Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నిండా మునిగిన మల్లన్నసాగర్ నిర్వాసితుల శాపమేనా…? కామారెడ్డికి వలస…!!

November 15, 2023 by M S R

Gurram Seetaramulu …… మల్లన్నసాగర్ రిజర్వాయరు వెనక ఎనిమిది గ్రామ పంచాయతీలు, ఆరు శివారు గ్రామాల మట్టిమనుషుల కన్నీళ్లు ఉన్నాయి. కొందరివి ఇంకిన కన్నీళ్లు. ఇంకొందరివి ఆగిన గుండెలు. మాయం అయిన మాయి ముంతలు. గడప గడపకు పూజలు అందుకున్న వనదేవతలు. వనదేవతలు వలపోతతో వలసెల్లి పోయాయి. నోరు లేని గుడులు బడులు మట్టిపొరల్లో చరిత్ర శిధిలాల కింద మాయం అయ్యాయి.

ఎవరైనా రాస్తే అది చరిత్ర. మర్చి పోతే అది మట్టి దిబ్బ. అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కొండపోచమ్మ గౌరవెల్లి. మల్లన్న సాగర్. ఎంపిక బాగానే ఉంది. ఆ నీళ్ళ కింద కనుమరుగు అయిన మట్టి దిబ్బల కింద ఎన్ని పోచమ్మ, మారెమ్మ, ముత్యాలమ్మ, కట్ట మైసమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ గుడులు ఉన్నాయో. నువ్వు రాళ్ల సొరికలో ఉన్న కొమరెల్లి మల్లన్న…

యాదగిరి గుట్టను AC గదులతో యదాద్రి చేసినంత సింపుల్ కాదు. నీకు యాదాద్రి ఓ రియల్ దందా. తరాలుగా మొక్కిన బండరాయిని పునర్నిర్మాణం చేయడం నీ తరం కాదు. పదహారు వేల ఎకరాల భూమి వ్యవసాయ అటవీ భూమి మాయం అయ్యింది. ఆరేడు నెలల కింద రేమిల్ల అవధాని (సీనియర్ జర్నలిస్ట్ హిందూ) కాల్ చేసారు, తాను మెదక్ సంగారెడ్డిలో పనిచేసే కాలంలో మల్లన్న సాగర్ మీద చేసిన ఫీల్డ్ రిపోర్ట్స్ పుస్తకంగా వేస్తున్నా అని నేను ఫేస్‌బుక్‌లో రాసుకున్న నోట్ తన పుస్తకంలో వేసుకుంటా అని నా అనుమతి అడిగారు. వీలుంటే ఇంగ్లీష్ చేసి ఇవ్వమన్నారు.

Ads

నలభై ఏళ్ళ అనుభవం ఉన్న అతనికే ఆ అనువాదం లొంగలేదు. నేనూ చేయలేకపోయా. Reservoirs Of Silence : A Journalist’s Chronicle of Unheard Voices. కేవలం నూటా పదిహేను పేజీల ఈ చిన్న పుస్తకానికి SrinivasKandlakunta ముందుమాట రాసారు. ఎక్కడో కోనసీమలో పుట్టిన అవధాని గడిచిన నలభై ఏళ్ళుగా హైదరాబాద్ నే అంతిమ స్థావరం చేసుకున్నాడు. తాను ఎరిగిన కన్నీళ్లను, చూసిన కడగండ్లను రాసే క్రమంలో ఎంత యాతన పడ్డాడో…

కాసుల సత్యనారాయణ శర్మ వేముల ఘాట్ లో ఐదు తరాలుగా అక్కడ పూజారులు. బడి పంతులు, తన పదవీ విరమణతో వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కట్టుకున్నాడు. బహుశా ఆ ఊరు ఖాళీ చేయాల్సిన చివరి ఇల్లు… చివరి సారి తన గుడిని చూసుకుని విస్తాపితుడిగా మరో ఇల్లు, గుడి కోసం వెతుకులాడుతూ…

అన్ని కొంపలు కూల్చి, నీళ్ళతో ఉరి పోసిన కెసిఆర్ ఎందుకో గజ్వేల్ వదిలి కామారెడ్డి వలస బోతున్నాడు. కారణం కెసిఆర్‌కూ కూలిన దర్వాజలకూ ఎరుక. ఇదే ఆ పోస్ట్

వంచిత చెక్కిలి మీద రాలిన ప్రతి కన్నీటి బొట్టు నీ చరిత్రను చెత్త కుప్పలో వేసే రోజు రావొచ్చు. ఇవ్వాళ అందరూ మల్లన్న సాగర్ నీళ్లను చూసి పరవశించి పోతున్నారు. కానీ ఆ నీళ్ల వెనక ఎన్ని కన్నీళ్లు ఉన్నవో, కొల్పోయిన ఆనవాళ్లు ఉన్నవో నాకు దగ్గరగా తెలుసు. పోయేదేమీ లేదు అనుకోడానికి వాడు బండరాయి కాదు . ఇంతేలే నా గతి అనుకోవడానికి వాడి సేవ చచ్చి పోలేదు . ఒక నిష్క్రమణ మరొక విస్ఫోటనాన్ని ఇవ్వొచ్చు.

కొన్ని వేల మంది నిర్వాశితులు అయ్యింరు . వాళ్ళు తాతలు, తండ్రులు, ఆడుకున్న జ్ఞాపకాలు, శిధిలం కాబోతున్న బాధాకరమైన సందర్భం ఇది , మల్లన్న సాగర్ వాళ్ళ బొందలగడ్డలు కూడా మిగల్చ లేదు; ఎన్ని తరాలు ఆ నేలమీద ఆకలి, కష్టం, సుఖం , దుఖం, కలబోసుకొని ఉండొచ్చు. ఎన్ని తరాలు ఆ మట్టితో సంభాషించి ఉండొచ్చు. నాలుగేళ్ళు కొలువు జేసీ కిరాయికి ఉన్న ఇల్లు వదిలి పోతుంటేనే మొన్న యాతన అనిపించింది. చదివిన బడి ఒదిలి పోతుంటేనే వలపోత ఆగదు.

