అంతా నిజమే… బీఆర్ఎస్‌లో ఎన్డీయేలో చేరడానికి సంప్రదింపులు నిజం… కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేయాలనుకున్నది నిజం… మోడీని ఆశీస్సులు అడిగిన మాట నిజం… మొన్నామధ్య బహిరంగంగానే మోడీ ఈ విషయాన్ని వెల్లడించడం నిజం… మోడీ బయటపెట్టాక కేటీయార్ తీవ్రంగా ఖండించాడు…
పొల్లు మాటలు, నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన ఆశీస్సులు దేనికి..? మా ఎమ్మెల్యేలు తలుచుకుంటే అవుతుంది గానీ ఆయనెవరు నన్ను ముఖ్యమంత్రిని చేయడానికి…. అంటూ సీరియస్‌గా విరుచుకుపడ్డాడు మోడీ మాటలపై… అప్పుడు కూడా కేసీయార్ సైలెంట్… ఒక్కముక్క కూడా మాట్లాడలేదు… ఇప్పుడు నోరువిప్పాడు…
ఇండియాటుడే ఇంటర్వ్యూలో అంగీకరించాడు… కానీ మోడి చెప్పిన మాటలు నిజమని అంగీకరిస్తూనే చిన్న ట్విస్టులు ఇచ్చాడు… ‘నేను ఎన్డీయేలో చేరతానని అడగలేదు, వాళ్లే అడిగారు’ అన్నాడు… (ఇదే ప్రశ్న తెలంగాణ మెయిన్ స్ట్రీమ్ మీడియా అడిగి ఉంటే ఆ జర్నలిస్టు మీద ఉల్టా దాడి చేసేవాడేమో…) కాకపోతే ప్రైవేటు సంభాషణల్ని ప్రజలకు చెప్పడం ఏమిటని ఆక్షేపిస్తున్నాడు… అంతే…
Ads
అంటే మోడీ మాటల్ని కౌంటర్ చేస్తూ కేటీయార్ చేసిన వ్యాఖ్యలు శుద్ధ తప్పని కేసీయారే తేల్చేస్తున్నాడన్నమాట… ‘‘తెలంగాణకు ఏమైనా చేయండి, చేరతాను అన్నాను, వాళ్లు చేయలేదు, నేను చేరలేదు, 70 ఏళ్లయ్యాక రాజకీయాలు మానుకుంటాను అన్నాను, 50 ఏళ్ల రాజకీయం పూర్తవుతుంది కదా, ఇక వద్దనుకున్నాను’’ అని కూడా కేసీయార్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు…
నిజానికి అప్పట్లోనే పొలిటికల్, జర్నలిస్టిక్ సర్కిళ్లలో అందరికీ తెలుసు… కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి కేసీయార్ సంకల్పించడం, మోడీని అడగడం కూడా నిజమే… ఐతే తన వారసుడిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి మోడీ పర్మిషన్ దేనికి..? తన ఇష్టం, పార్టీ కూడా తనదే కాబట్టి పార్టీ కూడా సై అంటుంది… నో అనదు కదా…
అంటే మోడీ ఆశీస్సులు కోరడం అంటేనే ఏదో యవ్వారం ఉందని లెక్క… అదేమిటనేది మిస్టరీ… హఠాత్తుగా బీఆర్ఎస్, బీజేపీ రహస్య దోస్తులైపోయిన మాట కూడా నిజమే… కవిత అరెస్టు జరగకపోవడం నుంచి, కాళేశ్వరం అవినీతిని పట్టించుకోకపోవడం, ఇతర కేసీయార్‌కు అనుకూలించే నిర్ణయాలకు బీజేపీ పూనుకోవడం దాకా అందరికీ అర్థమైపోతూనే ఉన్నాయి…
బీజేపీయే కేసీయార్‌ను ఎన్డీయేలో చేరాలని అడిగిందని కేసీయార్ చెబుతున్నాడు… కాదు, తనే ఎన్డీయేలో చేర్చుకోవాలని అడిగాడు అని మోడీ చెప్పాడు… వాళ్ల మధ్య ఈ చర్చ వచ్చిన మాట నిజమే అన్నట్టు కదా… కుటుంబ వారసత్వాన్ని బీజేపీ అంగీకరించదు, అందుకే చేర్చుకోలేదు అని మోడీ అంటాడు… ఎన్డీయేలో చేరాలంటే తెలంగాణకు మంచి చేయాలని అడిగానని కేసీయార్ చెబుతున్నాడు… రెండూ హిపోక్రటిక్ స్టేట్‌మెంట్లే… భ్రమాత్మక ప్రకటనలే…
ఇదే బీజేపీ ఆమధ్య ఓ ఆరోపణ చేసింది… కేసీయార్ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు భారీగా ఎన్నికల ధనసాయం చేశాడని…! అంటే మోడీ కాదన్నాడని కాంగ్రెస్ కూటమి వైపు మొగ్గు చూపాడా కేసీయార్..? అంతేకాదు, కాంగ్రెస్, ఇతర విపక్షాలు అంగీకరిస్తే ఆ పార్టీలన్నింటి ఎన్నికల ఖర్చు తానే భరిస్తానని అన్నట్టు ఓ జాతీయ జర్నలిస్టు చెప్పాడు ఆమధ్య…
అంత డబ్బు కేసీయార్‌కు ఎలా వచ్చిందనేది పక్కన పెడితే… ఎన్డీయేలో చేరిక ప్రయత్నాలు, కాంగ్రెస్ కూటమితో దోస్తీ దగ్గర నుంచి సొంత జాతీయ పార్టీ ఏర్పాటు దాకా… తెలంగాణ సమాజానికి ఏమీ అంతుపట్టని అడుగులు కేసీయార్ వేశాడన్నట్టే… ఈ అన్ని అడుగులూ ఫెయిలైన తీరు మాత్రమే తెలంగాణ సమాజానికి కనిపిస్తోంది… ఏ అడుగు వెనుక ఏ ఎత్తుగడ ఉందో తను మాత్రం చెప్పడు… చెప్పడు… చెబితే తను కేసీయార్ ఎలా అవుతాడు..?
Share this Article