనీ అమెరికా ఏవన్నా సహాయం చేసిందా? లేదు. సైన్యానికి ముందుచూపు లేకవడమే ఇప్పటి స్థితికి కారణం!
పాకిస్థాన్ ప్రజలలో 60% ఒక పూట మాత్రమే భోజనం చేయగలుగుతున్నారు! కానీ 4 అత్యాధునిక సబ్మెరైన్లు కొనడం కోసం డాలర్లు ఉన్నాయి ! Fighters have the right to get Lion’s share! పాకిస్థాన్ ఇప్పటి పరిస్థితిని చూసి భయపడాల్సింది మనమే! ఏదో ఒక రోజు సరిహద్దుల దగ్గర లక్షలాది పాక్ ప్రజలు మన దేశమ్ లోకి చొరబడడానికి ప్రయత్నించవచ్చు! ఆ రోజు రాకుండా ఉండాలి అని కోరుకుందాం!
Share this Article