Bharadwaja Rangavajhala…. షేక్స్ పియరూ … తెలుగు సినిమా….. విలియమ్ షేక్స్ పియర్ అనే పేరు మనకు బాగా సుపరిచితమే. ఆయన పుట్టి నాలుగు వందల సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ … ఇప్పటికీ తెలుగునాట నాటకాలతోనూ, సినిమాలతోనూ సంబందబాంధవ్యాలు నెరిపే ప్రతి ఒక్కరికీ ఆ పేరు నోట్లో నానుతూనే ఉంటుంది.
ఆయన రాసిన సీజర్ , క్లియోపాత్రా లాంటి నాటకాల్లోని సన్నివేశాలు ఇప్పటికీ అనేక సినిమాల్లో కనపబడుతూనే ఉంటాయి. ప్రపంచ నాటక సాహిత్యం మీద సినిమా మీదా షేక్స్ పియర్ వేసిన ముద్ర సామాన్యమైనది కాదు. అందుకు తెలుగు సినిమాల్లో మన దర్శకులు తీర్చిదిద్దిన కొన్ని సన్నివేశాలు చూస్తే అర్దమౌతుంది.
వి.మధుసూధనరావు దర్శకత్వంలో సుందర్ లాల్ నహతా నిర్మించిన వీరాభిమన్యు చిత్రం తెలుగు వారందరికీ గుర్తుండే ఉంటుంది. చాలా పెద్ద విజయం సాధించిందీ చిత్రం. అందులో క్లైమాక్స్ లో అభిమన్యుడిని చంపే సన్నివేశం ఒక్కసారి గుర్తు చేసుకోండి. అభిమన్యుడు పడిపోయి ఉంటాడు. అతని ముఖం మీదుగా చంపిన వారందరి పంచల అంచులూ ఎగురుతున్నట్టు చూపిస్తారు.
Ads
అదే సన్నివేశంలో కర్ణుడు కూడా అభిమన్యుడిని వెనుక నుంచే పొడుస్తాడు. అప్పుడు అభిమన్యుడి డైలాగు… నువ్వు కూడానా కర్ణా అని వస్తుంది. ఈ డైలాగు వినగానే … జూలియస్ సీజర్ లో యుటూ బ్రూట్ అనే డైలాగు భళ్లున మన మెదళ్లలో మెరుస్తుంది. నిజానికి మహాభారతం అనే ఓ పూర్తి భారతీయ పౌరాణిక గాధను సీజర్ తరహాలో చిత్రీకరించాలని మదుసూధనరావుకు ఎందుకు అనిపించింది అన్నది ప్రశ్న.
వి.మదుసూధనరావు కమ్యునిస్టు రాజకీయాల నుంచీ సినిమాల్లోకి వచ్చారు. ఆయన కొంత కాలం విజయవాడలో పిల్లలకు ఇంగ్లీషు ట్యూషన్లు చెప్పిన దాఖలా ఉంది. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి ఆయన విద్యార్ధే అనుకుంటాను. ఆ తర్వాత విఎమ్మార్ సినిమా ప్రవేశం చేసిన తర్వాత కూడా మురారి ఆయన దగ్గర కొంత కాలం అసిస్టెంటుగా పనిచేశారనుకోండి.
ఈ విషయాల ఆధారంగా మదుసూధనరావుకు సీజర్ నాటకం , సినిమా బాగా ఎక్కేశాయనుకోవాలి. ఆ ప్రేరణతో ఆయనకి మహాభారతం సన్నివేశాలు కూడా అదే ధోరణిలో కనిపించాయన్నమాట. ఈ సీజర్ నాటకాన్నే కాదు దీంతో పాటు రోమియో జూలియట్, ఒథెల్లో, కింగ్ లియర్ లాంటి అనేక నాటకాలు రాసి ప్రపంచ రంగస్థలానికి సాహిత్య భిక్ష పెట్టిన విలియమ్ షేక్స్ పియర్ జన్మించి నాలుగు వందల సంవత్సరాలౌతోంది. ఆ సందర్భంగానే తెలుగు సినిమా మీద షేక్స్ పియర్ ప్రభావం మీద ఓ సారి గుర్తు చేసుకుందాం.
