Yanamadala Murali Krishna…….. పెత్తందార్లని… పేదల కోసం ఉన్నామనే నాయకులు వెనకేసుకొని రావడం ఏమిటో!? ఆ ఒక్క శాతంలో ఉండాలని 99 మందిలో అనేకమంది ప్రయత్నం చేస్తారు.
ఆర్థికంగా వెసులుబాటు ఉండి, తరాలుగా ప్రైవేట్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్న కోట్లాదిమంది కొరగాకుండా పోయినట్లే… ప్రస్తుతం ప్రభుత్వ బడులలో ఇంగ్లీష్ నేర్చుకునే పేదలు / సామాన్యుల పిల్లలు కూడా కొరగాకుండా పోతారు అనుకుందాం… అది వారి ఎంపిక… జన బాహుళ్యపు ఆకాంక్షలను / ఎంపికలను… వాళ్ళు తెలివిలేని వాళ్ళు కాబట్టి అలా పోతున్నారు అనడం… మేధో దురహంకారం. వాస్తవాలను విస్మరించి – మరుగు పరచి వాదనలు చెయ్యడం… వ్యతిరేకించడం కోసమే గుడ్డి వాదన చేయడం… పేదల బాధలను కూడా… స్థితిమంతుల బాధలుగా చెప్పేసుకుని బాధ పడిపోవడం అవసరం లేదేమో…
మాతృభాష నేర్చుకోవడం అంటే నిత్య జీవనానికి అవసరమైనంత మేరకు రాయడం, మాట్లాడడం వరకేనా…? లేక ప్రపంచ స్థాయి సాహితీ సృజనకు అవసరమైనంత మేరకా…? మేధావులం అనుకొనబడే మనం చేసే సముద్రమంత చర్చ కన్నా పిడికెడంత ఆచరణ మేలు అనే చట్రంలో చూసుకుంటే… మన పిల్లలు లేదా మనుమలు ఏ మీడియంలో చదువుతున్నారు? 50 – 60 సంవత్సరాల వయసు వారు మేము తెలుగు మాధ్యమంలోనే చదివాము… వృత్తి వ్యాపకాలలో గొప్పగా రాణిస్తున్నాము అని చెప్పకండి…
Ads
విదేశాలలో ఉద్యోగాలలో గతంలో కన్నా తెలుగువారి నిష్పత్తి పెరిగిందా లేదా? ఇటీవలి సంవత్సరాలలో విదేశీ కొలువులలో చేరిన తెలుగువారిలో ఇంగ్లీష్ మాధ్యమం నుండి వచ్చిన వారు ఎక్కువ మందా? తెలుగు మీడియం నుండి వచ్చిన వారు ఎక్కువ మందా? అవును, సామాన్యులు మెరుగైన జీవన ప్రమాణాల కోసమే చదువుకోవాలనుకుంటారు… రోజువారి వ్యవహార భాష కోసం ఇక్కడే ఉండేవారు ప్రత్యేకంగా సాంకేతిక చదువులకి, పై చదువులకి పోనక్కర్లేదు.
భాషాపరమైన మైనారిటీలుగా ఉండే ముస్లింలు, జైన్సు తమ ఇళ్లలో తమ భాషలను మాత్రమే మాట్లాడుకుంటూ పరిరక్షించుకుంటూ… ఇంగ్లీష్ మీడియంలో / తెలుగు మీడియంలో చదువుకున్నప్పటికీ… వాళ్ళ భాష – సంస్కృతులను నిలబెట్టుకొంటూనే వున్నారు. ప్రకృతిలో మార్పు అనేది శాశ్వతం. ఇంకేదీ కాదు. ప్రతిదీ మారుతూ ఉంటుంది. భాష నాలుగు కాలాలు మన గలగాలంటే… కాలంతోపాటు అనగా కొత్త తరాలతో పాటు పయనించాల్సిందే…
తెలుగు భాషను నేటి తరం సొంతం చేసుకోవాలంటే అక్షరాలని తగ్గించాలి అనే సూచన ఇటీవల కొందరు నుండి వినవచ్చింది. వినియోగంలో లేని వాటిని వదులుకుంటూ పోవాలి. ప్రకృతి చేసేది కూడా అదే. పిడివాదంతో ఉపయోగం ఉండదు. కేవలం కొద్దిపాటి భాషావేత్తల మధ్య మాత్రమే అది నడుస్తుంది. ప్రస్తుతం జరగాల్సిన చర్చ ఇంగ్లీష్ మీడియం చెడ్డది, తెలుగు మీడియం కావాలి అనేది కాదు… తెలుగు భాష పరిపుష్టికి, సంస్కృతి పరిరక్షణకు ఏ రకంగా ముందుకు పోవాలి అనేది…
Share this Article