Bharadwaja Rangavajhala……. సాధారణంగా సినిమాకు పోవాలంటే .. మరి చాలా సరుకులు సరంజామా ఉండాలి. సత్యన్నారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్ నుంచీ గేటు వైపు వెళ్తుండగా ఎడమ వైపుకి ఓ బేకరీ ఉండేది … కిసాన్ జామ్స్ వాడివే ఆ రోజుల్లో కిసాన్ బిస్కెట్లు ఉండేవి. ఏమి టేస్ట్ లెండి అవి.
తర్వాత తొంభైమూడులో ఆ కంపెనీ బ్రూక్ బాండ్ ఇండియా టేకోవర్ చేసేసిన తర్వాత బిస్కెట్ల తయారీ ఆపేశారు దరిద్రులు. ఇప్పుడది హిందూస్తాన్ లీవర్ లో ఏడ్చింది … అదెలా ఏడిస్తే నాకెందుకు బిస్కెట్ల తయారీ ఆపి చచ్చిన తర్వాత. అందుకే నాకు మల్టీనేషనల్స్ అంటే పగ… ప్రతీకారం తీర్చుకోవావాలి.
అసలు కె.ఎస్.ఆర్ దాస్, ఎస్.డి లాల్ లతో చెప్పి ఓ సినిమా తీయించాలనేది నా స్కీము. నాలా చిన్నప్పుడు కిసాన్ బిస్కెట్లు తినే కుర్రాడికి షడన్ గా వాడి ప్రొడక్షన్ ఆపేయడం వల్ల బుర్ర పన్జేయడం ఆగిపోతుంది. కోట్లు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయిస్తే బాగుపడతాడు… ఈ లోగా ఆస్తులు కరిగిపోతాయి. కొడుకిలా అయిపోయాడని తల్లిదండ్రులు మనోవేదనతో మంచమెచ్చుతారు.
Ads
అప్పుడు ఈ కుర్రాడు మన కుటుంబం ఇలా కావడానికి కారణమైన బ్రూక్ బాండ్ నూ హిందూస్తాన్ లీవర్ నూ చంపేస్తానని బయల్దేరి …. పెద్ద స్టాక్ బోకరై … యండమూరి వీరేంద్రనాథ్ నవలల్లో హీరోలూ హీరోయిన్లంత తెలివితేటలు ఒలకబోసి ఆ కంపెనీలను నాశనం చేసి …. వాటి యజమాని అయిన రావుగోపాల్రావును వీధిన పడేట్టు చేసి వాడి కూతుర్ని పెళ్లాడి … డ్యూయట్లు పాడి ఇట్టా ఓ సినిమా తీయించవచ్చు కూడా.
ఇలా కిసాన్ బిస్కెట్ ప్యాకెట్లు ఓ రెండో మూడో కొనుక్కుని సినిమాకు వెళ్లేవాళ్లం. ఆ తర్వాత రోజుల్లో కూడా సినిమా హాల్లో ఏం తినాలో అవన్నీ చేసుకుని వెళ్లేవాళ్లం. ఉదాహరణకు టైమ్ లేదనుకుంటే …. క్యారేజీలో పులిహోర పెట్టుకుని వెళ్లి సినిమా హాళ్లో తింటూ చూసిన రోజులున్నాయి. ఇడ్లీలు పట్టుకెళ్లి తింటూ చూసిన రోజులున్నాయి.
మనం ఏం పట్టుకెళ్లినా టిక్కెట్టు కొన్నామా లేదా అనేది తప్ప మరో విషయం పట్టించుకునేవాడు కాదు థియేటరోడు. మా అమ్మగారు మమ్మల్ని సినిమాకు తీసుకెళ్లే రోజుల్లో ఆవిడ పాలు కూడా తీసుకువచ్చేవారు. వక్కపొడి పోసుకునే స్టీలు డబ్బా ఉండేది మా ఇంట్లో … దాంట్లో వక్కపొడి వేరే ఎక్కడో పోసి, దాన్ని కడిగి అందులో పాలు పోసుకుని, రెండు గ్లాసులు తీసుకుని మరీ సినిమాకి బయల్దేరేది ఆవిడ. దాంతో పాటు కారప్పూసో చెగోడీలో ఉండేవి.