ఇందాక మనం మాట్లాడుకున్న వీరాభిమన్యు దర్శకుడు వి.మధుసూదనరావే తీసిన మంచి కుటుంబంలో షేక్స్ పియర్ రోమియో జూలియట్ నాటకాన్ని నృత్యరూపకంగా వాడారు. పూర్తి ఇంగ్లీషులోనే నడుస్తుందా ముక్క. ప్రేమించుట పిల్లల వంతూ అంటూ సాగే పాట మధ్యలో వస్తుందిది.
తెలుగులో వచ్చిన అనేక సూపర్ హిట్ ప్రేమకథాచిత్రాలకి రోమియో జూలియట్టే ఇన్సిపిరేషన్. దేవదాసు పార్వతి, లైలా మజ్నూ, రోమియో జూలియట్ ఈ త్రయం ప్రతి కుర్రాడికీ అత్యంత దగ్గర బందువులయ్యారు. రోమియో జూలియట్ అనే ఒక ప్రేమ జంట ఫిక్షన్ అంటే నమ్మలేనంతగా చారిత్రక పాత్రలుగా మారిపోయాయి. అవే కాదు షేక్స్పియర్ పాత్రలన్నీ అలాంటి ముద్ర వేసినవే. ఇక ఆయన రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ప్రేరణతో ఎన్ని సినిమాలొచ్చాయో లేక్కలేదు.
ఒక ఫార్సు ద్వారా ఓ హాస్యభరిత చిత్రాన్ని పుట్టించడం అనే పద్దతిని నాలుగువందల సంవత్సరాల క్రితం షేక్స్ పియర్ ప్రపంచానికి రుచి చూపించాడు. ఇప్పటికీ చాలా మంది హాస్యనట రచయితలు అదే బాటలో పయనిస్తున్నారు. దక్షిణాదిన కమల్ హసన్ , సింగీతం శ్రీనివాసరావులు ఈ పద్దతిని భారీగా కొనసాగించిన వారు.
పొలిటికల్ డ్రామాలు రాసేవాళ్లు కూడా సీజర్ ను దాటి వెళ్లిన సందర్బాలు తక్కువే. సీజర్ నాటకం ఏ స్థాయిలో తెలుగు జనాలకు ఎక్కేసిందో ఇందాక చెప్పిన వీరాభిమన్యు సంఘటన ద్వారా అర్ధం అయ్యింది కదా. 1564 సంవత్సరం ఏప్రిల్ నెల్లో షేక్స్ పియర్ జన్మించాడు. నాటకాల మీద అనురక్తి తోనే 1585 ప్రాంతాల్లో లండన్ చేరాడు. అక్కడ కింగ్స్ మెన్ అనే సంస్ధ భాగస్వామిగా మారి విలాసవంతంగా జీవించాడు.
కొన్ని నాటకాలు తనే స్వయంగా రాశారు. ఇంకొన్ని భాగస్వాములతో కలసి రాశారు. ఇలా ఆయన రాసిన నాటకాలన్నీ మూడు విభాగాలుగా విభజించవచ్చు. అందులో మొదటిది హాస్య ప్రధాన నాటకాలు. ఇవన్నీ ఆయన తొలి రోజుల్లో రాసినవే. తర్వాత దశలో షేక్స్ పియర్ చారిత్రాత్మక, విషాదాంత నాటకలు రాయడానికి ఎక్కువ ప్రాదాన్యత ఇచ్చేవారు.
అయితే తను ఏం రాసినా అందులో తనదైన ముద్ర ఉండేది. అదే ఆయన పేరును ఒక బ్రాండ్ గా మార్చింది. నాటకం వేయాలన్నా రాయాలన్నా మూడున్నర శతాబ్దాలుగా విలియం షేక్స్ పియరే ప్రేరణ. భారతదేశంలోనూ ఆయన ప్రేరణతో నాటక కర్తలైన వారు అనేనకమంది ఉన్నారు. జీవితపు చరమాంకంలో షేక్స్ పియర్ ట్రాజిక్ కామెడీలు రాశాడు. ఇది మహత్తరమైన ప్రక్రియ.
