పదవీ విరమణ జరిగిపోయింది… తరువాత నేను జరుపుకుంటున్న మొదటి దీపావళి ఇది… తలుచుకుంటుంటే నా గతం ఎంతో గర్వంగా ఉంది… నా సర్వీస్, ప్రత్యేకించి సీనియర్ పొజిషన్లలో నా కొలువు వైభవం పదే పదే గుర్తొస్తున్నది… దీపావళికి వారం ముందు నుంచే హడావుడి మొదలయ్యేది…
రకరకాల కానుకలు మా ఇంటిని ముంచెత్తేవి… స్వీట్లు, బాణాసంచా కూడా… వచ్చిన ప్రతి కానుకను మొదట ఓ గదిలో పెట్టేవాళ్లం… తీరా దీపావళి పండుగ నాటికి ఆ గది ఓ గిఫ్ట్ షాపులా అయిపోయేది… అంతగా కానుకలు వచ్చిపడేవి… కొన్ని నాకు అస్సలు నచ్చకపోయేవి… ఐనా శుభాకాంక్షలు తీసుకుని వస్తున్నాయి కాబట్టి వాటిని స్వీకరించకతప్పదు, వాటిని నాకు నచ్చని బంధువులకు ఇవ్వడానికి ఓ పక్కన పెట్టేవాడిని…
డ్రై ఫ్రూట్స్ మరీ ఎక్కువగా వచ్చేవి… మార్కెట్‌లో దొరికే ఖరీదైన డ్రై ఫ్రూట్స్ అన్నిరకాలవీ… బంధువులకు, స్నేహితులకు, పిల్లలకు ఇవ్వగా ఇంకా మిగిలిపోయేవి… మరి ఇప్పుడు..? పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి… ఆల్రెడీ మధ్యాహ్నం రెండు దాటిపోతోంది… దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ఒక్కరూ రాలేదు… ఆశ్చర్యంగా ఉంది నాకు…
Ads
ఒక్కసారిగా నా వైభోగంహఠాత్తుగా రివర్స్ అయిపోయిన తీరు నాకు నచ్చడం లేదు… చిరాకెత్తుతోంది… సోఫాలో కూర్చుని ఆరోజటి డెయిలీ పేపర్ తీసుకున్నాను… స్పిరిట్యుయల్ కాలమ్ దగ్గర నా చూపు ఆగిపోయింది… అందులో ఒక కథ… చదవడం స్టార్ట్ చేశాను… అంతకుముందు ఆ కథ నేనెప్పుడూ చదవలేదు… అసలు డెయిలీ పేపరే సరిగ్గా చదవకపోయేవాడిని, అంత టైమ్ దొరికేది కాదు… ఆ కథ ఓ గాడిదకు సంబంధించింది… అదేమిటంటే…
ఓ గాడిద… ఓసారి దానిపై ఓ దేవుడి విగ్రహాన్ని ఏదో ప్రార్థనల సమావేశం కోసమో, పూజ కోసమో తీసుకుపోతున్నారు… అది గ్రామంలో వెళ్తుంటే ప్రజలు ఆ విగ్రహానికి దండాలు పెట్టసాగారు… వంగి నమస్కరిస్తున్నారు… ప్రతి గ్రామంలోనూ ఇదే తీరు… మందలుమందలుగా జనం దండాలు… గాడిదలో ఆనందం…
ప్రజలంతా తనకే దండాలు పెడుతున్నారని అనుకోసాగింది… ఆ మర్యాదను సంతోషంగా స్వీకరించసాగింది… ఆ పూజాస్థలం వచ్చింది, విగ్రహాన్ని దింపేశారు… తిరుగు ప్రయాణంలో దాని యజమాని ఓ కూరగాయల బస్తాను దాని మోపున పెట్టాడు… కానీ ఈసారి ఎవరూ దాన్ని పట్టించుకోవడం లేదు… చూసీచూడనట్టు ఉన్నారు… గాడిదలో అసహనం… అరె, నన్నెవరూ పట్టించుకోవడం లేదేమిటి… ఇంత హఠాత్తుగా ఈ పరాభవం ఏమిటి అనుకుంది…
జనం దృష్టిని తన వైపు తిప్పుకోవడానికి గట్టిగా అరవసాగింది… ఆ శబ్దంతో చిరాకెత్తిన పలువురు గ్రామస్థులు దాన్ని తిడుతూ కొట్టారు… అది ఆ బాధతో మరింత అరుస్తోంది… అసలు నన్నెందుకు తిడుతున్నారో, ఎందుకు కొడుతున్నారో దానికి అర్థం కావడం లేదు… ఇదీ కథ…
అకస్మాత్తుగా నా జ్ఞానచక్షువులు తెరుచుకున్నాయి… నేనూ అలాంటి గాడిదనే, దానికీ నాకూ తేడా ఏముంది..? నాకు దక్కిన గౌరవాలు, వైభోగం నిజానికి నాకు కాదు, నావి కావు… నేను వెలగబెట్టిన ఆ సీనియర్ పోస్టులకు సంబంధించినవి… వ్యక్తిగా అవన్నీ నాకు లభించిన గౌరవమర్యాదలే అని ఇన్నాళ్లూ భ్రమపడ్డాను… నా భార్యను పిలిచాను…
‘చూశావుటోయ్, నిజంగా నేను ఓ గాడిదను… నిజమేమిటో ఇప్పుడు తెలిసొచ్చింది… ఎవరో విజిటర్స్ వస్తారని ఇక వెయిట్ చేయడం వేస్ట్, పద, నీతో కలిసి దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాను… ప్చ్, ఆమె నా మాటల్ని పెద్దగా లెక్కచేయలేదు… ‘నేను ఎన్నాళ్లుగానో ఇదే చెబుతున్నాను, మీరు వింటే కదా, నేను చెప్పేది తప్పు అనుకున్నారు… ఈరోజు ఎవరూ రాక, ఆ పత్రికలో ఆ కథ చదివాక గానీ మీ కళ్లు తెరుచుకోలేదు’ అనేసింది… నాకు మౌనమే దిక్కయింది…! (ఏదో పత్రికలో కనిపించిన ఓ ఇంగ్లిష్ కాలమ్‌కు నా స్వేచ్చానువాదం ఇది…)
Share this Article