Bharadwaja Rangavajhala…….. మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ అంటూ అందాలరాముడు బావురుమనే గీతం సినారే రాశారన్జెప్పితే … శానామందిరి బాపాభిమానులు యాయ్ … అద్రాసిందారుద్రరా అనేశారు. అంటే ఏంటీ? నమ్మకం … బాపు రమణల సిన్మాలో ఆరుద్రే రాస్తారని ఫిక్స్ అయిపోయారు. అంతగా తమ ఆడియన్సుకు ఆరుద్రను మప్పేశారాళ్లిద్దరూనూ … ఇది కరెస్టు. అంచేత అలా కోంపడ్డారన్నమాట …
ఇలాంటప్పుడే సహనం కోల్పోకూడదు .. నీ జ్హానాన్ని ప్రదర్శించడానికి తాపత్రయపడడం అంటే అవతలివారి జ్ఞానాన్ని చులకన చేయడం … అంచేత అవతలివారు అలా ఎందుకన్నారు అనేది చూసుకుని … ఉంటుంది ప్రతిదానికీ కారణం ఉంటుంది. దాన్ని తెల్సుకుని … వారికి చెప్పాల తప్ప ఠాఠ్ అని మీదడిపోకూడదు …
అట్టా పడ్డం అంటే … నాయనా .. అది భగమంతుడ్ని తూలనాడినంత పాపం అన్జెప్పారు కదా మా గురువుగారు. అంచేత … నేన్జెప్పొచ్చేదంటే … బాపు రమణల సిన్మాల్లో ఆరుద్రతో పాటు చాలా మందిరి పాటల్రాశారనే … వారు ప్రేమగా రాయించుకున్న ఇంద్రగంటి శ్రీకాంతశర్మ ఉన్నారు. గౌరవ భక్తి భావనలతో పని జరిపించుకున్న గుంటూరు శేషేంద్ర శర్మ ఉన్నారు. వీరు కాక దాశరథి, కొసరాజు, సినారే, వేటూరి సుందర్రామమూర్తి , జాలాదీలతో పాటు కొద్దిగా సీతారామశాస్త్రి ఇలా మరికొందరున్నారు.
Ads
ఇది మనం ఒప్పుకుని తీరాల్సిన విషయం. ఇక పోతే … బాపు రమణలు ఆరుద్రతో ఎక్కువ కంఫర్ట్ గా ఫీలయ్యేవారు అన్న మాట అదేదో సిన్మాలో రావుగోపాల్రావు చెప్పినట్టు నూటికి నూరుపైసల నిజం. కంఫర్ట్ గా ఫీలవడం వెనకాతల ఓ కథుంది. తమ సినిమాల్లో పాటలు ఎలా ఉండాలో క్షుణ్ణంగా ఎరిగిన .. కొద్దో గొప్పో కవిత్వం చదువుకున్న రాయగల దమ్మున్న దర్శక రచయితలు బాపు రమణలు. ఈ విషయం ఒప్పుకుని తీరాలి … బాపు కవిత్వం ఆయన కార్టూనుల్లో కళ్లకు కడుతుంది. దాన్ని విడిగా వేసి అంటే బాపు కవిత్వం అన్జెప్పెహేసి వేసేసి అమ్మేసుకోవచ్చనుకోండి … అది వేరుసంగతి …
అది పక్కన పెట్టేస్తే … బాపు ఆల్సో కవి .. రమణగారసలు సాక్షాత్తూ కవే … అంచేత వారు తమ సినిమాల్లో పాటలకు సంబంధించిన రాజ్యాంగం తమకు పూర్తిగా తెల్సు కాబట్టి … సదరు కవులను పిల్చి కూర్చోబెట్టుకుని వారికి తమ హృదయం చెప్పి రాయించుకునేవారు. రమణ గారికి బాపుతో కల్సి సినిమాలు తీసేప్పుడు ఈ జబ్బు పట్టుకున్నది అనే మాట వాస్తవం కాదండి .. ఫ్రమ్ ది బిగినింగ్ ఉందాయనకి.
పాటల్రాసే కవులతో కూర్చుని గుసగుసగా మాట్లాడేస్తూ వాళ్ల బుర్రలు తీనేస్తున్నాడు రమణ అని ఓ సారి పద్మశ్రీ పుల్లయ్యగారికి కంప్లైంట్ వెళ్లింది రమణ గారి మీద. ఆయన పిల్చి ఏంటంత మొగోడివేంటి? ఊర్కే ఆళ్ల మీద పడి సంపేత్తన్నావంట, నీ పని డవిలాగులు కుట్టడం, అద్జూడు, మిగిలిన గోల నీకేలా? అన్నారట …
అదీ నిజమే అనుకోండి అయినప్పటికీ … రచయిత అనేవాడు … అంటూ రమణగారు చెప్పబోతుండగా అడ్డంగా అడ్డం పడిన పుల్లయ్యగారు … ఇదంతా కాదయ్యా … నువ్వు పాట రాయగలవా? అద్జెప్పసలు అని సీరియస్ అయ్యారు. దీంతో ఇజ్జత్ కా సవాల్ అనిపించిన రమణ గారు పాట రాయడం సో వీజీ, ఐ కెన్ అనేశాడు. అన్టమేమిటి? ప్రేమించి చూడులో మేడమీద మేడ కట్టి అంటూ పాట రాసి పుల్లయ్యగారితో నువ్వు రాయగలవు కనుకే ఆళ్ల మెదళ్లు తింటున్నావ్, ఐ అండర్ స్టాండ్ యు కెన్ గో అనిపించేసుకున్నారు …
అట్టా రమణ గారు ప్రూవ్డ్ కవి. ఇట్టా నడుస్తా ఉండగా … రోజులన్నీ ఒకేలా ఉంటే ఆ భగమంతుడికి గిట్టదు కనుక… దుక్కిపాటి మధుసూదనరావు గారికి ఓ సినిమా చేసే ఛాన్స్ తగిలింది బాపు రమణలకి. ఆ సినిమా పేరు పెళ్లీడు పిల్లలు. పాటల విషయంలో బాపు రమణల్లాగే దుక్కిపాటి వారికీ కొన్ని గోలలున్నాయ్ … వీళ్లెట్టా ఆరుద్రతోనూ సినారేతోనూ కంఫర్ట్ ఫీలవుతారో అట్టా వారు శ్రీశ్రీతోనూ ఆత్రేయతోనూ కంఫర్ట్ ఫీలవుతారన్నమాట. అట్టా పెళ్లీడు పిల్లలు పాటలన్నీ కూడానూ శ్రీశ్రీ యున్నూ ఆత్రేయున్నూ రాశారు.