షేక్స్ పియర్ మరణించిన నూటయాభై సంవత్సరాల తర్వాత ప్రజల్లో ఆయన రాసిన నాటకాల మీద అనుమానాలు పొడసూపడం మొదలయ్యింది. మరి ఇన్ని రచనలు చేయడం ఒక కవికి సాధ్యమా? అనే అనుమానం నుంచీ షేక్స్ పియర్ పేరుతో చలామణీ అవుతున్న రచనలన్నీ ఆయనే చేయలేదనే వాదన ముందుకు వచ్చింది. దాదాపు ఇదే పరిస్థితి భారతదేశంలో కాళిదాసుకీ ఉంది.
కాళిదాస విరచిత నాటకాలన్నీ ఒక్కకాళిదాసే రాయలేదనే వాదన మనదగ్గరా ఉంది. అయితే షేక్స్ పియర్ గురించి ఒక్క మాట మాత్రం చెప్పుకుని తీరాలి. ఆయన రచనలు తెలుగు రంగస్థలం మీద వేసిన ప్రభావం అసామాన్యం. అలాగే తెలుగు సినిమా మీదా ఆయన ప్రభావం తక్కువదేం కాదు.
నిజానికి ఆత్రేయ లాంటి రచయితలు ప్రవేశించే వరకు తెలుగు నాటకాలనూ సినిమాలనూ ప్రభావితం చేసింది షేక్స్ పియరే. నాటక రంగంలోనూ, సినిమా రంగంలోనూ కూడా జండా ఎగరేసిన సముద్రాల , పింగళి లాంటి రచయితలు షేక్స్ పియర్ ను అద్భుతంగా అనుకరించేవారు. షేక్స్ పియర్ రాసిన విషాదాంత నాటకం కింగ్ లియర్ ఆధారంగా గుణసుందరి అనే పేరుతో ఓ పెద్ద కథ రాశారు. దాన్ని చక్రపాణి చందమామలో ప్రచురించారు. రచయిత పేరు నాగేంద్ర అని ఉంటుంది. దాన్నే తర్వాత రోజుల్లో గుణసుందరి కథ పేరుతో సినిమా తీశారు.
ఇంగ్లీషు నాటకానికి సంబంధించి షేక్స్ పియర్ ది ఒక సాంప్రదాయం అయితే ఆయన తర్వాత వచ్చిన ఇబ్సెన్ ది మరో తరహా. వాహినీ బ్యానర్ లో గుణసుందరి కథ తర్వాత కె.వి.రెడ్డి డైరక్ట్ చేసిన పెద్దమనుషులు చిత్రం ఈ ఇబ్సెన్ రాసిన పిల్లర్స్ ఆఫ్ సొసైటీ అనే నాటకం ఆధారంగానే తీశారు. ఇలా ఇంగ్లీషు నాటకాల ప్రేరణతో సినిమా రచన చేయడం అనేది సముద్రాల పింగళి రోజుల్లో బలంగానే ఉండేది.
కింగ్ లియర్ ఆధారంగా గుణసుందరిని కల్పించిన పింగళే … అల్లా ఉద్దీన్ అద్భుతదీపం ఆధారంగా పాతాళభైరవినీ కల్పించారు. విజయపతాకం ఎగరేశారు. ఇలా ఇంగ్లీషు నాటకాల ప్రేరణతో రూపుదిద్దుకున్న తెలుగు సినిమాల జాబితాలో బాపుగారు తీసిన కృష్ణావతారం కూడా ఉంది. ఈ సినిమా కథ కె.ఎన్.టైలర్ ది. అసలు దాని స్వరూప స్వభావాలను అద్భుతంగా మార్చి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చి వావ్ అనిపించారు ముళ్లపూడి. ఇలా ఆధునిక నాటక సినిమా రూపకాలకు దిశానిర్దేశం చేసిన విలియమ్ షేక్స్ పియర్, షేక్స్ పియర్ లాంటి రచయితలు ఎప్పటికప్పుడు కొత్తగా జన్మిస్తూనే ఉంటారు.
Share this Article