ఇవి తింటూ ఉండగా ఇంటర్వెల్ అప్పుడు గ్లాసులో పాలు పోసి ఇచ్చేది. ఎంత కడిగినా … ఆ పాలలో వక్కపొడి ఫ్లేవర్ కనిపించేది. దాంతో అదో విచిత్రమైన టేస్ట్ ఉండేవి. అది కూడా నాకు ఇష్టంగా ఉండేది. ఇల్లా సినిమా అంటే ఓ పిక్నిక్ లా … ఓ వనభోజనంలా ఉండేది .. స్నానాలు చేసి రీసెంట్ గా కుట్టించుకున్న బట్టలు తొడిగి బోల్డు పౌడర్ అద్దుకుని … ఓ రేంజ్ లో బయల్దేరి రిక్షా ఎక్కి ఈ సరకు సరంజామాతో సినిమా హాలు ముందు దిగుతుంటే … అహో … అన్నట్టుండేది.
అట్టాంటిది … ఇప్పుడు సీను సంపూర్ణంగా మారిపోయింది. బయట తిళ్లు లోపలికి అనుమతించబడవు అనే బాపతు సినిమా హాళ్లైపోయాయి అన్నీను. పోనీ లోపల తిందామా అంటే కొనే రేంజ్ లో ఉండవేవీనూ … పాప్ కారన్ అమ్ముకోడం కోసమే థియేటర్లు కట్టి సినిమా మాటున పాప్ కారన్ వ్యాపారం చేస్తున్నారా ఈ సినిమా వాడులు అనే అనుమానం నాకు చాలా సార్లు వచ్చింది.
కూల్ డ్రింకు తాగండి, ఉచితంగా వీడియోలో సినిమా చూడండి అని అప్పట్లో వీడియో పార్లర్లు వెలిసాయి కదా … అలా పాప్ కారన్ తినండి ఉచితంగా సినిమా చూడండి అన్నట్టు తయారైంది పరిస్థితి. అట్టా మొన్న ఏం తోచక … అమోఘానంద భారతీ స్వామితో కల్సి … జివికె లో ఏదో దిక్కుమాలిన సినిమాకి వెడితే … స్నాక్స్ సినిమా టిక్కెట్టుకు మూడింతలు అయ్యాయి. టైమ్ లేదు ఏదో ఒకటి లోపలే దినేద్దాం అనుకున్న పాపానికి …. దూలతీర్చేశాడు ఆ జీవికె సినిమా హాలు వాడు.
అందుకని ముందు మనం మల్టీనేషనల్స్ కు వ్యతిరేకంగా కంటే కూడా మల్టీ ప్లెక్సులకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉందని మాత్రం బలంగా అనిపిస్తోంది … ఈ మధ్య .. ఇప్పుడు బెజవాడ అలంకార్ థియేటర్ లో మొన్న వెళ్లినప్పుడు సినిమాకి వెడితే … కింద అలంకార్ బేకరీలో ఏవో తినుబండారములు కొనుక్కుని వెడితే వాడు ఎలో చేయలేదు. వాటికో తాడు కట్టి టోకెన్ ఇచ్చి వెళ్లేప్పుడు తీస్కెళ్లండి అన్నాడు. ఒళ్లు మండిపోయింది. మూడు కండెలు కొనుక్కుని అవి తింటూ హాయిగా సినిమాలు చూసిన అలంకార్ థియేటరేనా ఇది అని అనిపించి కడుపు మండిపోయిందనుకోండి …
కలియుగాంతం వచ్చేసింది కనుకే ఇలా పాప్ కారన్ అమ్ముకునే సినిమా హాళ్లు వచ్చాయి. ఇంతకీ ఈ విషయం బెమ్మంగారు చెప్పారా? పాపుకారన్ అమ్ముకునే సినిమా హాళ్లు వచ్చేను … సినిమా కంటే పాప్ కారనే ప్రియమయ్యెను అంటూ కాలజ్ఞానంలో రాశారో లేదో వెరిఫై చేయాలోసారి.
…
కాబట్టి కామ్రేడ్స్ … మల్టీ అనే పేరు ఎక్కడున్నా నడ్డిమీద చంపెయ్యాలి. మల్టీ స్పెషాల్టీ హాస్పటల్ అన్నా … మల్టీ ప్లెక్స్ అన్నా .. మల్టీ నేషనల్ కంపెనీ అన్నా సరే … జస్ట్ నడ్డి మీద దాడి కరో… బ్రాడ్ గా యాంటీ మల్టీ అనే ఓ ఆందోళన చేయగలిగితే .. విస్తృత ప్రజల మద్దతు కూడగట్టొచ్చనేది వామ అతివామ సెమీ వామ మిత వామ పార్టీలన్నిటికీ నా పిలుపు…
Share this Article