ఫేక్ ఫోటోలు, ఫేక్ పోస్టులు, ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రచారాలు ఇప్పుడు కామన్… వాటిమధ్య మన ఆలోచనలు ఇరుక్కుని ఏది నిజమో తెలియని దురవస్థల్లోకి నెట్టేయబడుతున్నాం… రాజకీయ పార్టీలైతే ఈ ఫేక్‌తనాన్ని ఓ ట్రెండ్‌లా మార్చేసి రకరకాల ఫేక్ పత్రికా వార్తల్ని, క్లిప్పింగులను సోషల్ మీడియాలో ప్రవేశపెడుతూ మనతో ఆడుకుంటున్నాయి… చూస్తున్నాం కదా, తెలంగాణ ఎన్నికల ప్రచారంలో ఫేక్ పోస్టులు ఎలా కలకలం సృష్టిస్తున్నాయో… అబ్బే, అవి మా వార్తలు కావు, మేం పబ్లిష్ చేయలేదు, మా టీవీ చూపించలేదు అంటూ సదరు వార్తాసంస్థలు మొత్తుకుంటూ వేరే వివరణ ప్రకటనలు జారీచేయాల్సి వస్తోంది… ఈలోపు ఆ ఫేక్ స్టోరీలు విస్తృతంగా జనంలోకి వెళ్లిపోయి, షేర్లతో ఫేక్ క్రియేటర్లు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది… ఇవీ పొలిటికల్ సోషల్ జిత్తులు…
ఈమధ్య ఫేస్‌బుక్‌లో పదే పదే కనిపిస్తోంది ఓ పోస్టు… అనేక ఖాతాల పేర్లతో అది పదే పదే మన వాల్ మీద ప్రత్యక్షమవుతోంది… అది చూడగానే అది బీబీసీ వార్త అనిపించేలా కనిపిస్తుంది… అది వెంటనే స్థూలంగా మనకు ఏం చెబుతుందంటే..? ‘‘ఒక నేరాంగీకారం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది… నేనేం చేశానో తలుచుకుంటే నాకే సిగ్గేస్తోంది అని ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ చెబుతున్నాడు… అసలు 93 శాతం మందికి ఈ నిజం తెలియదు…’’ అని కరణ్ థాపర్ ఫోటో, ఓ టీవీ యాంకర్ ఫోటోలు కనిపిస్తాయి…
కరణ్ థాపర్ అందరికీ తెలిసిన ప్రఖ్యాత జర్నలిస్టు, నిజమే, ఆయన అందరూ సిగ్గుపడే పని ఏం చేశాడు అనే ఇంట్రస్టు క్రియేట్ చేస్తుంది ఆ పోస్టు… పైగా బీబీసీ వార్త అట… ఇలా మన అటెన్షన్ దానిపై పడుతుంది… మనం ఇదేదో తెలుసుకుందామని క్లిక్ చేస్తామా..? అది మనల్ని ఇంకేదో వెబ్‌సైటులోకి తీసుకుపోతుంది… అక్కడ ఓ స్టోరీ కనిపిస్తుంది… అదేమిటంటే..?
Ads
సన్ టీవీకి సంబంధించిన జర్నలిస్టు పూజిత దేవరాజు కరణ్ థాపర్‌ను ‘వణక్కం తమిళు’ ప్రోగ్రామ్ కోసం ఇంటర్వ్యూ చేసిందట… అందులో ఆమె ఆయన్ని నిలదీస్తుంది… ఒకప్పుడు అద్దె ఇంట్లో ఉండేవాడివి, ఓ చిన్న డొక్కు కారులో తిరిగేవాడివి… అలాంటి నీకు పెద్ద ఇల్లు, పెద్ద కారు ఇంత తక్కువ సమయంలో ఎలా వచ్చాయి..? పెయిడ్ జర్నలిస్టువి అయిపోయావా అని అడుగుతుంది… అందుకు ఆయన సులభంగా డబ్బు సంపాదించే మార్గాలున్నాయి కదా అంటాడు..
ఎహె, తప్పుడు జవాబు అంటుందామె… ఆమె ఫోన్ తీసుకుని, ఏదో సైటు ఓపెన్ చేస్తాడు, మన ఇంటర్వ్యూ అయిపోయే టైమ్‌కు నీ ఆదాయం ఎంత పెరుగుతుందో చూడు అంటాడు… 27 వేల రూపాయల్ని ఆమె పేరిట ఆ సైటుకు జమచేస్తాడు… అరగంటలో ఆ డబ్బు కాస్తా 32 వేలకు పెరుగుతుంది… ఇలా జస్ట్, కొద్ది నెలల్లో ఈ డబ్బు 10 లక్షలకు చేరుకుంటుంది, చూస్తూ ఉండు, నేనూ ఇలాగే డబ్బు సంపాదించాను అని జవాబు చెప్పాడాయన…
దీన్ని నమ్మని మరో జర్నలిస్టు తను కొంత డబ్బు డిపాజిట్ చేస్తాడు… తరువాత గంట రెండు గంటల్లోనే డబ్బు డబుల్ అవుతుంది… ఈ ఇంటర్వ్యూను నిజానికి మేం తొలుత ప్రసారం చేయవద్దనుకున్నాం… కానీ బాగా ఆలోచించి ప్రసారం చేయాలనే నిర్ణయించుకున్నామని సన్ టీవీ యాజమాన్యం చెబుతున్నట్టుగా ఆ స్టోరీ నడుస్తుంది… ఆ స్టోరీలో వాళ్లు చూపించిన లింక్ మనం ఓపెన్ చేస్తే మరో సైటులోకి తీసుకుపోతుంది మనల్ని…
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఫోటో, ఇదంతా నిజమే అన్నట్టుగా ఆయన పేరిట ఓ ప్రకటన, ఆ పక్కనే సేమ్, షారూక్ ఖాన్ ఎండార్స్‌మెంట్ కూడా కనిపిస్తాయి… చాలామంది ఎంతెంత సంపాదించారో ఫోటోలతో సహా సక్సెస్ స్టోరీలు కనిపిస్తాయి… దాని పేరు Immediate Bitwave… ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఆల్గరిథమ్స్ వల్ల ఈ సంపాదన సాధ్యమవుతున్నట్టు నమ్మపలుకుతుంది ఆ సైట్… డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో కూడా చెబుతుంది… మేం మీ తరఫున క్రిప్టోకరెన్సీని ట్రేడింగ్ చేస్తామంటుంది…
ఇక్కడ ఆగండి… మనం ఫేక్ అని చెప్పుకున్నాం కదా ఈ కథనం మొదట్లోనే… ఎస్, ఇదీ అదే… ఓ పెద్ద స్కాండల్… బీబీసీ, సన్‌టీవీ, కరణ్ థాపర్, షారూక్, సుందర్ పిచాయ్ పేర్లను వాడుకుంటూ ఫేక్ మార్కెటింగ్ చేసుకుంటున్న స్కాం… విచిత్రమేమిటంటే ఇలాంటి స్కాం పోస్టుల్ని కూడా ఫేస్‌బుక్ స్వయంగా ప్రమోట్ చేస్తుంది… డబ్బు తీసుకుని…!! చివరకు కరణ్ థాపర్ ఇదంతా ఫేక్ అనీ, నాకూ ఆ పోస్టులకు సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది… ఫేక్ మార్కెటింగ్ దందా ఎలా విస్తృతమవుతున్నదో, మనల్ని ఆ ఫేక్ ట్రాపుల్లోకి ఎలా లాగుతున్నారో చెప్పడమే ఈ కథన ఉద్దేశం… బహుపరాక్…
Share this Article