అలవాటు చొప్పున వాళ్లిద్దరినీ ముఖ్యంగా ఆత్రేయను కాస్త సవరించబోయారు బాపు . అట్టాగే సంగీతం విషయంలోనూ బాపు గారికి గ్రిప్పు ఉంది. నిజానికి ఆయన మౌతార్గన్ ప్లేయరట. సినిమా ఆర్కెస్ట్రాలో ఓ నాల్రోజులు పన్జేసి, సదరు సంగీత దర్శకుడికి సంగీతం గురించి చెప్పి ఉద్యోగం ఊడి ఇవతల పడ్డ చరిత్ర ఉందాయనకి. ఇట్టా … తన సినిమాలకు సంగీతం చేసే మ్యూజిక్ డైరెక్టర్లతో పాటలకు ఏ రాగాలు వాడాల లాంటివన్నీ మాట్లాడేసేవారాయన పాపం…
భక్త కన్నప్ప అప్పుడు ఆదినారాయణరావుతో జ్ఞానపరమైన క్లాష్ రాకుండా సత్యం గారు ఆదుకున్నారని సాక్షాత్తూ బాపుగారే చెప్పారు కదా … అయితే పెళ్లీడు పిల్లల విషయానికి వస్తే ఆ సినిమాకు సంగీత దర్శకుడు ఎమ్మెస్ విశ్వనాథం. వారూ ఆత్రేయా కల్సి ఓ పాటను తయారు చేస్తూండగా బాపు గారు సహజంగా కలుగ చేసుకుని … ఏదో సవరణ చెప్పబోతే ఇద్దరూ కల్సి గసురుకున్నారట పాపం…
గసురుకోవడం అనేది బాపుగారు ఈ సందర్భాన్ని చెప్తూ వాడిన మాటే. ఆ విధంగా … ఏం జరిగిందీ అంటే ఎమ్మెస్వీ ఆత్రేయా కల్సి గసురుకుని తామనుకున్న పద్దతిలో పాటలు తయారు చేశారన్నమాట. ఏమీ అన్లేని పరిస్తితి … ఏమన్నా అందామంటే అవకాడ ప్రిన్స్ పాల్ గారేటంటారో అని ఓ చిన్న అనుమానం . అట్టా ఆరుద్రే కాదు బాపు రమణల కవులెవరూ పన్జేయని సినిమాగా పెళ్లీడు పిల్లలకు ఓ రికార్డు ఉంది.
అంచేతేటంటే … బాపుగారి సిన్మాల్లో ఆరుద్ర మాత్రమే కాదూ ఇంకా చానా మందిరి పాటల్రాశారూ అన్జెప్పడానికే తప్ప మనకెందుకండీ … పైగా బాపు రమణలకు ఇంకో ఈక్నెస్సుంది … ఎవురైనా పెతిబావంతుడు అనాళ్లకి గాని అనిపిస్తే నా సామిరంగా … ఆడు ఎవడు? ఎక్కడుంటాడు లాంటివేవీ పట్టించుకోకుండా, ఆళ్లింటికో ఫైన్ మార్నింగ్ ఎల్లిపోయి కాలింగ్ బెట్టు ఉంటే అదీ, లేకపోతే తలుపూ కొట్టేసి … వాళ్లని బైటకి లాగేసి వాళ్లు వీళ్లొచ్చారేంటనే కన్ఫూజనులో ఉండగానే .. ఆశీర్వదించి వచ్చేయడం అలవాటు.
అట్టా తూర్పువెళ్లే రైలు టైమ్ లో జాలాది కనిపించారు వీళ్లకి .. అంతే వారిని పిల్చి అందులో పాటలు రాయించుకున్నారు … కో అంటే కోయిలమ్మ కోకో తో పాటు ఇంకో పాటేంటదీ సందెపొద్దు అందాలున్నా చిన్నదీ … కూడాను, మిగిలినయి ఎటూ ఆరుద్రతోనే కానిచ్చేసుకున్నారనుకోండి … అలాన్నమాట .. అంచేత మరింక ఆట్టే మాట్లాడడం బొత్తిగా బాగోదు కనుక ఉంటా .. పైగా అవకాడ పనుండాది .. పోవాల పెస్తుతానికి బై …
Share this Article