తాతలు, తండ్రులు, అయ్యలు, పురుళ్ళు, పుణ్యాలు, దినాలు, కొత్తగా పెళ్ళయిన పెళ్లి కూతురు ఊరొదిలి పోలిమేర దాటి ఓసారి ఊరికి దండం పెట్టి అవ్వా అయ్యలను వదలలేక, పొలిమేర గుండు మీద తలకాయ పెట్టిన వెతల కథలు ఎన్ని మాయం అయిఉండొచ్చు కొమరెల్లి మల్లన్న సాక్షిగా ? దునికే నీళ్ల సవ్వడి వెనక కేరింత చూసే వాళ్ళు కొందరు పూడ్చిన ఆనవాళ్ల ఒక్కో రెక్కా విరిసి మంటల్లో మాడుస్తున్నారు .

ఎంత చరిత్ర ఆనవాళ్ళు కోల్పోయి ఉంటుంది ఆ నీళ్ల కవ్వం వెనక. అభివృద్ధి పేరుతో ఆనకట్టలు కట్టి ఊళ్లకు ఊళ్ళే మాయం అవుతుంటే ఎక్కడ బొడ్రాయి ? ఎక్కడ పొలిమేర గుండు ? మల్లన్నసాగర్‌లో మాయం అయి ఇల్లు కూలిన ఒక గిరిజన విద్యార్థి నాకు దగ్గరగా తెలుసు. ఈ మధ్య నన్ను కలవడానికి వచ్చాడు. రాబోయే రోజుల్లో నేను అతన్ని కలవకపోవచ్చు. ఆ ఊరు వదిలి వచ్చే రోజు నాకు వీడ్కోలు చెప్పడానికి వచ్చిండు. వచ్చిన డబ్బుతో ఒక బైక్ కొనుక్కుండు…

కొత్త ఇల్లు , పొలం కూడా… ఇన్ని ఉన్నా ఊరు లేని ఐశ్వరం ఎందుకు సర్ అని గుక్క పట్టి ఏడ్చిండు. ఉన్న గుడిసె కూల్చి నీకు భవంతి కట్టాను, సుఖంగా ఉండు అంటే సహించడానికి అది అరిగే అన్నం కాదు. మన ఎముకుల్లో మజ్జ కదా? కోల్పోయిన ఆనవాళ్లు ఒక్కో ఊరు జ్ఞాపకాల గుండె గనుల్ని తవ్వు కుంటున్నాయి . వాళ్ళకు మట్టి తెలుసు కనుకే కోల్పోయిన మమత తెలుసు, ప్రేమ తెలుసు, ఏ లెక్కలు వాడి కుండను పగలగొట్టినవో, ఏ కూడికలు వాని కలలను కూల్చినవో, ఏ కొట్టి వేతలు వాని దూలాన్ని ఇరిచినవో.

ఊళ్లకు ఊళ్ళు ఉసిళ్ల దండులాగా వెంటపడి తరుముతున్న యమభటుల లాఠీ దెబ్బలతో బూట్ల పద ఘట్టనల నడుమ చెల్లాచెదరయ్యారు. మనకు కనబడని విధ్వంసాలు ఎన్నో జరిగాయి. పారే నీళ్ళను చూసి పారవశ్యంతో చేసే మన పులకరింతలకు ఆ నీళ్ళలో ఎంతో మంది కన్నీళ్లు ఉంటాయనే ఎరక మనకు ఉండదు. ఒక నిర్వాసిత రైతు తన తాతల నాటి నుండి సంక్రమించిన ఇంటిని బలవంతంగా ఖాళీ చేయమని అడిగితే, ఇంటి కలప మొత్తాన్ని ఒక దగ్గర పేర్చి, అదే కలపతో చితి పేర్చుకుని కాల్చుకుని సచ్చిపోయిన మల్లారెడ్డి బలవంతపు నిష్క్రమణ యాదికి వచ్చింది. మల్లారెడ్డి లాంటి వంచిత బ్రతుకుల ఆయువు ఆవిరై పోయింది. ఇంకా గుండె పగిలి చనిపోయిన ఆనవాళ్ళు నమోదు కావాల్సే ఉంది…

నిజాలు చెప్పేందుకు ఏ కంఠాలు మూగబోయినవో ? విడమర్చి రాసేందుకు ఎన్ని కలాలు కుదవ బెట్టబడినవో ? వియోగం చూపించేందుకు ఎన్ని టీవీలు కాసులు మింగినవో ? కాలం లెక్కలు వేసే ఉంటది… ఆట నీకు సైదోడు కావొచ్చు, పాట నీకు సాగిలపడిపోవచ్చు, రాత తన సిగ్గు లజ్జను నీ కాళ్ళ కాడ సాక బొయొచ్చు. మేధావి నీకు గులాము కావొచ్చు. కొల్పోయిన వాడికి నోరు లేవకపోవచ్చు. ఒకవేళ అడిగినా అధికార మదంతో బలవంతంగా నోరు మూయించవచ్చు. కానీ చరిత్ర చెక్కిలి మీద రాలిన ప్రతి కన్నీటిబొట్టు నీ చరిత్రను చెత్త కుప్పలో వేసే రోజు రావొచ్చు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions