“రాజకీయాల్లోకి వచ్చిన అమితాబ్ బచ్చన్ ఏం పీకాడు? చిరంజీవి ఏమయ్యాడు? రాజకీయాలనేవీ అందరికీ సరిపోవు. మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు కాబట్టి మాకు సరిపోయాయి”… ‘పవన్ కల్యాణా? అతనెవరో నాకు తెలియదు’… “మాకు మేమే స్టార్లం. సూపర్ స్టార్లం. వాళ్ళ వ్యాఖ్యలపై స్పందించి వాళ్ళని హీరోలని చేయవలసిన అవసరం లేదు”… అలగా బలగా జనాలని వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలను ఇప్పుడు చూస్తున్నాం మనం. అలగా బలగా పార్టీలు, సంకర జాతి పార్టీలు పుట్టుకొచ్చాయి”…
ఇవేనా బాలకృష్ణ గతంలో చేసిన వ్యాఖ్యలు..? మరి ఇప్పుడు… ‘‘పవన్ కల్యాణ్‌దీ నాదీ సేమ్ మనస్తత్వం… టీడీపీకి అండగా ఉంటున్నందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఙతలు… నేను కానీ, పవన్ కళ్యాణ్ కానీ ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడుతాం. మేం ఎవరికీ భయపడబోం. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోం…’’
అదే బాలయ్య బాబు గారూ… కాలం ఎప్పుడూ ఒకేరీతిన ఉండదు… నువ్వు పదే పదే చెప్పే డెస్టినీ అంటే ఇదే… ఆ రోజు రావాలే గానీ బ్లడ్డు బ్రీడు బాపతు అహం పూర్తిగా అడుగంటి, ఇదుగో ఇలాంటి ‘సమవ్యాఖ్యలు’ నోటి నుంచి వస్తాయి… నువ్వు చెప్పిన స్టారిజం పోతుంది… ఎదుటోడి స్టార్‌తనాన్ని అంగీకరించాల్సి వస్తుంది… అలగా పార్టీలే ఆపద్బాంధవుల్లా కనిపిస్తాయి… పదేళ్ళయినా ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేని ఆ నాయకుల్నే ఆలింగనం చేసుకోవాల్సి వస్తుంది…
Ads
గతంలో ఇదే బాలయ్య పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఏవేవో వ్యాఖ్యలు చేయడం, దానికి నాగబాబు వెటకారంతో కూడిన కౌంటర్లు ఇవ్వడం కనిపించేవి… ఇప్పుడు అదే బాలయ్య తన తెలుగుదేశం కండువా మీద పవన్ కల్యాణ్ ఫోటో ప్రముఖంగా కనిపించే జనసేన కండువా వేసుకుని, ఆ రెండు పార్టీల సమన్వయ సమావేశంలో కనిపిస్తున్న దృశ్యం అబ్బురంగానే ఉంది… కాలమెలా గిర్రున తిరిగి జవాబు చెప్పిందో చూశావా బ్రో…
బావ చంద్రబాబు మొన్నటిదాకా జైలులో… కక్షతో జగన్ పెట్టే కేసులు వరుసగా… ఇప్పటికే ఆరు కేసులు… మరోవైపు పదును తేలని అల్లుడు లోకేష్ నాయకత్వం… ఒక బెయిల్ వస్తే మరో కేసులో అరెస్టుకు జగన్ రెడీ… గత ఎన్నికల్లో మోడీని తిట్టిపోశాడుగా బావ గారు… ఢిల్లీ కూడా సైలెంట్… ఆదుకోవడానికి రాదు… ఏపీ రాజకీయాల్లో కేసీయార్ వేలు పెట్టడు… పైగా చంద్రబాబుకు ఏ సాయం చేసినా పాముకు పాలుపోసినట్టేననీ, ఇన్నాళ్లూ తెలంగాణ ద్రోహిగా తిట్టి, తెలంగాణ నుంచి తరిమి, మళ్లీ చంద్రబాబును హత్తుకోలేడు… మిగతా ఏ జాతీయ ప్రతిపక్షమూ చంద్రబాబుకు అండగా రావడం లేదు… ఈ స్థితిలో పాపం, పవన్ కల్యాణ్ ఒక్కడే తోడుగా కనిపిస్తున్నాడు…
సరే, చంద్రబాబు పట్ల పవన్ కల్యాణ్ కృతజ్ఞతకు కారణాలు ఏవైనా… ఈ కష్ట సమయంలో విడిచిపెట్టి పోలేదు… అలాగని జనంలోకి వచ్చి పెద్దగా ఉద్యమించిందీ లేదు… కాకపోతే జగన్ వ్యతిరేక వోట్లన్నీ కలగలపాల్సిన అవస్థ ఇప్పుడు చంద్రబాబుది… అది పవన్ కల్యాణ్‌కు ప్లస్ అయ్యింది… తప్పనిసరై బాలయ్యకూ పవన్ ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది… సోకాల్డ్ సినిమా ఇండస్ట్రీ గానీ, ఇదే ఎన్టీయార్ కుటుంబం గానీ చంద్రబాబు అరెస్టు మీద చేసింది లేదు, చేయగలిగింది కూడా ఏమీ లేదు… అందుకే ఆ దురుసు వ్యాఖ్యలు చేసిన నోటితోనే జై జనసేన అనాల్సి వస్తోంది… ఈ వీడియో, ఈ ఫోటో, ఈ వ్యాఖ్యలు చదువుతూ, చూస్తూ పవన్ కల్యాణ్ ఆనందిస్తూ ఉంటాడు…!!
Share this Article